- ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఇండియా– ఇంగ్లండ్ టెస్ట్ నిర్వహిస్తాం
- హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 నుంచి జరిగే ఇండియా, ఇంగ్లండ్ తొలి టెస్టు మ్యాచ్‌ను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్ అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. నాలుగు దిక్కుల పైకప్పు (కనోపీ), కొత్త సీటింగ్, లైటింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్లతో సరికొత్తగా తీర్చిదిద్దిన స్టేడియంలో జరగబోయే తొలి మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌కు అద్భుత అనుభూతిని ఇస్తుందన్నారు.
ఉప్పల్ స్టేడియంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లతో కలిసి మ్యాచ్ ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు. ‘హెచ్‌సీఏ కొత్త అపెక్స్ బాడీ ఎన్నికైన తర్వాత ఉప్పల్‌లో జరిగే తొలి మ్యాచ్ ఇది. రెండు పెద్ద జట్ల టెస్ట్ మ్యాచ్‌ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిర్వహించేందుకు హెచ్‌సీఏ తరఫున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం.
రోజుకు ఐదు వేల మంది చొప్పున ఈ మ్యాచ్‌కు 25 వేల మంది స్కూల్ స్టూడెంట్స్‌కు స్టేడియంలో ఫ్రీ ఎంట్రీతో పాటు లంచ్, వాటర్ అందిస్తాం. రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఈ నెల 26న నగరంలోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందికి సైతం ఉచిత పాసులు అందించాలని నిర్ణయించాం. టెస్ట్ మ్యాచ్ టికెట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అన్ని టికెట్లను ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంచుతున్నాం’ అని చెప్పారు.
హైదరాబాద్ చేరుకున్న ఇండియా.. నేటి నుంచి ప్రాక్టీస్
టీమిండియా ప్లేయర్లు శనివారం విడతల వారీగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇంగ్లండ్ ఆదివారం సిటీకి రానుంది. టీమిండియాకు పార్క్ హయత్‌లో, ఇంగ్లండ్‌కు తాజ్ డెక్కన్‌లో బస ఏర్పాటు చేశారు. ఇండియా ప్లేయర్లు ఆదివారం నుంచి ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. సోమవారం ఇంగ్లండ్ ప్రాక్టీస్ షురూ చేస్తుంది.
వివేక్, వినోద్‌కు హెచ్‌సీఏ సన్మానం
శంషాబాద్.వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామిని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు శనివారం ఘనంగా సన్మానించారు. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షులైన వివేక్, వినోద్‌ను ప్రస్తుత కార్యవర్గ సభ్యులతో పాటు రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లా సంఘాల సభ్యులు అభినందించారు. తుక్కుగూడలో జరిగిన ఈ సన్మాన సభలో వంద మంది హెచ్‌సీఏ సభ్యులు పాల్గొన్నారు.