- 250 ఎంఎల్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం యోచన
హైదరాబాద్, వెలుగు: అంగన్ వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు 250 ఎంఎల్ పాలు సరఫరా చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీమ్ ను అమలు చేయనుంది. ఇందుకు ఫండ్స్ కేటాయించాలని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ.. డిప్యూటీ సీఎం, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్కకు ప్రతిపాదనలు అందజేసింది. బుధవారం సెక్రటేరియెట్ లో పంచాయతీ రాజ్, మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ప్రీ బడ్జెట్ మీటింగ్ జరిగింది.
వచ్చే బడ్జెట్ లో ఈ స్కీమ్ లకు నిధులు కేటాయించాలని కోరుతూ అధికారులు పలు ప్రతిపాదనలు ఆయనకు అందజేశారు. రాష్ట్రంలో సుమారు 17లక్షల మంది పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలకు వస్తున్నారని, వారికి 250 ఎంఎల్ చొప్పున పాలు అందించేందుకు రూ.70 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. పోషకాహార లోపంతో చిన్న పిల్లలు చనిపోకూడదనే లక్ష్యంతో.. రాష్ట్రాన్ని పోషకాహార లోప రహిత స్టేట్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ఏం చర్యలు చేపట్టాలనే అంశంపై అధికారులు పలు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు.
అంగన్ వాడీ కేంద్రాలు లేని చోట కొత్తవి నిర్మించాలని ప్రభుత్వం రెడీగా ఉన్నప్పటికీ.. అర్బన్ ఏరియాలు, హైదరాబాద్ లో ల్యాండ్ అందుబాటులో లేదని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ వెహికల్స్ ద్వారా అంగన్ వాడీల్లో ఉంటున్న పిల్లలకు పాలు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, రాష్ట్రంలో ఉన్న శిశు విహార్ లు, జువైనల్ హోమ్స్ లో దశల వారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని మహిళా స్త్రీ శిశు కమిషనరేట్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేండ్ల లోపు పిల్లల రక్షణకు రాష్ట్రంలో వెయ్యి బేబీ కేర్ క్రష్ సెంటర్లను ఏర్పాటు చేయటానికి ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఫైనాన్స్ మినిస్టర్ ను మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కోరింది.