కార్మికుల మృతికి కారణమెవ్వరు ?

కార్మికుల మృతికి కారణమెవ్వరు ?
  • సింగరేణి గనుల్లో వరుస ప్రమాదాలు.. మృత్యువాత పడుతున్న కార్మికులు
  • గతేడాది ఐదు ప్రమాదాల్లో ఐదుగురు మృతి
  • ప్రస్తుతం ఆరు నెలల్లోనే 4 యాక్సిడెంట్లు, చనిపోయిన ఐదుగురు కార్మికులు
  • రక్షణ చర్యలు చేపట్టడంలో మేనేజ్‌‌మెంట్‌‌ విఫలమైందంటున్న కార్మిక సంఘాలు
  • ఇయ్యాల హైదరాబాద్‌‌లో ట్రైపార్టియేటెడ్‌‌ మీటింగ్‌‌

గోదావరిఖని/భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణి గనుల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలు కార్మికులను కలవరపెడుతున్నాయి. గతేడాది జరిగిన ఐదు ప్రమాదాల్లో ఐదుగురు కార్మికులు చనిపోగా, ఈ ఏడాది ఆరు నెలల్లోనే నాలుగు ప్రమాదాలు జరిగి ఐదుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా రామగుండం రీజియన్‌‌ పరిధిలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు.

ఇందుకు బాధ్యులు ఎవ్వరనే ప్రశ్న కార్మికవర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. అయితే మేనేజ్‌‌మెంట్‌‌ పని ఒత్తిడి పెంచడంతో పాటు, సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే గనుల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సేఫ్టీకి ఫస్ట్‌‌ ప్రయారిటీ ఇస్తున్నామని చెప్తున్న సింగరేణి యాజమాన్యం గత మూడేండ్లుగా పట్టించుకోని ట్రైపార్టియేటెడ్‌ సేఫ్టీ మీటింగ్‌‌ను శుక్రవారం హైదరాబాద్‌‌లో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. 

కార్మికులపై పెరుగుతున్న పని ఒత్తిడి

సింగరేణిలో బొగ్గు గనులు, ఓపెన్‌‌ కాస్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ల్లో సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న మేనేజ్‌‌మెంట్‌‌ మాటలు ఆచరణకు నోచుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇంటర్నల్‌‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌‌లో భాగంగా కార్మికులకు, సూపర్‌‌ వైజర్లకు, కింది స్థాయి సిబ్బందికి రక్షణ చర్యల గురించి అవగాహన కల్పించాలి. సేఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఫర్మార్మెన్స్‌‌ (ఎస్‌‌వోపీ), కోడ్‌‌ ఆఫ్‌‌ ప్రాక్టీస్‌‌ ( సీఓపీ) గురించి కార్మికులకు చెప్పాల్సిన ఆఫీసర్లు నామమాత్రంగా వివరిస్తూ ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నతాధికారుల దృష్టిలో పడేందుకే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వాస్తవంగా ఓపెన్‌‌ కాస్ట్‌‌ 2 ప్రాజెక్ట్‌‌లో షిప్టులలో పనిచేసేందుకు మెకానికల్‌‌ ఫోర్‌‌మెన్లు లేరు. ఎలక్ట్రికల్‌‌ ఫోర్‌‌ మెన్లతోనే మెకానికల్‌‌ పనులు కూడా చేయిస్తూ పని ఒత్తిడి పెంచుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫిట్టర్లపై కూడా పని భారం మోపుతున్నారు. అలాగే మైనింగ్‌‌లో మూడు షిప్టులు, జనరల్‌‌ షిఫ్ట్‌‌లో 26 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే డ్యూటీ చేస్తున్నారు. ఏడాది క్రితం అడ్రియాల లాంగ్‌‌ వాల్‌‌ ప్రాజెక్ట్‌‌ నుంచి ఓపెన్‌‌ కాస్ట్​2 ప్రాజెక్ట్‌‌కు ఆరుగురు ఓవర్‌‌మెన్లు కౌన్సెలింగ్‌‌ ద్వారా సెలెక్ట్‌‌ అయితే ఇప్పటి వరకు వారిని రిలీవ్‌‌ చేయడం లేదు. వారు వస్తే షిప్టు బాధ్యతలు చేపట్టే అవకాశం ఏర్పడుతుంది. ఇలా తక్కువ మందితో ఎక్కువ పనిచేయిస్తుండడంతో వారు పని ఒత్తిడికి గురవుతున్నారు.

ప్రమాదానికి బాధ్యులెవ్వరు ?

ఇటీవల కురుస్తున్న వర్షాలతో సింగరేణి రామగుండం ఏరియా పరిధిలోని ఓపెన్‌‌ కాస్ట్‌‌ 2 ప్రాజెక్ట్‌‌ కింది ప్రాంతంలో ఉన్న సంప్‌‌లో పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈ నీటిని మోటార్ల ద్వారా పంపింగ్‌‌ చేసేందుకు మేనేజ్‌‌మెంట్‌‌ చర్యలు చేపట్టింది. అయితే క్వారీలోని సౌత్‌‌ ఏరియాలో నీటిని పైకి తీసుకెళ్లే పైప్‌‌లైన్లకు లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టేందుకు నాలుగు రోజుల కింద చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా లీకేజీ ఏర్పడిన చోట సుమారు మూడు మీటర్ల లోతు వరకు మట్టిని తొలగించారు.

అయితే పని ప్రదేశానికి ఇరువైపులా మట్టిని ఏటవాలుగా తీసి, దానిని దూరంగా పారబోయాలి. కానీ ఇందుకు విరుద్ధంగా షావల్‌‌ మెషీన్‌‌తో నిట్టనిలువునా గుంత తీసి మట్టిని పక్కనే పోశారు. లీకేజీని అరికట్టే పని ప్రదేశాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు సింగరేణి ప్రాజెక్ట్స్‌‌ అండ్‌‌ ప్లానింగ్‌‌ డైరెక్టర్‌‌ వెంకటేశ్వర్‌‌రెడ్డి సందర్శించారు. ఈ టైంలో ‘ఇంత చిన్న పని నాలుగు రోజులు చేస్తారా ?’ అని ఆఫీసర్లపై మండిపడినట్లు సమాచారం. దీంతో ప్రాజెక్ట్‌‌ అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌ నారాయణ సూచనతో ఇంజినీర్‌‌ తేజ పైప్‌‌లైన్‌‌ లీకేజీని అరికట్టే పనులు చేయించారు.

అయితే పని స్థలం వద్ద మట్టిని నిట్టనిలువునా తొలగించినప్పటికీ అటు డైరెక్టర్‌‌ గానీ, ఇటు పని ప్రదేశం వద్ద ఉన్న అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌, ఇంజినీర్‌‌గానీ ఎవరూ పట్టించుకోలేదు. బుధవారం సాయంత్రం ఫిట్టర్‌‌ వెంకటేశ్వర్లు, జనరల్‌‌ మజ్దూర్‌‌ గాదం విద్యాసాగర్‌‌ కందకంలోకి దిగి పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టికూలడంతో వారు ఊపిరి ఆడక అక్కడికక్కడే చనిపోయారు. మరో వైపు ఉన్న మాదం సమ్మయ్య, శ్రీనివాసరాజు నడుం వరకు మట్టిలో కూరుకుపోవడంతో తోటి కార్మికులకు బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదానికి బాధ్యులెవరన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. కార్మికులు చిన్న తప్పు చేస్తే వారికి లెటర్ల మీద లెటర్లు ఇష్యూ చేస్తూ మానసికంగా ఇబ్బందిపెట్టే మేనేజ్‌‌మెంట్‌‌ ఇప్పుడు ఎవరి మీద చర్యలు తీసుకుంటుందని యూనియన్‌‌ లీడర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఆరున్నర నెలల్లోనే ఐదుగురు మృతి

సింగరేణి కాలరీస్‌‌ కంపెనీలో జనవరి నుంచి ఇప్పటివరకు నాలుగు ప్రమాదాలు జరుగగా ఐదుగురు కార్మికులు చనిపోయారు. ఆర్జీ–1 ఏరియాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు, మందమర్రిలో జరిగిన ప్రమాదంలో ఒక్కరు చనిపోయారు. తాజాగా బుధవారం సాయంత్రం రామగుండం రీజియన్‌‌ పరిధిలోని ఓపెన్‌‌ కాస్ట్‌‌ 2 ప్రాజెక్ట్‌‌లో పైప్‌‌లైన్‌‌ లీకేజీని అరికట్టే పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టి కూలడంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. అలాగే ఈ ఆరున్నర నెలల్లో 36 సీరియస్‌‌ యాక్సిడెంట్లలో 36 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా, 37 రిపోర్టెడ్‌‌ యాక్సిడెంట్లలో 38 మంది గాయపడ్డారు. గతేడాది ఇల్లెందు ఏరియా, ఆర్జీ–1, ఆర్జీ–2 ఏరియాల్లో జరిగిన ప్రమాదాల్లో ఒక్కొక్కరు, ఆర్జీ–3 ఏరియాలో ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయారు. గతేడాది 68 సీరియస్‌‌ యాక్సిడెంట్లు జరుగగా 68 మంది, 69 రిపోర్టెడ్‌‌ యాక్సిడెంట్లలో 70 మంది కార్మికులు గాయాలపాలయ్యారు.

నేడు హైదరాబాద్‌‌లో ట్రైపార్టియేటెడ్‌‌ మీటింగ్‌‌

సింగరేణిలో రక్షణ చర్యలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి డైరెక్టర్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ మైన్స్‌‌ సేఫ్టీ (డీజీఎంఎస్​), సింగరేణి మేనేజమెంట్‌‌తో పాటు గెలిచిన యూనియన్లతో ‘సేప్టీ ట్రైపార్టియేటెడ్‌‌’ మీటింగ్‌‌ నిర్వహించాల్సి ఉంది. కానీ గత మూడేండ్లుగా ఈ మీటింగ్‌‌ జరిగిన దాఖలాలే లేవు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల తర్వాత ఫస్ట్‌‌ టైం శుక్రవారం హైదరాబాద్‌‌లో సేప్టీ ట్రైపార్టియేటెడ్‌‌ మీటింగ్‌‌ నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదాలు జరిగినప్పుడే సింగరేణి యాజమాన్యం హడావుడి చేయడం తప్ప వాటి నివారణపై దృష్టి పెట్టడం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు.