ఖమ్మం జిల్లాలో రేషన్​ షాపులకు చేరుతున్న సన్న బియ్యం

ఖమ్మం జిల్లాలో రేషన్​ షాపులకు చేరుతున్న సన్న బియ్యం
  • ఒకటో తారీఖు నుంచి జిల్లాలో పంపిణీకి ఏర్పాట్లు
  •  ఉమ్మడి జిల్లాలో 7,05,428 రేషన్ ​కార్డులు
  • కొత్తగా 50 వేలకు పైగా కార్డులు వచ్చే అవకాశం 
  • మొత్తం12 వేల మెట్రిక్​టన్నుల బియ్యం అవసరమవుతాయని అంచనా

ఖమ్మం/ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేషన్​ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ పథకాన్ని ఆదివారం నల్గొండ జిల్లా హుజూర్​నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. జిల్లాల్లో మాత్రం ఏప్రిల్​1 నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సివిల్ సప్లయ్​అధికారులకు ఆదేశాలు అందడంతో పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నారు. 

పెరగనున్న 50 వేలకు పైగా రేషన్ కార్డులు.. ​

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో  మొత్తం 7,05,428 రేషన్​ కార్డులున్నాయని అధికారులు చెబుతున్నారు. వీటికి సుమారు 12 వేల మెట్రిక్​ టన్నుల బియ్యం అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే కొత్త రేషన్​ కార్డులతో పాటు పాత కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తులు తీసుకుంది. ఆ అప్లికేషన్లపై ప్రస్తుతం విచారణ జరుగుతుండగా, ఏప్రిల్ నుంచి కొత్త కార్డులు అందుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇలా 26,932 మంది పేర్లు కొత్తగా కార్డుల్లో జమయ్యాయని తెలిపారు. రెండు జిల్లాల్లో కలిపి కొత్తగా 50 వేలకు పైగా కార్డులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే కొత్త కార్డుల సంఖ్యపై క్లారిటీ వస్తుందంటున్నారు. 

మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగా 109 రేషన్ షాపులకు ప్రతిపాదనలు పంపి మూడేండ్లు దాటినా ఇంతవరకు మంజూరు కాలేదు. ఏప్రిల్ నెల నుంచి సన్న బియ్యం పంపిణీ నేపథ్యంలో రేషన్ షాపుల్లో ఇప్పటికే నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి డీలర్లది. దొడ్డు నిల్వలను షాపుల్లోనే ఉంచాలంటూ ఆఫీసర్లు చెప్తున్నారని డీలర్లు పేర్కొంటున్నారు. ఓ వైపు దొడ్డు బియ్యం నిల్వలతో ప్రస్తుతం రానున్న సన్నబియ్యాన్ని ఎక్కడ నిల్వ చేయాలో అర్థం కావడం లేదని పలువురు డీలర్లు వాపోతున్నారు.

అక్రమ రవాణాకు చెక్​? 

ఇన్నేళ్లుగా రేషన్​ బియ్యాన్ని అక్రమంగా వినియోగదారులు, రేషన్​ డీలర్లు బ్లాక్​ మార్కెట్ కు తరలించే విధానానికి ఇకపై చెక్​ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. దొడ్డు బియ్యం తినేందుకు ఇష్టపడని వారు ఎక్కువ మంది బియ్యాన్ని మధ్యవర్తులకు అమ్మేవారు. వినియోగదారులు తీసుకోకుండా రేషన్​ షాపుల్లో మిగిలిన బియ్యాన్ని కూడా డీలర్లు పక్కదారి పట్టిస్తారనే ఆరోపణలు ఉండేవి. వాటిని ఒక్కచోటకు చేర్చి కోళ్ల దాణాగా ఉపయోగించడంతో పాటు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు కూడా ఎగుమతి చేసేవారు. బీర్​ఫ్యాక్టరీలకు ముడిసరుకుగా బియ్యాన్ని ఉపయోగించేవారు. ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ కావడంతో కార్డుదారులే వాటిని తిసేందుకు ఆసక్తి చూపిస్తారని, దీని వల్ల పేదలకు తినే బియ్యం ఇవ్వాలనే ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలోని కార్డుల వివరాలు.. 

జిల్లా రేషన్​ షాపులు రేషన్​ కార్డులు బియ్యం(మెట్రిక్​ టన్నుల్లో)
ఖమ్మం                         748    4,11,428    7,375.868
భద్రాద్రి కొత్తగూడెం                443    2,94,000    5,600