- ఫస్ట్ డే ఆర్టీసీ బస్సుల్లో కిక్కిరిసిన స్త్రీలు
కరీంనగర్, వెలుగు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్స్ కు ఫ్రీ జర్నీ పండుగలా ప్రారంభమైంది. కరీంనగర్ బస్ స్టేషన్ తోపాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని చోట్ల శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. కాంగ్రెస్ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఒకటైన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల్లోనే అమల్లోకి వచ్చింది. దీనిపై మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్ జెండర్స్ హర్షం వ్యక్తం చేశారు. స్కీమ్ తొలిరోజు బస్సుల్లో రష్ కనిపించింది.
666 బస్సుల్లో ఫ్రీ జర్నీ
కరీంనగర్ రీజియన్ పరిధిలో 11 డిపోలు ఉండగా 459 పల్లె వెలుగు బస్సులు, 207 ఎక్స్ ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ బస్సుల ద్వారా నిత్యం సుమారు 3 లక్షల మంది ప్రయాణికులు జర్నీ చేస్తుండగా వీరిలో సగం మంది మహిళలే ఉంటున్నారు.
వేడుకలా మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభం
కరీంనగర్ జిల్లా హాస్పిటల్ వద్ద మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. అంతకుముందు రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల సాయం పోస్టర్ ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన థర్డ్ జండర్లను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమిస్తామన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జిల్లాకేంద్రాలతో పాటు నియోజకవర్గ, మండలకేంద్రాల్లోనూ కాంగ్రెస్లీడర్లు, అధికారులు మహాలక్ష్మి స్కీమును ప్రారంభించారు. జగిత్యాలలో జీవన్‌రెడ్డి, హుజూరాబాద్‌లో వొడితల ప్రణవ్, సిరిసిల్లలో కలెక్టర్ అనురాగ్‌జయంతి పాల్గొన్నారు.
ఇంత తొందరగా స్టార్ట్ చేస్తారనుకోలే..
కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి స్కీమ్ ను ఇంత తొందరగా అమల్లోకి తీసుకవస్తదనుకోలేదు. నేను హైదరాబాద్ నుంచి వేములవాడకు వెళ్తున్నా వచ్చిపోవడానికి కనీసం రూ. 800 ఖర్చవుతుండే. ఈ డబ్బులు నాకు మిగిలాయి. ఈ డబ్బులతో ఇంట్లోకి కిరాణం సామాను తీసుకొవచ్చు. ఈ స్కీమ్ పేద మహిళలకు ఎంతో ఆసరా కానుంది. --_శారద, హైదరాబాద్(గృహిణి)
విద్యార్థులకు ఎంతో మేలు..
మహలక్ష్మి పథకం తీసుకొచ్చి నా లాంటి స్టూడెంట్స్ కు ఎంతో మేలు చేస్తుంది. నేను ప్రతిమ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్నాను. కాలేజీకి వచ్చి పోవడానికి నాకు నెలకు చాలా ఖర్చువుతోంది. కరీంనగర్‌లో చదువుకోవడానికి నాలాగా వేలాది మంది విద్యార్థినులు వస్తున్నారు. అందరికీ ఫ్రీ బస్సు జర్నీ కల్పించడం ప్రభుత్వం కొనసాగించాలి. _అక్షయ, మెడికో, సిరిసిల్ల