లైఫ్‌లోకి ఎంతోమంది వస్తుంటారు.. వెళ్తుంటారు... కానీ, అలా వచ్చినవాళ్లలో బంధం ఏర్పరుచుకొని, చివరివరకు ఉండేది ఫ్రెండ్స్ మాత్రమే. నీకున్న సీక్రెట్స్ దగ్గరనుంచి, నువ్వేంటో పూర్తిగా తెలిసినవాడు కూడా ఫ్రెండే. నీ విషయంలో ప్రపంచం అంతా ఒక దిక్కు ఉన్నా... ‘నీకు నేనున్నా’ అని పక్కన నిలబడతాడు. ఇలా మాటల్లో చెప్పలేని బంధాన్ని కలకాలం నిలుపుకోవాలంటే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి.
ఫ్రెండ్‌షిప్‌లో పొగరు ఉండొద్దు.. అంటే.. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అనే భావం ఉండొద్దు. ఉద్యోగం, డబ్బు విషయంలో ఇలాంటివి బయటపడతాయి. వాటివల్ల దురుసుగా ప్రవర్తించడం, లోకువగా మాట్లాడటం చేస్తుంటారు కొందరు. ఒకవేళ మీరు ఇలా చేస్తుంటే ముందు మీ ఫ్రెండ్‌షిప్‌కి రెస్పెక్ట్ ఇచ్చి సారీ చెప్పాలి. దానివల్ల వ్యక్తుల మధ్య దూరం తగ్గుతుంది.
- ఫ్రెండ్స్ అంటే సినిమాలకి, షికార్లకి తోడుగా వెళ్లేవాడే కాదు. ప్రతి చిన్న విషయంలో సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్ ఇచ్చేవాడు.
- చాలామందికి ఇంట్లోవాళ్లకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటివల్ల భయపడతారు. బాధ పడతారు.
- అలాంటప్పుడు వాళ్లకి ధైర్యం చెప్పి, తోడుగా ఉండాల్సింది ఫ్రెండ్.
- కొన్ని విషయాల్లో ‘అది చేయకు, ఇది చేయక’ని అడ్డుపడుతుంటారు కొందరు. అలా చేసేవాళ్లని ‘వీళ్ల మాటేంటి వినేద’ని, ‘నా విషయంలో వీళ్లెందుకు కలుగ చేసుకుంటున్నార’ని అనుకోవద్దు.
- అది మీ మీదున్న ప్రేమతో మీపై కేరింగ్ తీసుకోవటమే. అలాంటి వాళ్ల మాటలు ఓపిగ్గా వినాలి. వాళ్లతో మాట్లాడి, విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి.
- ఫ్యామిలీతో కంటే ఫ్రెండ్స్ దగ్గరే అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటారు. సీక్రెట్‌లన్నీ ఒకరివి ఇంకొకరికి తెలిసుంటాయి.
- ప్రతీ ఒక్కరూ వాటిని సీక్రెట్‌గానే మెయింటెయిన్ చేయాలి కూడా. అలా కాకుండా మధ్యలో వచ్చిన మూడో వ్యక్తికి ఉన్న సీక్రెట్లన్నీ చెప్తే మీ మధ్య ఉన్న నమ్మకం పోతుంది. అందుకని సీక్రెట్ విషయాలు ఇంకొకరితో షేర్ చేసుకోవద్దు.
- ఇవేకాకుండా దాపరికాలు కూడా ఉండకూడదు. దోస్తు ఒకవేళ మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంటే, మీరుకూడా అన్నింటినీ షేర్ చేసుకోవాలి. అప్పుడే ఇద్దరి మధ్య స్నేహబంధం బలపడుతుంది.
ALSO READ : ఐబొమ్మ మారిపోయింది.. డౌన్లోడ్ ఆప్షన్ కూడా వచ్చేసింది
- కొంతమంది ఫ్రెండ్స్ దగ్గరకూడా గొప్పలు చెప్పుకుంటుంటారు. వాటివల్ల చెప్పేవాడికి బాగానే ఉన్నా వినేవాడికి విసుగొస్తుంది. అలా విన్న ప్రతీసారీ అవతలివాళ్ల మీద నెగెటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. అది పెరిగి వాళ్లు దూరమయ్మే అవకాశం ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్‌తో నిజాయితీగా ఉండాలి.
- ‘నీకంటే నేనే గొప్ప’, ‘నాకే ఎక్కువ తెలుసు’, ‘నేను చెప్పిందే వినాలి’ అనే టైప్ ఫ్రెండ్స్ కొందరుంటారు. అన్నీ అందరికీ నచ్చాలని ఉండదు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకి ఉంటాయి.
- అందుకే ఏదైనా చేసే ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. వాటికి విలువ ఇవ్వాలి.
- ఫ్రెండ్‌షిప్‌లో గొడవలు కామన్. చిన్న విషయాలకు అలకలుంటాయి. ఇలా జరిగినప్పుడు తప్పు చేసిన వాళ్లు ముందు సారీ చెప్పాలి.
- ‘నా తప్పేం లేదు. నేనెందుకు చెప్పాల’ని ఊరుకోవద్దు. దాన్ని అవతలివాళ్లు తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే ఆ ఫ్రెండ్షిప్ నిలబడుతుంది.