మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస

సుదీర్ఘ రావణకాష్టం అనంతరం ఇప్పుడిప్పుడే కాస్త చల్లబడిందనుకుంటున్న సమయంలో మణిపూర్‭లో మరోసారి హింస చెలరేగింది. మణిపూర్ లోని జిరిబామ్‌ జిల్లాలో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా మెయితీ, కుకీలు మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఒప్పందం జరిగి గంటలు గడవకముందే మళ్లీ హింస చెలరేగడం ఆందోళనకు గురిచేస్తోన్న అంశం. లాల్పాని గ్రామంలోని ఒక ఇంటిని శుక్రవారం రాత్రి అల్లరిమూకలు తగులబెట్టాయి. ఈ ఘటనలో అల్లరిమూకలు కాల్పులకు సైతం పాల్పడ్డారని అక్కడి అధికారులు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

కాగా గురువారం అస్సాంలోని కాచర్‌లోని CRPF  బళగాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మైతి,  కుకీ కమ్యూనిటీల ప్రతినిధులు శాంతి ఒప్పందానికి వచ్చారు. ఈ ఒప్పంద సమావేశానికి జిరిబామ్ జిల్లా యంత్రాంగం, అస్సాం రైఫిల్స్, CRPF సిబ్బంది మధ్యవర్తిత్వం వహించారు. జిల్లాకు చెందిన తాడూ, పైట్, మిజో సంఘాల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు వర్గాల ప్రతినిధులు కొన్ని తీర్మానాలు చేశారు. అందులో భాగంగా రెండు వర్గాలు కవ్వింపు చర్యలకు పాల్పడకూడదని.. ఆయుధాలు చేపట్టరాదని, హింసను ప్రేరేపించకూడదని నిర్ణయానికి వచ్చాయి. 

ఈ క్రమంలో  మళ్లీ కాల్పులు జరగడం.. హింసాత్మక ఘటనలు చెలరేగడంతో మళ్లీ రెండు గ్రూపులు ఆగస్టు 15న సమావేశం కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికను ప్రకటించడంతో పాటు కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు ప్రస్తుతానికి సాయుధ బళగాలు హింస చెలరేగిన జిరిబామ్‌ జిల్లాలో భారీగా మోహరించి పరిస్థితులు అదుపులోకి తెస్తున్నారు.