
- ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఫ్రీ ట్రీట్మెంట్
- క్లిష్టమైన సర్జరీలకు యూకే డాక్టర్ల సహకారం
- అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్న డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: పుట్టుకతో గుండె సమస్యలు ఉన్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తున్నది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ వేల గుండెలకు ఊపిరిపోస్తున్నది. కార్పొరేట్ ఆసుపత్రులు చేతులెత్తేసిన కేసులకు సైతం ఇక్కడ విజయవంతంగా చికిత్స అందిస్తుండటంతో రోజురోజుకూ రోగుల తాకిడి పెరుగుతున్నది.
నిమ్స్ హాస్పిటల్ లో పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ ప్రారంభించిన రెండేండ్ల కాలంలోనే వెయ్యికి పైగా గుండె సంబంధిత సర్జరీలు చేయడం విశేషం. వరల్డ్ క్లాస్ ఎక్విప్ మెంట్, అనుభవజ్ఞులైన డాక్టర్లు, సర్జన్ల ద్వారా చికిత్స అందిస్తుండడంతో సక్సెస్ రేటు కూడా ఎక్కువే ఉంది. ఉచితంగా ట్రీట్మెంట్ అందుతుండడంతో మన రాష్ట్రం నుంచే కాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నిమ్స్‌లో సర్జరీలు చేయిస్తున్నారు.
వెయ్యికిపైగా హార్ట్ సర్జరీలు..
నిమ్స్ పీడియాట్రిక్ కార్డియాలజీ ఐసీయూ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయ్యికి పైనే గుండె సంబంధిత సర్జీలు చేశారు. రెండేండ్ల క్రితం ఐసీయూ ప్రారంభ సమయంలో నెలకు 20 నుంచి 25 సర్జరీలు చేయగా, ప్రస్తుతం నెలకు సగటున 35 సర్జరీలు చేస్తున్నారు. శిశువు పుట్టిన వెంటనే చేసే సర్జరీల నుంచి, ఏడాదికి, రెండేండ్లకు, ఐదేండ్లకు ఇలా పరిమిత సమయంలోపే చేసే సర్జరీలు ఉంటాయి. ఆ సమయంలోపు చేయకపోతే ఆ సమస్యలు ముదిరి తీవ్ర అనారోగ్యానికి దారితీస్తాయి.
అప్పుడే పుట్టిన పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. అలాంటివారు నిమ్స్ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో గుండెకు హోల్స్ పడటం(ఇందులో కూడా రకాలు ఉంటాయి), గుండె సరిగ్గా కొట్టుకోకపోవడం, అబ్ నార్మల్ కనెక్షన్స్ తదితర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. హోల్స్ కు సంబంధించి కొన్నిటికి సర్జరీలు అవసరం ఉండదు. నిమ్స్ హాస్పిటల్ కు వచ్చే కేసులు ఎక్కువగా క్రిటికల్ లో ఉన్నవే వస్తుంటాయని డాక్టర్లు చెబుతున్నారు. సమస్యలను బట్టి పరిమిత సమయంలోపే చికిత్స అవసరమని సూచిస్తున్నారు.
ఓల్డ్ బిల్డింగ్ లోని 6వ వార్డులో..
నిమ్స్‌లోని కార్డియో థోరాసిక్ హెచ్ వోడీ డాక్టర్ అమరేష్ రావు నేతృత్వంలోని డాక్టర్ ప్రవీణ్. డాక్టర్ గోపాల్ టీమ్ పిల్లలకు సర్జరీలు చేస్తున్నారు. పిల్లల్లో గుండె సర్జీలకు సంబంధించి మరింత సమాచారం కావాల్సినవారు నిమ్స్ హాస్పిటల్ లోని ఓల్డ్ బిల్డింగ్ లోని 6వ వార్డులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ అమరేశ్ ను సంప్రదించాలని, లేదా 78933 37836 నంబర్ కు కాల్ చేయాలని నిమ్స్
అధికారులు సూచించారు.
యూకే డాక్టర్ల సహకారం..
నిమ్స్ ఎన్నో అధునాతన చికిత్సలు అందిస్తూ ప్రభుత్వ రంగ హాస్పిటల్స్ లో తనదైన ముద్ర వేసుకుంటున్నది. గుండె మార్పిడి చికిత్సల నుంచి రోబోటిక్ చికిత్సల వరకు.. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందే వైద్యాన్ని నిమ్స్ లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. నిమ్స్ లో అనుభవజ్ఞులైన డాక్టర్లు, సర్జన్లు ఉన్నారు. అయినప్పటికీ.. కొన్ని క్లిష్టమైన సర్జరీల విషయంలో యూకే నుంచి ప్రతిఏడాది వచ్చే డాక్టర్ల చేత సర్జీలను నిర్వహిస్తున్నారు. యూకే డాక్టర్ల బృందం ఇప్పటికీ మూడు సార్లు నిమ్స్ ను సందర్శించి, వైద్యసేవలను అందించింది. ఈ ఏడాది సెప్టెంబర్ లో డాక్టర్ రమణ నేతృత్వంలోని యూకే టీమ్ నిమ్స్ ను సందర్శించి వైద్య సేవలను అందించనున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.