ఏప్రిల్ 25 నుంచి ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం

ఏప్రిల్ 25 నుంచి ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం

నస్పూర్, వెలుగు: వేసవి సెలవుల్లో జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో ఉచిత సైన్స్ శిబిరం నిర్వహిస్తున్నారని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో డీఈవో యాదయ్య, జిల్లా సైన్స్ అధికారి మధుబాబుతో కలిసి సైన్స్ సమ్మర్ క్యాంప్ వాల్‌‌‌‌పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రయోగాత్మక విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థి దశ నుంచి విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. 

వేసవి సెలవుల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి 12 రోజుల పాటు జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర హైస్కూల్​లో ఉచిత సైన్స్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో 9, 10 క్లాసుల స్టూడెంట్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తారని, గూగుల్ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో జిల్లా నుంచి మొత్తం 100 మంది విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నూతన ఆవిష్కరణలు రూపొందించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.