ఇవేం ఆటలు రా బాబూ.. ఒక్కరోజే 95 విమానాలకు బాంబు బెదిరింపులు..

ఇవేం ఆటలు రా బాబూ.. ఒక్కరోజే 95 విమానాలకు బాంబు బెదిరింపులు..

ఢిల్లీ: ఇండియన్ ఎయిర్లైన్స్కు బాంబు బెదిరింపు కాల్స్ బెడద పెద్ద తలనొప్పిగా మారింది. ఇవాళ ఒక్కరోజే (అక్టోబర్ 24, 2024) 95 విమానాలకు భారత్లో బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో భారత విమానయాన శాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఆకాశా ఎయిర్, ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, అలియన్స్ ఎయిర్, స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ విమానాలకు తాజాగా బాంబు బెదిరింపులొచ్చాయ్. 

ఆకాశా ఎయిర్ లైన్స్కు చెందిన25 విమానాలకు, ఎయిర్ ఇండియాకు చెందిన 20 విమానాలకు, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, అలియన్స్ ఎయిర్ ఎయిర్ లైన్స్కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. గడచిన 10 రోజుల్లో భారత్లో 250 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. వీటిల్లో 170 విమానాలకు సోషల్ మీడియా అకౌంట్స్ నుంచే బెదిరింపులు వచ్చినట్లు ప్రభుత్వం తేల్చింది. 

ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ బాంబు బెదిరింపులు వ్యవహారానికి సంబంధించి 8 కేసులు నమోదు చేశారు. ఈ బెదిరింపులు ఎక్కువగా ఒకే ‘ఎక్స్’ అకౌంట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ బాంబు బెదిరింపుల బెడదను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై అక్టోబర్ 19న బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (BCAS) ప్రముఖ ఎయిర్ లైన్స్ సీఈవోలతో, ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించింది. 

ALSO READ | ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించొద్దు....గురు పత్వంత్ సింగ్ పన్నూ హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా బాంబు బెదిరింపుల పేరుతో ఫేక్ కాల్స్ చేయడం క్షమించరాని నేరం అని, కఠిన శిక్ష ఉంటుందని ఇప్పటికే హెచ్చరించింది కూడా. అయినప్పటికీ భారత విమానాలకు బాంబు బెదిరింపుల బెడద తప్పడం లేదు. అయితే ఈ బాంబు బెదిరింపులను ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు. మొదట్లో భయపడి విమానాలను డైవర్ట్ చేయడం చేశారు గానీ ప్రస్తుతం ఈ బాంబు బెదిరింపులను ఎయిర్ లైన్స్ సంస్థలు కూడా సిల్లీగా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. విమాన ప్రయాణికులు కూడా ఈ బాంబు బెదిరింపు కాల్స్ను లైట్ తీసుకుంటున్నారు.