- ఇందిర జలప్రభ స్కీమ్ లో ఇవ్వనున్న సర్కారు
- వచ్చే నెల బడ్జెట్ లో నిధులు కేటాయించనున్న ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిరిజన రైతులకు 100 శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే, బోరు వేసేందుకు అయ్యే ఖర్చుతో పాటు మోటారు కూడా ఇవ్వనున్నారు. దీంతో రాష్ట్రంలో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ( ఆర్వో ఎఫ్ ఆర్) కింద నాలుగు ఎకరాల లోపు భూములు సాగు చేస్తున్న 2,30,735 లక్షల మందికి లబ్ధి జరగనుందని ట్రైబల్ అధికారులు చెప్తున్నారు.
ఈ స్కీమ్ కు ఇందిర జలప్రభ పేరు పెట్టాలని సీఎం దృష్టికి మంత్రి సీతక్క తీసుకెళ్లగా.. అందుకు సీఎం అంగీకరించారు. దశల వారీగా ప్రతి ఏటా కొంత మందికి ఇవ్వనున్నారు. ప్రతి ఏటా 50 వేల ఎకరాలకు ఈ స్కీమ్ వర్తింపజేయాలని నిర్ణయించగా.. ఏడాదికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో రైతుకు యూనిట్ కాస్ట్ రూ.6 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తో ట్రైబల్ శాఖ అధికారులు మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ స్కీమ్ ను అమలు చేసే బాధ్యత పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించగా, నోడల్ ఏజెన్సీగా ట్రైబల్ డిపార్ట్ మెంట్ వ్యవహరించనుంది. స్కీమ్ మానిటరింగ్ ను ఐటీడీఏలకు ప్రభుత్వం అప్పగించనుంది.
బడ్జెట్ లో ప్రకటించి.. నిధులు కేటాయింపు
వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రకటించి.. నిధులు కేటాయించనుంది. ఈ స్కీమ్ అమలుకు సబ్ ప్లాన్ ఫండ్స్ తో పాటు ఇరిగేషన్, ఫారెస్ట్, అగ్రికల్చర్, హార్టికల్చర్, పవర్, ట్రైబల్ శాఖల నుంచి నిధులు ఖర్చు చేయనున్నారు. ఇటీవల గిరిజన నేతలతో సీఎం చేపట్టిన రివ్యూలో ఈ స్కీమ్ అమలుపై డిటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం గిరిజన శాఖ అధికారులను ఆదేశించారు.
కాగా, ఈ స్కీమ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ధాత్రి ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ స్కీమ్ కింద నిధులు సుమారు 40 శాతం వస్తాయని ట్రైబల్ అధికారులు చెప్తున్నారు. దేశంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి గత ఏడాది అక్టోబర్ లో జార్ఖండ్ లో ప్రధాని మోదీ ఈ స్కీమ్ ను లాంఛ్ చేశారు. కాగా.. రాష్ట్రంలో గిరిజన శాఖ నుంచి ఏ పనులు చేపట్టాల్సి ఉంది? ఎన్ని నిధులు అవసరం? అన్నది కేంద్ర గిరిజన శాఖకు రిపోర్ట్ పంపారు. దీంతో వచ్చే నెల కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయిస్తారన్న అంశంపై స్పష్టత రానుంది.