విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ

విశ్వమానవ వికాసమే పత్రికా స్వేచ్ఛ

ఆఫ్రికా నిరసన గొంతుల్లో నుంచి పుట్టుకొచ్చిన పత్రికా స్వేచ్ఛ మీడియా వ్యవస్థను తలపైకెత్తి చూస్తోంది. మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నిస్తోంది. విధి నిర్వహణలో త్యాగాలు చేసిన పాత్రికేయులను గుర్తు చేసుకుంటోంది.  పత్రికల పని తీరును పరిశీలిస్తూ  భావ ప్రకటన స్వేచ్ఛ మానవ హక్కుల్లో భాగమని నొక్కి చెబుతూ గంభీరంగా గట్టిగా నినదిస్తోంది. ఈ  సందర్భంలో పత్రికా స్వేచ్ఛ  ప్రాధాన్యం ఉన్న అంశంగా అందరికీ తెలుపుతున్నది. పౌరుల మాటకు  విలువనిచ్చి, అవసరమైన చోట ప్రశ్నిస్తూ ఇది తన హక్కు అని అవగాహన పెంచుతోంది.  పత్రికా స్వేచ్ఛ విశ్వ మానవ వికాసానికి దోహదకారి అని ఎలుగెత్తి చాటుతోంది.  పత్రికలకు సైతం  ప్రభుత్వాలు జవాబుదారీగా వ్యవహరించవలసిన అవసరాన్ని వెలికితీస్తోంది. 

జర్నలిజం లక్ష్యం ప్రజాసేవ

జర్నలిజం లక్ష్యం  ప్రజలకు చేసే సేవ మాత్రమే అని గ్రహించినట్లు మహాత్మా గాంధీ పేర్కొన్నారు.  దక్షిణాఫ్రికా నుంచి నడిపిన 'ఇండియన్ ఒపీనియన్' తొలి సంచిక సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని దశాబ్దాల అనంతరం ఆ ఖండం నుంచే పత్రికా స్వేచ్ఛ పురుడు పోసుకుంది. ప్రపంచం మొత్తం ప్రాథమిక హక్కుగా పత్రికా స్వేచ్ఛను  కోరుకుంది. మానవాళి మధ్య మంచి సంబంధాలకు భావ వ్యక్తీకరణే  పునాది అనే నిజాన్ని అందరూ గ్రహించారు. ఆ తర్వాత వాటి సాంకేతిక రూపాలుగా పత్రికలు, ప్రసార మాధ్యమాలు అంకురించాయి.  ప్రస్తుతం ఆధునిక సమాచార వ్యవస్థలో  ప్రపంచం జీవితం గడుపుతోంది. అత్యంత ఆధునిక సమాచారం అందుబాటులోకి వచ్చింది.  నాటి నుంచి భిన్న కోణాల పరిధిలో పత్రికలకు, పాత్రికేయులకు రక్షణ కలిగింది.  ఈ నేపథ్యంలో పత్రికలు బాధ్యతాయుత పాత్ర పోషిస్తున్నాయి.  సూచనలు, సలహాలతో అభివృద్ధి కారకాలుగా మారాయి.

పత్రికా స్వేచ్ఛను సమర్థించిన అంబేద్కర్​

గత కొన్ని దశబ్దాలుగా స్వేచ్ఛా ఆలోచనల పరిధి బాగా పెరిగింది. పారదర్శక సమాచారం మేరకు సాధికారత పొందిన వ్యక్తుల విజయగాథలు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. స్వేచ్ఛ, సుస్థిరాభివృద్ధికి తగిన ప్రాముఖ్యత ఇస్తూ అంతర్జాతీయ సంస్థలు విలువైన తీర్మానాలు తీసుకువచ్చాయి. ఇవి మీడియా స్వతంత్రను కాపాడటమే కాకుండా భావప్రకటనా స్వేచ్ఛకు తోడుగా నిలిచాయి.  రకరకాల మార్గాల్లో  పరిపాలన,  జవాబుదారీతనం,  భాగస్వామ్యం,  భద్రత,  మానవాభివృద్ధిని  ప్రోత్సహించడానికి  మీడియా మహత్తర  సాధనంగా, శక్తిగా మారింది. ఇలాంటి వాటి ద్వారా పేదరిక నిర్మూలనకు దారులు తెరుచుకున్నాయి. ఆ రహదారిలోనే  ఇప్పుడు  ప్రపంచ మీడియా ప్రయాణం చేస్తోంది.  భారత రాజ్యాంగాన్ని రూపొందించే వేళ  డాక్టర్  బీఆర్ అంబేద్కర్ పత్రికా స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. వాక్  స్వాతంత్ర్యం కోసం,  భావప్రకటనా స్వేచ్ఛ కోసం ప్రత్యేక స్థానం అవసరమని వాదించారు. ఆర్టికల్ 19 ( 1) (ఎ ) ప్రకారం భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కుగా ప్రకటించారు. అదే ఆర్టికల్ లోని  క్లాజ్ 2 ప్రకారం రాష్ట్రం విధించే పరిమితులకు లోబడి ఉండేవిధంగా మాత్రమే రాజ్యాంగ పరిషత్తు  దీనికి ఆమోదం తెలిపింది. 

సుప్రీంకోర్టు మైలురాయి తీర్పులు

అమెరికాలో తొలి రాజ్యాంగ సవరణ భావ వ్యక్తీకరణ హక్కుకు మరింత బలం చేకూర్చే విధంగా రూపకల్పన చేశారు. కాగా, మొదటి భారత రాజ్యాంగ సవరణ వాక్ స్వాతంత్ర్య హక్కులను అరికట్టే విధంగా జరిగింది. రాను రానూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొన్ని మైలురాయి తీర్పులను వెలువరించింది. వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛలో పత్రికా స్వేచ్ఛ ముఖ్య భాగమని పేర్కొంది. దీనికి ఉదాహరణలుగా రోమేష్ థాపర్ –  స్టేట్ అప్ మద్రాస్,  బ్రిజ్ భూషణ్ – ఢిల్లీ స్టేట్ ల మధ్య జరిగిన కేసులు ఈ కోవకు చెందినవే అని తెలిపింది.  ఆ తర్వాత ఈ కేసుల ఆధారంగా మనదేశంలో ఎన్నో పత్రికలకు, పాత్రికేయులకు న్యాయస్థానాల్లో విజయాలు దక్కాయి.  

స్వేచ్ఛ పరిణామం

ఎన్నో కీలక ఘట్టాల్లో, అత్యవసర పరిస్థితుల్లో  ప్రపంచ దేశాలను, వాటి గౌరవాలను పరిరక్షించిన శక్తి పత్రికలకు మాత్రమే సాధ్యమని.. గత ఏడాది యునెస్కో ఆధ్వర్యంలో ఉరుగ్వే దేశం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను రక్షించడానికి యునెస్కో నిరంతరం పాటుపడుతోంది. ఇది హక్కుగా అన్ని దేశాల్లోనూ అమల్లోకి వచ్చింది. పత్రికా స్వేచ్ఛ సద్వినియోగమే ప్రపంచ మానవాభివృద్ధికి  కావలసింది.

- జి. యోగేశ్వరరావు,సీనియర్​ జర్నలిస్టు