
- అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు గిరిజన చరిత్రతో కూడిన నోట్ బుక్స్ ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి 6 నోట్ బుక్స్ ఫ్రీగా ఇస్తుండగా, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి స్టూడెంట్ కు 17 నుంచి 25 నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 3వ తరగతి విద్యార్థులకు 5 నోట్ బుక్స్ చొప్పున, 4, 5వ తరగతుల వారికి 6 చొప్పున, 6వ తరగతి స్టూడెంట్లకు 17 చొప్పున, ఏడో తరగతి విద్యార్థులకు 19 నోట్ బుక్స్, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు 25 నోట్ బుక్స్ చొప్పున రాష్ర్ట ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
రాష్ర్టంలో మొత్తం 1.10 లక్షల మంది గిరిజన విద్యార్థులు ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్లలో చదువుతున్నారు. ఈ వారంలో ప్రింటింగ్ పూర్తికానుందని, ఈ నెల 20 లోపు విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నోట్ బుక్స్ లో రాంజీ గోండు, కుమ్రం భీం, సంత్ సేవాలాల్ మహారాజ్ చరిత్రతో పాటు మేడారం జాతర, నాగోబా జాతర, సంత్ సేవాలాల్ జయంతి, గాంధారి మైసమ్మ జాతర, బౌరమ్మ జాతర, ఎరుకల నాంచారమ్మ జాతర, పులాజీ బాబా జయంతి వంటివి కూడా ప్రభుత్వం పబ్లిష్ చేసింది.
దీంతో గిరిజన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుందని ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు పేర్కొన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలతో తొలిసారిగా ట్రైబల్ చరిత్రను నోట్ బుక్స్ లో పొందుపరిచామని తెలిపారు.