సిటీలో సరిగా అమలు కాని ఫ్రీ వాటర్ స్కీమ్

సిటీలో సరిగా అమలు కాని ఫ్రీ వాటర్ స్కీమ్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో ఫ్రీ వాటర్ స్కీమ్​ అమలు తీరు సరిగా లేదు. స్కీమ్ ​ప్రారంభించి ఏడాది దాటినా కూ డా కొంతమందికి ఇంకా వర్తించడంలేదు. మరికొందరికి గత ఫిబ్రవరి నుంచి ఏదో ఒక సాకు చెబుతూ వాటర్​బోర్డు బిల్లులు జారీ చేస్తోంది. 2020 డిసెంబ‌‌ర్ లో 20 వేల లీటర్ల  ఫ్రీ స్కీమ్​ని గ్రేటర్​ సిటీలో జలమండలి అమలు చేస్తోంది. మురికివాడల్లోనైతే పూర్తిగా ఉచితంగా నీటిని పంపిణీ చేస్తామని వెల్లడించింది. అయితే పలు కారణాలతో చాలా మందికి ఇప్పటికి ఉచిత నీరు సరఫరా కావడంలేదు. ఇంకొందరికి స్కీమ్​పై అపోహలు తొలగట్లేదు. జలమండలి పరిధిలో డొమెస్టిక్‌‌ కేటగిరిలో దాదాపు 9 లక్షల84వేల  కనెక్షన్లు, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరిలో దాదాపు 45 వేల వరకు కనెక్షన్‌‌లు ఉన్నాయి.  మొత్తంగా డొమెస్టిక్​ కనెక్షన్లు ఉన్న వారికి 2.5 లక్షల కుటుంబాలకు మాత్రమే 20 వేల లీటర్ల నీరు అందుతుంటే, ముకివాడల్లో మరో 2 లక్షల కుటుంబాలకు కూడా అందిస్తున్నట్లు జలమండలి రికార్డులు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి వరకు ఉచితంగా నీరు సరఫరా జరిగిన ఇండ్లకు ఏదో ఒక కారణం చెబుతూ మళ్లీ బిల్లులను జారీ చేస్తున్నారు. అసలు మీటర్లను చూడకుండానే జలమండలి సిబ్బంది ఇస్టానుసారంగా బిల్లులను ఇచ్చి వెళ్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

శేరిలింగంపల్లి పరిధి నెహ్రూనగర్​కు చెందిన అనిత ఇంట్లో నల్లాకు గత జనవరి వరకు ఫ్రీ వాటర్​ స్కీమ్ ​వర్తించింది. ఫిబ్రవరి నుంచి బిల్లును జలమండలి జారీ చేస్తోంది.  ఆ కుటుంబం నెలలో 17 వేల లీటర్లలోపు నీళ్లు వాడినా కూడా బిల్లు ఇచ్చారు. ఇదేంటని వాటర్​బోర్డు అధికారులను అడిగితే ఫ్రీ వాటర్​ స్కీమ్​కి అనర్హులని చెప్పారు. మొన్నటి వరకు జీరో బిల్లు వచ్చిన ఇంటికి మళ్లీ బిల్లు ఇస్తున్నారు. ఇలా సిటీలో చాలామందికి వాటర్​బోర్డు బిల్లులు అందజేస్తోంది.

ప్రతీ కుటుంబానికని చెప్పి..

డొమెస్టిక్ -స్లమ్‌‌, డొమెస్టిక్- ఇండివిడ్యువ‌‌ల్‌‌, మ‌‌ల్టీస్టోర్డ్ బిల్డింగ్‌‌(ఎంఎస్‌‌బీ), గేటెడ్ క‌‌మ్యూనిటీ ఇలా కేట‌‌గిరీల కింద ప్రతి ఒక్కరూ అర్హులని స్కీమ్​ప్రారంభించేటప్పుడు మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి ఇల్లు, ఫ్లాట్‌‌, యూనిట్ కు నెల‌‌కు 20 వేల లీట‌‌ర్ల వ‌‌ర‌‌కు వాడుకునేవారు స్కీమ్​కింద అర్హుల‌‌ని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంట్లో ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు. ఎన్ని కిచెన్​లు ఉన్నాయి. ఇంటి స్థలం, నిర్మాణం ఎంతలో ఉంది. ఇన్​కమ్​ట్యాక్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​ఇలా తదితర కారణాలు తెలుసుకుంటూ బిల్లులను ఇస్తున్నారు. ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండి,  ఒకే వాటర్​మీటర్​ ఉంటే  స్కీమ్ కి అనర్హులంటూ బిల్లులు కట్టాలని జలమండలి అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. 

కొత్త మీటర్లు పెట్టుకోవాలని చెప్పట్లే..

 ఫ్రీ వాటర్ అర్హతకు​ ఆధార్ సీడింగ్, నల్లా మీటర్లపై జనాలకు జలమండలి సరిగా అవగాహన కల్పించలేకపోయింది. కొందరు ఆధార్ సీడింగ్ పూర్తి చేసినా కూడా వాటర్ బోర్డు సిబ్బంది బిల్లులు జారీ చేశారు. దీనిపై అధికారులకు చెబితే, మీటర్ పని చేయకపోవడంతో బిల్లులు జారీ అయినట్లు సమాధానం ఇచ్చారు.  కొత్త మీటర్లు పెట్టుకోవాలని కూడా క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు.  ఇప్పటికీ వేలల్లో  నల్లాలకు మీటర్లు పని చేయట్లేదని సమాచారం.  నల్లా మీటర్ లేని వారికి బిల్లులను మాత్రం జలమండలి అందిస్తూనే ఉంది. మీటర్లు బిగించాల్సిన సిబ్బంది కూడా పట్టించుకోకుండా నెలకోసారి వచ్చి బిల్లులను ఇస్తున్నారు. 
వేలల్లో ఫిర్యాదులు
కొత్తపేట్​లోని టెలిఫోన్​ కాలనీ, కూకట్ పల్లి లోని మిథిలానగర్, శేరిలింగంపల్లిలోని నెహ్రూనగర్, ఆర్​కేపురం, బోడుప్పల్, బేగంపేట్​ఇలా సిటీలోని చాలా ప్రాంతాల్లో డిసెంబర్​వరకు ఫ్రీ వాటర్​నీరు సరఫరా చేశారు. ఇలాంటి వారికి కూడా బిల్లులు ఇస్తున్నారు. కొందరు ఆధార్ లింక్ చేసినా కూడా ఫ్రీ వాటర్​ స్కీమ్ వర్తింప చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ట్విట్టర్, జలమండలి అధికారులకు ఫిర్యాదులు చేస్తుండగా, బిల్లుల పైనే ఎక్కువగా ఉంటున్నాయి. వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నా కూడా అధికారులు సమస్యను పరిష్కరించడంలేదు. కొన్ని మురికివాడల్లోనూ బిల్లులు అందిస్తున్నారు. ఇటీవల బేగంపేట్​లోని జేజేనగర్​లో వినియోగదారులు బిల్లులను చేతిలో పట్టుకొని ఆందోళనకు కూడా దిగారు. చాలా ప్రాంతాల్లో బిల్లులు జారీ చేస్తుండడంతో వాటర్​బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

ఫ్రీ వాటర్ అని చెప్పి మోసం చేస్తరా..?

మేము జాయింట్ ​ఫ్యామిలీగా ఉంటున్నం.12 మందిమి ఒకే ఇంట్లో ఉంటాం. మాకు ఒకటే నల్లా కనెక్షన్ ఉంది. గత జనవరి వరకు ఫ్రీ వాటర్ స్కీమ్​వర్తింపజేశారు. ఫిబ్రవరి నుంచి మళ్లీ వాటర్​బిల్లు ఇస్తున్నారు. మీటర్ చెక్​చేయకుండానే జారీ చేస్తున్నారు. రెండు, మూడు రోజులకోసారి అరగంట మాత్రమే నల్లా నీళ్లు ఇస్తున్నారు. ఇలా నెలకు15 వేల లీటర్లు కూడా సరఫరా కావడంలేదు. స్కీమ్​కింద 20 వేల లీటర్ల వరకు ఫ్రీ వాటర్​ అని చెప్పి మోసం చేస్తరా..? 
- శ్రీనివాస్, ఆర్​కేపురం