ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

నెట్​వర్క్​, వెలుగు : దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫ్రీడమ్​ రన్​ నిర్వహించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు పట్టణాలతో పాటు  మండల కేంద్రాల్లో నిర్వహించిన రన్​లో  ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో నిర్వహించిన 2కే రన్​లో జిల్లా పరిషత్​ చైర్మన్​ కోరం కనకయ్య, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్​ అనుదీప్​, ఎస్పీ వినీత్ తదితరులు, మణుగూరులో ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు ర్యాలీల్లో పాల్గొన్నారు. భద్రాచలంలో  రామాలయంలో ఈవో శివాజీ ఆధ్వర్యంలో ఉద్యోగులు జాతీయ జెండాలతో శ్రీసీతారామచంద్రస్వామి చిత్రపటంతో శోభాయాత్ర నిర్వహించారు.

స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామంలో 330 అడుగుల  భారీ త్రివర్ణ పతాకంతో ప్రభాత భేరి నిర్వహించారు. ర్యాలీని  స్వాతంత్ర్య సమర యోధుడు నల్లమల పుల్లయ్య ప్రారంభించారు. ఖమ్మంలో 2కే ఫ్రీడంరన్​ను జడ్పీ చైర్మెన్​ లింగాల కమల్​రాజు ప్రారంభించారు. సర్ధార్​​ పటేల్​ స్టేడియం నుంచి లకారం ట్యాంక్​బండ్​ వరకు రన్​ సాగింది​.ఇందులో జిల్లా కలెక్టర్​ వీపీ గౌతం, సీపీ విష్ణు ఎస్​ వారియర్, నగరపాలక సంస్ధ కమీషనర్​ ఆదర్శ్​ సురభి, సుడా చైర్మెన్​ బచ్చు విజయ్​కుమార్​తదితరులు పాల్గొన్నారు.  కూసుమంచిలో  పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్​ రన్​ ను ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి ప్రారంభించారు.

ఇన్​ఫార్మర్​ నెపంతో హత్య

భద్రాచలం,వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బీజాపూర్​జిల్లాలో ఇన్​ఫార్మర్​నెపంతో ఓ వ్యక్తిని మావోయిస్టులు బుధవారం అర్ధరాత్రి హత్య చేశారు. బాంగాపాల్​ పోలీస్​స్టేషన్​ పరిధి కవర్​గాం అనే గ్రామం నుంచి గోపీరాం మడకాం అనే వ్యక్తిని ఈనెల 8న మావోయిస్టులు కిడ్నాప్​ చేశారు. కొంతకాలంగా దళాల సమాచారాన్ని పోలీసులకు అందజేస్తున్నాడని మావోయిస్టుల ఆరోపణ. ఎన్నిసార్లు హెచ్చరించినా పద్దతి మార్చుకోకపోవడంతో హతమార్చినట్లు మావోయిస్టులు వదిలిన లెటర్​లో పేర్కొన్నారు. ఘటనను బీజాపూర్​ ఎస్పీ ఆంజనేయ వార్షనేయ్​ ధ్రువీకరించారు. 

డాక్టర్లు బాధ్యతగా పనిచేయాలి

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు: డాక్టర్లు బాధ్యతగా పనిచేయాలని డీఎంహెచ్​ఓ  డాక్టర్​ మాలతి అన్నారు. గురువారం ఖమ్మం  డీఎంహెచ్​ఓ ఆఫీస్ లో పల్లె దవాఖానా మెడికల్​ ఆఫీసర్లకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం జిల్లాలో 107 సబ్​సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చిందని చెప్పారు.  ప్రతిరోజు ఓపీ చూడాలని, శాంపుల్స్​ సేకరించి పీహెచ్​సీల ద్వారా టీహబ్​కు పంపాలన్నారు. ప్రతి గర్భిణీ  ఇంటికి వెళ్లాలని,  సాధారణ కాన్పు అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు పాల్గొన్నారు.

పోలవరం డిజైన్​ మార్చాలి

భద్రాచలం,వెలుగు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బ్యాక్​వాటర్​తో భద్రాచలం పట్టణం, రామాలయం మునిగిపోతాయని,  ముంపును నివారించేందుకు పోలవరం డిజైన్​ను మార్చాలని  అఖిలపక్ష పార్టీ నేతలు డిమాండ్​ చేశారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి భద్రాద్రిని రక్షించుకుందామని అన్నారు.  గురువారం భద్రాచలంలో చందాలింగయ్య దొర అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రావులపల్లి రాంప్రసాద్​, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, కాంగ్రెస్​ లీడర్లు బుడగం శ్రీనివాసరావు, నల్లపు దుర్గాప్రసాద్​, సరెళ్ల నరేశ్​, ఆదివాసీ నేత చిచ్చడి శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ,ఆంధ్రా, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, మహారాష్ట్రలోని పలు గ్రామాలు బ్యాక్​వాటర్​తో మునిగిపోతున్నాయని, ఆదివాసీలను జలసమాధి చేసేఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని నేతలు కోరారు. పరిహారం చెల్లించకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడాన్ని వ్యతిరేకించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు ఆదివాసీలకు భూమికి భూమి, ఆర్​ఆర్​ ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. గుండాల, పురుషోత్తపట్నం, పిచ్చుకులపాడు, ఎటపాక, కన్నాయిగూడెం  పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. జేఏసీగా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టాలని తీర్మానించారు. 

మతాల మధ్య చిచ్చుపెట్టే యత్నం

పంటనష్టం వెంటనే చెల్లించాలి

 

ఖమ్మం కార్పొరేషన్​, వెలుగు : స్వాతంత్ర్య  స్ఫూర్తికి భిన్నంగా మతాల పేరుమీద రక్తపాతం సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన ఆజాదీకా 
గౌరవ్​ యాత్ర నిర్వహించారు.  గోపాలపురం, వెంకటాయపాలెం, తనికెళ్ళ, కొణిజర్ల మీదుగా సాగిన యాత్ర రాత్రి పల్లిపాడుకు చేరుకుంది.  స్వాతంత్ర్య పోరాటంలో అన్ని మతాలవారు పాల్గొన్నారని, ఈ పోరులో మైనారిటీల చరిత్ర లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. అకాలవర్షాలు, గోదావరి వరదలతో నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ. 15 వేల చొప్పున  నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్​, రాయల నాగేశ్వరరావు, పుచ్చకాయల వీరభద్రం, దొబ్బల సౌజన్య, నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు మహ్మద్​ జావీద్​,  కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

హాస్టల్​ వర్కర్ల ధర్నా

పెండింగ్ జీతాలను విడుదల చేయాలని డిమాండ్​ 

గుండాల వెలుగు : హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు  పెండింగ్ లో ఉన్న తొమ్మిది నెలల జీతాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్​చేస్తూ గురువారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు .  చాలీచాలని జీతంతో పని చేసే తమకు జీతాలు ఇవ్వపోవడంవల్ల ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. రోజంతా హాస్టళ్లోనే ఉంటూ వెట్టి చాకిరి చేస్తున్నా ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిగటి లక్ష్మి, కొటెం బాలయ్య, సారయ్య,తొలెం లక్ష్మి పాల్గొన్నారు.

కరెంట్​షాక్ తో ఒకరు మృతి

చండ్రుగొండ ,వెలుగు: కరెంట్​షాక్ తో యువకుడు చనిపోయిన సంఘటన మండలంలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.... చండ్రుగొండ మండలం తిప్పనపల్లి  పంచాయతీ మహ్మద్ నగర్ గ్రామానికి చెందిన నాగుల్ మీరా(31) ఇంట్లో ఫ్రిజ్​ప్లగ్​ను మార్చుతుండగా కరెంట్​షాక్​కొట్టి సృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే చండ్రుగొండ పీహెచ్​సీకి తరలించగా అప్పటికే చనిపోయినట్లు హాస్పిటల్​ సిబ్బంది తెలిపారు. 

విలీన పంచాయతీలను తెలంగాణలో కలపాలి

భద్రాచలం, వెలుగు: గోదావరి కరకట్ట ఎత్తు పెంచి, పొడిగించి నిర్మించాలని, ఆంధ్రాలో విలీనమైన గుండాల, పిచ్చుకులపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, ఎటపాక పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్​చేస్తూ ఈనెల 13,14 తేదీల్లో భద్రాచలంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు మచ్చా వెంకటేశ్వర్లు ప్రకటించారు. బండారు చందర్​రావు భవన్​లో గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1986 తర్వాత ఆ స్థాయిలో 2022 జులైలో వచ్చిన గోదావరి వరద భద్రాచలం పట్టణాన్ని ముంచెత్తిందన్నారు. 

ఆలయ రహదారి పనులు ప్రారంభం

కూసుమంచి, వెలుగు : మండలంలోని జీళ్లచెరువులో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ రహదారి విస్తరణ పనులకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్​రెడ్డి రూ. 50లక్షలు విరాళంగా ఇచ్చారు.  ఎమ్మెల్యే భార్య విజయమ్మ గురువారం  కొబ్బరికాయ కొట్టి పనులను  ప్రారంభించారు. గుడికి రావడానికి సరైన రోడ్డు లేక భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో విస్తరణ పనులు చేపట్టారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ బానోతు శ్రీనివాస్​నాయక్​,డిసీసీబీ డైరెక్టర్​ ఇంటూరి శేఖర్​,ఆలయ చైర్మన్​ బోడ్డు నరేందర్​,ఆత్మ చైర్మన్​ బాలకృష్టారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.