
మెదక్/కౌడిపల్లి/ కొల్చారం, వెలుగు : జిల్లాలోని మెదక్–హైదరాబాద్ నేషనల్ హైవే, హైదరాబాద్– నాగపూర్ నేషనల్ హైవే మీద ఇటీవల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు, ముగ్గురు చనిపోతున్న ఘటనలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రమాదాల్లో భార్యాభర్తలు, మరికొన్ని ఘటనల్లో అన్నదమ్ములు, తల్లిదండ్రులతోపాటు పిల్లలు చనిపోతుండటంతో బాధిత కుటుంబాలకు తీరని శోకం మిగులుతోంది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గత ఆరు నెలల్లలో ఈ రెండు హైవేల మీద జరిగిన ప్రమాదాల్లో 46 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కారణాలు ఇవే..
రెండు హైవేల మీద రాత్రింబవళ్లు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా ఓవర్ టేక్ చేయడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. . మరోవైపు మెదక్–హైదరాబాద్ నేషనల్ హైవేలో పట్టణాలు, గ్రామాలు ఉన్నచోట మాత్రమే డివైడర్, ఫోర్ లైన్ రోడ్డు ఉంది. మిగతా అంతటా టూ లేన్ రోడ్డు మాత్రమే ఉండటం ప్రమాదాలకు దారితీస్తోంది. 765డి హైవే మీద కొల్చారం రైస్‌మిల్, కౌడిపల్లి మండలం ధర్మాసాగర్, అంతారం, నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి, తునికి వద్ద, 44 నంబర్ హైవే మీద నార్సింగి మండలం వల్లూరు, చేగుంట మండలం రెడ్డిపల్లి, మనోహరాబాద్ మండలం కాళ్లకల్, మనోహరాబాద్, దండుపల్లి దగ్గర ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అధికారులువ వెంటనే స్పందించి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్ లుగా గుర్తించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మేలో అంతులేని విషాదాలు..
మే 5న కౌడిపల్లి మండలం ధర్మసాగర్ వద్ద టాటాఏస్ వెహికిల్ లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయి హైదరాబాద్ కు చెందిన భార్యాభర్తలు నాగలింగ రాజు, రమ, మరో బాలిక చనిపోయారు. 12న నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద బైక్ ను డీసీఎం వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో చిలప్ చెడ్ మండలం రహీంగూడ తండాకు చెందిన గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ రవి, ఆయన భార్య అమృత అక్కడికక్కడే మృతి చెందారు. 21న హైదరాబాద్–నిజామాబాద్ నేషనల్ హైవే మీద నార్సింగి మండలం వల్లూరు వద్ద ఇన్నోవా వెహికల్ వెనక నుంచి ఆటోను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు చనిపోయారు.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరుకు చెందిన తండ్రీకొడుకులు శేఖర్, యశ్వంత్, సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన బాల నర్సయ్య, మాణెమ్మ మృతి చెందారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 22న అర్ధరాత్రి కౌడిపల్లి మండలం అంతరం వద్ద ట్రాక్టర్ ను వెనకనుంచి కారు ఢీకొట్టిన ప్రమదంలో కంచన్ పల్లికి చెందిన తల్లీకూతుళ్లు స్వరూప, శ్రీలేఖ స్పాట్లోనే మృతి చెందారు. గాయపడ్డ స్వరూప భర్త మల్లేశం హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు.
26న కొల్చారం జైన్ మందిర్ వద్ద కారును ఆర్టీసీ బస్సు - ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన టేక్మాల్ రామవ్వ కుటుంబ సభ్యులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ లో పెళ్లికి హాజరై కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న టేక్మాల్ నాగరాజు ( 31 ), అతడి అన్న కూతురు హర్షిత (9 నెలలు) స్పాట్లోనే చనిపోయారు. దుర్గగౌడ్(36), అతడి భార్య లావణ్య(32) చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఈనెలలో గత గురువారం కౌడిపల్లి మండలం అంతారం గేట్ దగ్గర ఆటో టీవీఎస్ ఎక్సెల్ ను ఢీకొన్న ప్రమాదంలో మెదక్ మండలం ముగ్దుంపూర్‌కు చెందిన భార్యభర్తలు యాదగిరి, యాదమ్మ స్పాట్లోనే చనిపోయారు.
ప్రమాదాల నివారణకు చర్యలు
మెదక్ –హైదరాబాద్ నేషనల్ హైవే మీద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రదేశాలను బ్లాక్ స్పాట్ లుగా ఐడెంటిఫై చేశాం. ఆయా ప్రదేశాల్లో సూచిక బోర్డులు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తాం. ఫారెస్ట్ ఏరియాలో కూడా మూలమలుపుల వద్ద, రోడ్డు పక్కన ఉన్న చెట్లకు రేడియం స్టిక్కర్ అతికిస్తాం. ట్రాఫిక్ రూల్స్ పాటించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తాం.
- శివప్రసాద్ రెడ్డి, కౌడిపల్లి ఎస్సై