ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఫ్రీ సీట్లేవీ?: హైకోర్టు

ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు ఫ్రీ సీట్లేవీ?: హైకోర్టు

కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టాన్ని ఎందుకు అమలు చేయట్లేదు?

సర్కార్ కు హైకోర్టు ప్రశ్న..  కౌంటర్ వేయాలని ఆదేశం

హైదరాబాద్, వెలుగు: కంపల్సరీ ఎడ్యుకేషన్ చట్టాన్ని పదేండ్లుగా ఎందుకు అమలు చేయట్లేదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలన్న కీలక చట్టాన్ని అమలు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదో వివరిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులిచ్చింది.

2010లో ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం వస్తే ఇప్పటి వరకూ అమలు చేయలేదంటూ దాఖలైన పలు పిల్స్ ను చీఫ్ జస్టిస్ రాఘవేం ద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల విచారించింది. 2017లో దాఖలైన పిల్ తర్వాత దాఖలైన పిల్స్ అన్నింటి పైనా ప్రభుత్వ వాదనను తెలియజేస్తూ కౌంటర్ పిటిషన్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ‘‘ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించాలని ఉచిత విద్యా హక్కు చట్టం చెబుతోంది. దానికయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. తర్వాత ఆ ఖర్చులో 60 శాతం కేంద్రం నుంచి రాబట్టుకోవాలి. కానీ, పదేళ్లుగా చట్టం అమలు చేయలేదు’’ అని పిటిషనర్లు కోర్టుకు తెలియజేశారు. దీంతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కొంత టైం కావాలని ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్ కుమార్ కోరడంతో.. విచారణను సెప్టెంబర్ 4కు వాయిదా వేసింది.