అన్నీ ఉచిత పథకాలు చెడ్డవి కాదు, అలాగని అన్నీ మంచివి కాదు, రండి ఉచిత పథకాలని అర్థం చేసుకుందాం... ఈ దేశం, రాష్ట్రం గుప్పెడు రాజకీయ నాయకులది కాదు,130 కోట్ల సామాన్య ప్రజలది. దేశం ఆర్థికంగా బాగున్నప్పుడే మనమంతా బాగుంటాం. ఆర్థిక క్రమశిక్షణ లేక దివాళా తీసిన వేనెజులా, జింబాబ్వే, శ్రీలంక లాంటి దేశాల్లో రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, రోడ్డున పడ్డది ప్రజలు మాత్రమే.ఉచిత పథకాలు ఇచ్చినన్ని రోజులు జేజేలు కొట్టారు. దేశం దివాళా తీసాక గగ్గోలు పెడుతున్నారు.
ఓట్ల ఉచితాలతో ఏదేశమూ బాగుపడలేదు
ఎన్నికల్లో గెలుపే ముఖ్యమని భావించి అధిక భాగం వివిధ ప్రజాకర్షక పథకాల మీద ఖర్చు చేయటమే గొప్ప పరిపాలన, గొప్ప మేధస్సు అవుతుందా? ఇలాంటి ఉచిత పంపిణీ పథకాల వలన ఏ దేశం గానీ, ప్రాంతం గానీ అభివృద్ది చెందిన దాఖలాలు ఉన్నాయా? ఇక్కడ కేవలం పాలించే వారిని మాత్రమే తప్పు పట్టలేము. ఏ రాజకీయ పార్టీ అయినా, నాయకుడు అయినా అధికారంలో ఉండటానికి ఆ అధికారాన్ని కాపాడుకోవటానికే ప్రయత్నిస్తారు. దానికి సులువైన మార్గాన్ని ఎంచుకుంటారు. ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు తాత్కాలిక లాభాలను కలిగించే పథకాలకే అధికంగా ఆకర్షితులవుతున్నారు. అవే ఎన్నికలలో గెలుపుకు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనినే పాలకులు వంట పట్టించుకున్నారు. ఇంకా నిరాశను కలిగించే అంశం ఏమిటంటే క్రమంగా అన్ని రాష్ట్రాలు, అందరు నాయకులు వీటి వైపే మొగ్గు చూపుతుండటం భవిష్యత్ పై ఆందోళన కలిగిస్తుంది.
అభివృద్ధి లేని సంక్షేమం అనర్థం
ప్రజలలో అధిక భాగం కనీస అవగాహన కలిగి ఉన్నవారే, పథకాలకు పంచే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అర్థం చేసుకోగలిగిన వారే.. అయినా కూడా ఉచిత పథకాలు ప్రకటించిన నాయకులు, పార్టీలకే ఆకర్షితులవుతున్నారు. కానీ నిజానిజాలు తెలుసుకొని విశ్లేషించుకోవలసిన బాధ్యత ప్రతి పౌరుని పై ఉంది. ఒకసారి అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలని గమనించినా, ఆసియా ఖండంలో వెనుకబడిన దేశాలుగా ఉండి, ప్రస్తుతం అభివృద్ది చెందిన చైనా, జపాన్ వంటి దేశాలు చిన్న పాటి సింగపూర్, తైవాన్ లాంటి దేశాలు తమ ఆదాయంలో అధిక భాగం మౌలికవసతులు, అన్ని రంగాలలో సాంకేతికత, రవాణా, పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల పెంపు వంటి దీర్ఘకాలిక అభివృద్ధి కి అవసరమైన రంగాలపై వ్యయం చేసి అభివృద్ధిని సాధిస్తున్నాయి.
నష్టపోయేది ప్రజలే
అలా అని సంక్షేమ పథకాలను వ్యతిరేకించాలని కాదు, బలహీన వర్గాల వారికి చేయూత అందించవలసిన అవసరం తప్పకుండా ఉంది. కానీ అది కూడా పరిమితులకు లోబడి ఉండాలి. ప్రణాళికేతర వ్యయాలు పెరగటం ఆర్థిక వ్యవస్థ కి మంచిది కాదు. ఖర్చుపెట్టే ప్రతి రూపాయికి భవిష్యత్లో అధిక లాభం చేకూరే విధంగా, ఆదాయం పెరిగే విధంగా ప్రభుత్వాల ఆర్ధిక విధానం ఉండాలి. ప్రజలు కూడా అందరూ ఓటింగ్లో పాల్గొని తాయిలాలకు, తాత్కాలిక పథకాలకు కాకుండా నిజమైన అభివృద్దికే తాము ఓటేస్తామన్న విషయాన్ని స్పష్టం చేసినపుడే ఆర్థిక వ్యవస్థ కి మరింత నష్టం జరగకుండా ఆపే అవకాశం ఉంది. లేదంటే ఎన్నికలు ఓట్లే కేంద్రంగా వ్యవస్థలన్నీ పని చేస్తాయి. దీనివల్ల చివరికి నష్టపోయేది ప్రజలు మాత్రమే.
ఓట్ల పంటకు అప్పులు
నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణ ప్రాంతాల వారు అధిక శాతం ఓటింగ్ లో పాల్గొనటం వలన మొత్తం ఓట్లలో 30 నుంచి 45 శాతం ఓట్లు పొందిన వారు విజయం సాధిస్తున్నారు. ప్రతి నాయకుడు కూడా ఓటింగ్ కు అధికంగా వచ్చే వర్గాలను మాత్రం ఆకట్టుకుని, పథకాలు ప్రకటించి మచ్చిక చేసుకుంటే విజయం సాధించవచ్చనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సాధారణంగా ఆర్థిక వ్యవస్థకి మేలు చేయని ఇలాంటి పథకాలను వ్యతిరేకిస్తే ప్రజలలో సంక్షేమాన్ని వద్దంటున్నారు అన్న చెడ్డపేరు ఆపాదిస్తారని భయపడి ఇతర నాయకులు, మేధావులు కూడా ఈ విషయాలను బహిరంగంగా తెలపలేకపోతున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రస్తుత రాబడిలో అధిక భాగం వీటిపై ఖర్చు చేయడమే కాకుండా, అప్పులు చేయడంతో పాటు, పరిమిత వనరులైన భూములు, ఆస్తులు అమ్మకం చేసి మరీ వీటికి కేటాయించి భవిష్యత్ తరాలకు కూడా నష్టాన్ని కలుగచేస్తున్నారు.
- పి. అన్వేష్ కుమార్,వనపర్తి