స్టూడెంట్లకు ఫ్రీ ఇంటర్నెట్!

  • సిటీ ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్​ ప్రణాళికలు
  • పార్టీ మేనిఫెస్టో కమిటీ నిర్ణయం
  • ఆటోవాలాలకు సంక్షేమ పథకం
  • వచ్చే నెల 2 నుంచి జిల్లాల టూర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్టూడెంట్లకు ఫ్రీ ఇంటర్​నెట్ సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఆటో డ్రైవర్లకు కూడా ఓ స్పెషల్ హామీ మేనిఫెస్టోలో చేర్చాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అక్టోబర్ 2 నుంచి జిల్లాల టూర్​కు వెళ్లాలని కూడా నిర్ణయించింది. శుక్రవారం గాంధీభవన్​లో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. 

పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒక్కో రోజు రెండు జిల్లాల్లో పర్యటించి.. మేనిఫెస్టోలో పెట్టాల్సిన అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోవాలని డిసైడ్ అయినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. ముందుగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఐదు రోజుల్లోనే టూర్ కంప్లీట్ చేయాల్సిందిగా నేతలకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సూచించినట్టు సమాచారం. 

మరోవైపు, సిటీ కాంగ్రెస్ లీడర్లకు హైదరాబాద్ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు, సిటీలో ఉన్న సమస్యలు, వాటిని పరిష్కరించే అంశాలను స్టడీ చేసే బాధ్యతను ఇచ్చిన్టటు సమాచారం. కాగా, సీఆర్పీఎఫ్ మాజీ జవాన్లు తమ సమస్యలపై.. శ్రీధర్ బాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క, మాజీ మంత్రులు సంభాని చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి బైకాని లింగం యాదవ్ పాల్గొన్నారు.