అనుచిత ఉచితాలతో ప్రజా ఖజానాకు ఉరి

అనుచిత ఉచితాలతో ప్రజా ఖజానాకు ఉరి

ఓట్లు కొనడానికి డబ్బుల పంపిణీ, ప్రలోభ పెట్టడానికి కానుకలు పంచడాన్ని అడ్డుకునే వ్యవస్థ మనకుంది. కానీ, విధానాల పేరు చెప్పి పలు అనుచిత ‘ఉచితాలు’ ప్రకటించి మూకుమ్మడిగా ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందే రాజకీయ పార్టీల ఎత్తుగడలకు అడ్డుకట్ట లేదు. ఫలితంగా అధికారంలోకి వచ్చేందుకో, ఉన్న అధికారాన్ని నిలుపుకునేందుకో ఉచితాలు, రాయితీలు, మాఫీలతో ఖజానా ఖాళీ చేసి రాష్ట్రాలను అప్పుల కుప్ప చేస్తున్న ‘రాజకీయ క్రీడ’కు తెర పడాలి.  ఆ దిశలో క్రమంగా అడుగులు పడుతున్నాయ్​!

‘ఉచితాలు’ అనుచితమని అందరూ అంటారు. కానీ, అమలు పరిచే సమయం వచ్చే సరికి అన్ని రాజకీయ పక్షాలూ ఒకే తాను ముక్కలు. రాష్ట్ర–దేశ ఆర్థిక పరిస్థితి ఏమైనా సరే.. తమ రాజకీయ ప్రయోజనం నెరవేరితే చాలు! ఎన్నికల ఏరు దాటి,  అధికారపు ఆవలి గట్టు చేరేలా, లెక్కలేకుండా ప్రజాధనం వెచ్చించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకే ఈ ఉచితాలు తప్ప అభివృద్ధికి అవరోధమే! దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఉత్తర్​ప్రదేశ్ సభలో మాట్లాడుతూ.. ఇదే నొక్కి చెప్పారు. ‘ఉచితాల సంస్కృతి నుంచి సమకాలీన రాజకీయాలకు విముక్తి కల్పించేందుకు ప్రజలు, ముఖ్యంగా యువత ముందుకు రావాల’ని పిలుపునిచ్చారు. కానీ, ఆయనే నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో చేసిందేమిటి?  పరిశుద్ధ రాజకీయాలని పదే పదే మాట్లాడే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో సరే, పంజాబ్​లో 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తానని ‘ఉచితాల’ ఊతకర్ర సాయంతో ఎన్నికల ఏరు దాటిన తీరును ఏమనాలి? తాజాగా గుజరాత్​లో చేసిన ప్రకటనను ఎలా చూడాలి? రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది, జరుగుతున్నది, రేపు జరగబోయేది ఏమిటి? నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరిట చేసిన ప్రకటన సారాంశమేంటి? గత పాతిక‌‌‌‌–ముఫ్పై ఏండ్లుగా తమిళనాట ద్రవిడ పార్టీలు, పోటీలు పడి చేస్తున్న ఎన్నికల ఉచిత సంతర్పణల్ని ఎలా పరిగణించాలె! సమ్మిళిత అభివృద్ధి కోసం సంక్షేమ పథకాల అవసరం ఉన్నప్పటికీ అన్నీ ఒక గాటన కట్టలేం! సదరు సంక్షేమ కార్యక్రమాలకు–ఓట్లు రాల్చే ఫక్తు ఉచితాలకూ మధ్య నుంచే సన్నని పొరను ఎప్పుడో చెరిపేశాయి రాజకీయ పార్టీలు. పౌరుల్ని మనుషులుగా కాకుండా ఓటర్లుగానే చూసే సంస్కృతితో.. సంక్షేమ పథకాల ముసుగులో రాయితీలు, ఉచితాలు, ఇతర తాయిలాలతో ప్రలోభపెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థల్ని చిద్రం చేస్తున్నాయి. మొన్న వెనిజులా, నిన్న థాయ్​లాండ్, ఇవాల్టి శ్రీలంక నేర్పిన పాఠాలు నేడు చర్చకొస్తున్నాయ్! కానీ, అది సరిపోదు. గుణపాఠాలైతే తప్ప మనం మారం.

అందరి మనసులో అదే ఉంది

రెండు పిటిషన్లను స్వీకరించి, విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఉచితాలను నియంత్రించడమెలా? అని తీవ్రంగా యోచిస్తోంది. సుప్రీం ఆదేశాల మేరకు నియమావళి రూపొందించే ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. రాజకీయ పక్షాలతో సంప్రదింపులు ఆరంభించింది. నిర్దిష్ట చట్టం లేకుండా, ‘మీరు ఉచితాలు ప్రకటించకూడదు’ అని పార్టీలను కట్టడి చేయలేమని, అది చట్టాతీత చర్య అవుతుందని ఎన్నికల సంఘం సుప్రీంకు నివేదించింది. ‘ఈ విషయంలో మీరేమైనా ఆలోచిస్తున్నారా? దీనికి అడ్డుకట్ట ఎలా?’ చెప్పండంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుకు కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పందించాల్సి ఉంది. దీనికి చరమగీతం పాడుదామని మరోవంక  ప్రధాని  దేశ ప్రజలకు తాజాగా పిలుపునిచ్చారు. ఇబ్బడిముబ్బడి సబ్సిడీలు, ఎన్నికల తాయిలాలు, వివిధ సామాజిక వర్గాల్ని దువ్వే నగదు ప్రయోజనాలతో ఖజానా ఖాళీ అయి ఆర్థిక వ్యవస్థ చితికిపోతుందని, పొరుగు దేశం శ్రీలంక రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల్ని అందరూ ఉటంకిస్తున్న ప్రస్తుత పరిస్థితి తరచూ చర్చకొస్తోంది. ప్రసార మాధ్యమాలు కూడా ఎలుగెత్తి చాటుతున్నాయి. ఉచితాలకు పగ్గం పడేలా ఏదైనా విధాన నిర్ణయం, నియంత్రించే ఒక వ్యవస్థ ఏర్పాటు, తద్వారా ఆర్థిక క్రమశిక్షణ సాధనకు ఇదే అత్యుత్తమ సమయం. ఈ అనుచిత ఉచితాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలై, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారినం.

ఖజానా యజమానులా? నిర్వాహకులా?

ప్రజల పన్నులతో, జాతీయ వనరులతో, ఇతర రాబడులతో నిండే ప్రజాఖజానాను ప్రభుత్వాలు ఇష్టానుసారం ఖర్చు చేయడం తరచూ వివాదాస్పదమౌతోంది. ఈ పరిస్థితి లోగడ లేదు. ఏదున్నా బడ్జెట్​లో ప్రతిపాదించడం, చట్టసభలో చర్చించి–ఆమోదించడం, ఆ మేర వ్యయం చేయడం వల్ల దానికో పవిత్రత ఉండేది. స్వల్ప మార్పులుంటే సవరించిన అంచనాలు–వ్యయాలతో మళ్లీ సభానుమతి పొందడమో, వ్యయం చేసి సభ ఆమోదం(రాటిఫికేషన్) పొందడమో జరిగేది. ఇప్పుడవేవీ లేవు. ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఏవేవో ఉచితాలు ప్రకటిస్తున్నారు. ఓటరు కరుణించి అధికారం కట్టబెడితే, ‘రాబడి–వ్యయం’ సమీకరణంతో నిమిత్తం లేకుండా తెగించి ఉచితాలు, రాయితీలతో ప్రజా ఖజానా ఖాళీ చేయడానికీ వెనుకాడటం లేదు. దాంతో, ఆర్థిక పరిస్థితి అతలాకుతలమౌతోంది.  ప్రజా ఖజానా అడ్డదిడ్డంగా ఖర్చు చేయడమేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఉచితాల సంస్కృతిపై  ప్రధాని చేసిన ప్రకటన, తమనుద్దేశించే.. అనుకున్నారేమో ఆప్ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. విద్య, వైద్యం, విద్యుత్తు, తాగునీరు వంటి విషయాల్లో ప్రజలకిచ్చే ప్రయోజనాలను అనుచిత ఉచితాలుగా చూడొద్దన్నారు. అవసరాల్లో ఉన్న యోగ్యులను గుర్తించి, ఆదుకోవడం అభివృద్ధి–సంక్షేమంలో భాగమౌతుందన్నారు. దేశ సంపదైన బ్యాంకుల్ని ముంచే ఆశ్రిత వర్గాలకు మేలు చేసే మినహాయింపులు, విదేశాలకు పంపి వారి బాగోగులు చూసుకోవడం లాంటి ఉచితాలు కావివి’అని ఘాటైన ప్రతివిమర్శ చేశారు. అంతటితో ఆగకుండా, తాము అధికారంలోకి వస్తే... గుజరాత్​లోనూ 300 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇస్తామని 
తాజాగా ప్రకటించారు.

రాజకీయ చిత్తశుద్ధి ముఖ్యం

ఉచితాలు, నగదు బదిలీ,  సబ్సిడీల ద్వారా కొన్ని సార్లు పాలకపక్షాలకు సానుకూలత లభించే ఆస్కారం ఉంటుంది. జన్​ధన్ ఖాత–ఆధార్–మొబైల్ (జేఏఎమ్–జామ్) ద్వారా మొత్తం (36)  కేంద్ర–రాష్ట్ర పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా యూపీలో​ బీజేపీ చేసిందనేది అభియోగం. ఎన్నికల్లో వారికదే లాభించిందని విశ్లేషణలొచ్చాయి. 2019 ఎన్నికలప్పుడు ఏపీలో నాటి సీఎం చంద్రబాబునాయుడు, పథకాల పేరిట  ప్రజాధనాన్ని పచ్చిగా ఓటర్లకు పంచి పెట్టినా ఆయనకు లభించిన ఫలితం బండి సున్నా! అనుచిత ఉచితాలు.. ఖజానాకు భారమై ఆర్థిక అస్థిరతకే కాకుండా ఎన్నికల్లో రాజకీయ పార్టీల అవకాశాల్లో అసమతుల్యతకు కారణమౌతాయనే వాదనా ఉంది. అందరికీ ఏకరీతిలో వర్తించేటట్టు ‘ఉచితాల’ను కట్టడి చేసే సంస్కరణలకు రాజకీయ పార్టీలన్నీ ముందుకు రావాలి. ప్రధాని చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన పార్టీల అధినేతల్ని పిలిచి ఒక సమావేశం పెట్టాలి. అంతా కలిసి, చిత్తశుద్ధితో ఓ పరిష్కారం కనుక్కోవాలి. అదెలా ఉన్నా.. ఓటర్లుగా ప్రజలు అప్రమత్తమై ‘అనుచిత ఉచితాల’తో పార్టీలు లబ్ధిపొందకుండా తమ ఓటు అస్త్రాన్ని ఒడుపుగా ప్రయోగించాలి. అదే, మన ఆర్థిక వ్యవస్థలకు రక్ష!

చర్యలకు ఇప్పుడున్న వ్యవస్థ చాలదు!

ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరుగుతున్న మన ఎగుడుదిగుడు సమాజంలో అట్టడుగు నుంచే బడుగు–బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే! పైగా, మనది సంక్షేమ రాజ్యమని రాజ్యాంగంలో రాసుకున్నాం. అభివృద్ధిలో వారినీ భాగస్వాముల్ని చేసేలా ‘సమ్మిళిత ప్రగతి’ అవసరం. అందుకై చేపట్టే సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, ఆ ముసుగులో యోగ్యతలు, అర్హతలతో నిమిత్తం లేకుండా కేవలం ఓట్లు దండుకునే యావతో ఎవరెవరికో ఉచితాలు ఇవ్వడం, నగదు బదిలీ 

చేయడం పట్లనే అభ్యంతరాలు. ఆ రెండింటి మధ్య ఉండే సన్నని విభజన రేఖను చెరిపేసి, అన్నీ సంక్షేమమే అంటూ ఆర్థిక క్రమశిక్షణ గతి తప్పించటాన్ని ఎవరూ క్షమించరు.  తిండి దొరకని దయనీయ స్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంక మన కళ్లెదుటి ఉదాహరణ! అంతకు ముందే,  వెనిజులా వంటి లాటిన్ అమెరికా దేశాల్లో,  థాయ్​లాండ్, ఇండొనేషియా వంటి ఆగ్నేయాసియా దేశాల్లో తలెత్తిన సంక్షోభాలకు ఇలాంటి ఉచితాలు, నగదు బదిలీలు, అసాధారణ రాయితీల వల్ల పోగైన ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యమే ప్రధాన కారణం. ఆర్థిక సామర్థ్యంతో నిమిత్తం లేకుండా, ఎన్నికల ముందు ఉచితాలు ప్రకటించే, గెలిచి ఖజానా ఖాళీ చేసే రాజకీయ పార్టీల గుర్తులు లాక్కొని, గుర్తింపు రద్దు చేయాలని వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికీ నోటీసులిచ్చింది. వారిప్పటివరకు స్పందించిన దాన్నిబట్టి, ఎన్నికల ప్రణాళికల్లో ఉచితాలు ప్రకటించకుండా ప్రస్తుత చట్టాలతో రాజకీయ పక్షాలని  నియంత్రించలేం. అదనంగా ఇంకేదో కావాలి!

-దిలీప్ రెడ్డి

dileepreddy.r.@v6velugu.com