
సమ్మర్లో ఐస్‌క్రీమ్ తినని వాళ్లంటూ ఉండరేమో! పైగా వెనీలా, బటర్ స్క్రాచ్, చాకొలెట్, స్ట్రాబెర్రీ, మ్యాంగో.. ఇలా ఐస్‌క్రీమ్‌లో బోలెడు ఫ్లేవర్లు ఉన్నాయి. ఎవరికి నచ్చింది వాళ్లు తింటుంటారు. అయితే అన్నప్రాసన అయ్యాక పిల్లలకు రకరకాల ఫుడ్ ఐటెమ్స్ రుచి చూపించాలనుకుంటారు పేరెంట్స్. వాటిలో ఇప్పుడు ఐస్‌క్రీమ్ కూడా చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది తల్లిపాలతో చేసిన ఐస్‌క్రీమ్! అవాక్కయ్యారా... అసలు విషయమేంటంటే.. ఫ్రిడా బేబీ అనే కంపెనీ బేబీ ప్రొడక్ట్స్ అమ్ముతోంది. అయితే ఫుడ్ ప్రొడక్ట్స్‌లో భాగంగా ఐస్‌క్రీమ్ తయారీలో కొత్త ప్రయోగం చేసింది ఫ్రిడా. అదే బ్రెస్ట్ మిల్క్ ఐస్‌క్రీమ్. ఇందులో స్వీట్నెస్, క్రీమ్, నూట్రియెంట్స్ క్వాలిటీ బాగుంటాయి.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఐస్‌క్రీమ్ తయారీ కోసం వాడినవి నిజంగా తల్లిపాలు కాదు. కానీ, తల్లిపాలలో ఉండే ఒమెగా –3 ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, లాక్టోజ్, ఐరన్, కాల్షియం, జింక్, విటమిన్ –బి, డి వంటి పోషకాలే ఈ ఐస్‌క్రీమ్‌లోనూ ఉన్నాయంటోంది ఆ కంపెనీ. ఇప్పటికే ఈ ఐస్‌క్రీమ్‌ని చాలామంది టేస్ట్ చేసినట్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తున్నారు. బ్రెస్ట్ మిల్క్‌ని వేర్వేరు విధాలుగా వాడిన అనుభవాలను కొందరు ఈ సందర్భంగా పంచుకుంటున్నారు. అయితే, ఇది అధికారికంగా యూఎస్డీఏ అప్రూవల్ పొందలేదని న్యూయార్క్ పోస్ట్ అనే వెబ్సైట్లో తెలిపింది.