ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు: స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల జీవిత చరిత్ర, అప్పటి పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 రోజుల పాటు ఉచితంగా గాంధీ సినిమాను ప్రదర్శిస్తోందని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ చెప్పారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ముగింపులో భాగంగా ఈ నెల 24 వరకు జిల్లాలోని థియేటర్లలో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు గాంధీ సినిమాను విద్యార్థులకు ఉచితంగా చూపించనున్నట్లు తెలిపారు. బుధవారం ఖమ్మంలోని ఏషియన్ సాయిరాం, తిరుమల 70 ఎంఎం థియేటర్లలో స్టూడెంట్లు, సీపీ విష్ణు.ఎస్.వారియర్‌తో కలిసి కలెక్టర్గాంధీ సినిమాను వీక్షించారు.
మొత్తం 17 థియేటర్లలో ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని 14 సినిమా థియేటర్లలో 64 వేల మంది విద్యార్థులకు ఉచితంగా గాంధీ సినిమాను చూపించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. పాల్వంచ వెంకటేశ్వర థియేటర్లో బుధవారం గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి వీక్షించారు. గాంధీ సినిమా ప్రదర్శించే థియేటర్లను తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పోలీస్, మున్సిపల్ కమిషనర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్‌వెంట విద్యా శాఖ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ కే సైదులు, డీపీఆర్ఓ శ్రీనివాసరావు, పాల్వంచ డిప్యూటీ తహసీల్దార్ వినయశీల, ఎంఈఓ శ్రీరామ్మూర్తి ఉన్నారు.