ఫ్రెంచ్ రచయితకు నోబెల్ బహుమతి

ఫ్రెంచ్ రచయితకు నోబెల్ బహుమతి

ఫ్రెంచ్ రచయిత అనీ ఎర్నాక్స్​(82) ను  నోబెల్ బహుమతి వరించింది. సాహిత్య రంగంలో ఆమెకు ఈ అవార్డును ప్రకటించారు. ఈ విషయాన్ని నోబెల్ కమిటీ వెల్లడించింది. జెండర్, లాంగ్వేజ్, క్లాస్ కు సంబంధించిన అంశాల్లో ఉన్న విభేదాలపై తన రచనలతో అనీ ఎర్నాక్స్ చేసిన కృషికి గాను ఈ అవార్డును ప్రకటించారు. 1940లో నార్మాండీలోని యెవ‌టోట్‌లో జన్మించిన అనీ ఎర్నాక్స్.. 30కి పైగా సాహిత్య రచనలు చేశారు. 1974లో  లెస్ ఆర్మోయిర్స్ వైడ్స్ (క్లీన్డ్ అవుట్) అనే స్వీయచరిత్ర నవలతో ఆమె రచయితగా మారింది.  ఆమె ప్రసిద్ధ పుస్తకాలలో ఎ ఉమెన్స్ స్టోరీ, ఎ మ్యాన్స్ ప్లేస్ మరియు సింపుల్ ప్యాషన్ ఉన్నాయి.

నోబెల్‌ బహుమతి ప్రకటన తర్వాత అనీ ఎర్నాక్స్ మీడియాతో మాట్లాడారు. ‘ఇది నాకు చాలా పెద్ద గౌరవం. అలాగే.. గొప్ప బాధ్యత కూడా. ర‌చ‌న అంటే ఓ రాజ‌కీయ చ‌ర్య, సామాజిక అస‌మాన‌త‌ల‌పై దృష్టి పెట్టడ‌మే’ అని అన్నారు. కాగా ఇప్పటికే వైద్య, భౌతిక, రసాయన శాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను  నోబెల్ కమిటీ ప్రకటించింది. వీరికి ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డును ఫ్రధానం చేయనున్నారు. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9లక్షల డాలర్లు) నగదు అందుతుంది.