బీఆర్‌‌ఎస్‌‌ ఆందోళనకు తాజా మాజీలు దూరం

  •     ఎక్కడా కనిపించని పైళ్ల, గొంగిడి, గాదరి, బొల్లం, గుంటకండ్ల
  •     మునుగోడులో ఆందోళనే చేయని లీడర్లు

యాదాద్రి, వెలుగు : ఎమ్మెల్సీ కవిత అరెస్‌‌కు నిరసనగా బీఆర్‌‌ఎస్‌‌ నిర్వహించిన ఆందోళనకు తాజా మాజీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. జిల్లా స్థాయి లీడర్లు, కార్యకర్తలు మాత్రమే నామమాత్రంగా ఆందోళన నిర్వహించగా, కొన్ని చోట్ల అసలే పట్టించుకోలేదు. లిక్కర్‌‌ కుంభకోణంలో కవితను శుక్రవారం ఈడీ అరెస్ట్‌‌ చేయడంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలని బీఆర్‌‌ఎస్‌‌ హైకమాండ్‌‌ పిలుపునిచ్చింది. దీంతో యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గకేంద్రాల్లో బీఆర్‌‌ఎస్‌‌ లీడర్లు రాస్తారోకోలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టారు. 

అయితే ఈ ఆందోళనలో కేవలం లీడర్లు, కేడర్‌‌ మాత్రమే పరిమిత సంఖ్యలో పాల్గొనగా మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌‌రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిశోర్‌‌, బొల్లం మల్లయ్య యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి  గుంటకండ్ల జగదీశ్‌‌రెడ్డి దూరంగా ఉన్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌‌ రెడ్డి ఇన్‌‌చార్జ్‌‌గా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో అసలు ఆందోళన కార్యక్రమమే నిర్వహించలేదు. మరికొన్ని చోట్ల ‘అధికారంలో ఉన్నప్పుడు మమ్ములను పట్టించుకోలేదు, ఇప్పుడు కవిత జైలుకు వెళ్తే మేమెందుకు రోడ్డెక్కాలి’ అని పలువురు కార్యకర్తలు ప్రశ్నించడం గమనార్హం 

పైళ్ల పార్టీ మార్పుపై ప్రచారం

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌‌రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. హైకమాండ్‌‌ ఇచ్చిన ఆందోళనకు సైతం హాజరుకాకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. శేఖర్‌‌రెడ్డి త్వరలోనే కాంగ్రెస్‌‌లో  చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.