నెహ్రూ హయాంలో ‘హిందీ–చీనీ భాయీ భాయీ’ అనుకునే దోస్తానా ఉండేది. దీన్ని అలుసుగా తీసుకుని చైనా మనపై దండెత్తిం ది. ఆ తర్వాత రెండు దేశాలకు మధ్య స్నేహ వాతావరణం పూర్తిగా పోయింది. మళ్లీ ఇన్నేళ్లకు మోడీ పాలనలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దగ్గరవ్వాలని కోరుతున్నారు. మోడీ ఫస్ట్ టర్మ్‌లో చైనాతో సంబంధాలు అంత సజావుగా లేకపోయినా.. చివర్లో కొంత సానుకూలత ఏర్పడింది. సెంట్రల్ చైనాలోని వుహాన్‌లో మోడీ–జిన్‌పింగ్ ఒన్–టు–ఒన్ భేటీ జరుపుకున్నారు. మోడీ 2.0 వెర్షన్‌లో జిన్‌పింగ్ వారణాసికి వచ్చే సూచనలున్నాయి. చైనాకి గల అనుమానాలను పటాపంచలు చేయడం మోడీ బాధ్యత కాగా,ఇండియాతో ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ గా మారడం జిన్‌పింగ్ కర్తవ్యం.
ఇండియాకి మోడీ రెండోసారి ప్రధాని అవుతారని చైనా ముందే ఊహించింది. కాకపోతే బీజేపీకి లోక్‌సభలో ఇంత భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేయలేకపోయింది. కమల దళానికి బొటాబొటీ ఆధిక్యతే వస్తుందని, కొయిలేషన్ గవర్నమెంట్ ఏర్పడక తప్పదని డ్రాగన్ భావించింది. సంకీర్ణ సర్కారు వల్ల కీలక నిర్ణయాల సమయంలో ప్రధాని మోడీ ‘ఫ్రీ హ్యాండ్’ తీసుకోలేరని అనుకుంది. విదేశీ విధానాల అమల్లోనూ ఫస్ట్ టర్మ్ మాదిరి కఠినంగా వ్యవహరించలేరనే అభిప్రాయానికి వచ్చేసింది. ఇండియా ప్రెస్ రిపోర్ట్లు, ఇండియన్ విజిటర్లతో జరిపిన ముచ్చట్లు ఆధారంగా మోడీని లైట్ తీసుకున్న చైనా.. ఎన్నికల ఫలితాలతో షాక్‌కి గురైంది. చైనా అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన విజయం సాధించి రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో చైనా మోడీ 2.0 వెర్షన్ నుంచి ఏం ఆశిస్తోందనేది ఆసక్తికరమైన అంశమే. విదేశాలను, ప్రధానంగా తమను ఎలా డీల్ చేస్తారోనని చైనా వేచి చూస్తోంది.
మోడీ–1.0లో ఇండియా–చైనా సంబంధాలను దెబ్బతీసే ఇన్సిడెంట్లు కొన్ని చోటుచేసుకున్నాయి. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ మెంబర్షిప్ మొదలుకొని పాక్ టెర్రరిస్టులపై ఆంక్షలు, డోక్లాం వంటి గొడవలు జరిగాయి. ఈ వివాదాలను పక్కనపెట్టి మోడీ 2018 ఏప్రిల్‌లో చైనాలోని వుహాన్‌లో జిన్‌పింగ్‌తో సమావేశం కావటంతో రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేతలిద్దరూ రెండురోజులపాటు ఏకాంతంగా ఒన్–టు–ఒన్ మీటింగ్ నిర్వహించారు. ఎలాంటి డిప్లమసీ లేకుండా ఇద్దరు మిత్రులు షికారుకెళ్లినట్లుగా ఈ భేటీ జరిగింది. ఇలా భేటీ అవటానికి ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి.
అప్పటికే అమెరికా–చైనా ట్రేడ్వార్కి తెర లేచింది. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి, ఆసియాలో ఇరుగు పొరుగు దేశాల సపోర్ట్ కోసం ఇండియాని కూల్ చేసుకుంటే మంచిదనే ఉద్దేశంతో డ్రాగన్ మనసు మార్చుకుంది. ఇటు మోడీకి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్నికల వేళ పక్క దేశాలు స్నేహం కోసం వాటంతటవే ముందుకొస్తే ఎవరు కాదంటారు? బోర్డర్లో ప్రశాంత వాతావరణం ఉండాలనే ఏ దేశమైనా కోరుకుంటుంది. మన ప్రధానీ అదే అనుకున్నారు.
ఇద్దరికీ ఎదురులేదు..
2017లో చైనాలో జిన్‌పింగ్, 2019లో ఇండియాలో మోడీ రెండోసారి పవర్లోకి వచ్చారు. ఇద్దరికీ తిరుగులేని అధికారాలు చేజిక్కాయి. ఇది రెండు దేశాలకూ మంచి అవకాశం. అక్కడా ఇక్కడ అన్ని రంగాల్లో అభివృద్ధికి ఒకరికొకరు సహకరించుకునే వాతావరణం ఏర్పడింది. వుహాన్ ఇన్‌ఫార్మల్ మీటింగ్ ఇచ్చిన స్ఫూర్తితో మోడీ–జిన్‌పింగ్ ఈసారి ఇండియాలో ఒన్–టు–ఒన్ మాట్లాడుకోదలిచారు. ఈ ఏడాదే మోడీ నియోజకవర్గం వారణాసిలో వీళ్లిద్దరూ కలిసే అవకాశం ఉందంటున్నారు. ఈ భేటీ ఇండియా–చైనా సంబంధాలు మరింత మెరుగుపడటానికి దారితీస్తుందని ఎంబసీ వర్గాలు చెబుతున్నాయి.
కొలిక్కి రావాల్సినవి
బోర్డర్ ఇష్యూలు, ఇండియాకి చైనా సపోర్ట్ ఇవ్వడంపై పాకిస్థాన్ పేచీ పెట్టుకోవటం, సమితి సెక్యూరిటీ కౌన్సిల్లో మన దేశానికి పర్మినెంట్ సీటు, ఎన్ఎస్జీ మెంబర్షిప్ వంటి అంశాలపై ఇండియా–చైనా ఒక అండర్‌స్టాండింగ్‌కి రావలసి ఉంది. దక్షిణాసియాలో చైనా ఎకనామికల్‌గా, పొలిటికల్‌గా సత్తా చాటాలనుకుంటోంది. ఇండియా అమెరికాకు అనుకూలంగా ఉండటాన్ని సహించలేకపోతోంది. ఇవి రెండు దేశాల మధ్య సంబంధాలపై ఎఫెక్ట్ చూపుతున్నాయి. సౌతాసియాలో రానున్న ఐదేళ్లలో 30 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని జిన్‌పింగ్ 2014లో చెప్పారు. ఆ ఇన్వెస్ట్మెంట్లతో పాకిస్థాన్, బంగ్లాదేశే ఎక్కువ లాభపడ్డాయి. మొబైల్ ఫోన్లు, ఇళ్లల్లో వాడే చిన్న వస్తువులకు సంబంధించి ఇండియా మార్కెట్లో చైనా ఐటమ్స్దే డామినేషన్. ఇండియాలో చైనా సంస్థలు మ్యానుఫ్యాక్సరింగ్ యూనిట్లను పెద్ద సంఖ్యలో పెట్టడంతో లోకల్ జనాలకి ఉద్యోగాలొచ్చాయి. కానీ, మన కంపెనీలు చాలా వరకు మూతపడ్డాయి. ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ)’, బంగ్లాదేశ్–చైనా–ఇండియా–మయన్మార్ (బీసీఐఎం) రీజనల్ కోపరేటివ్ ఫోరం వంటి వాటిని ఉపయోగించుకొని చైనా కొన్ని దేశాల్లో లాభపడుతోంది.
మోడీ ఏం చేయాలి?
ఫస్ట్ టర్మ్‌లో మోడీ చైనాని దూరం పెట్టారు. ఆ దేశం ఆధ్వర్యంలో జరిగే ఏ సదస్సులకూ ఆయన వెళ్లలేదు. ఇప్పుడు దానికి భిన్నంగా ఉండాలని దౌత్యవర్గాలు సూచిస్తున్నాయి. బీఆర్ఐ వంటి ప్రాజెక్టులపై మన దేశం ఒంటరిగా వ్యవహరించకూడదని కూడా చెబుతున్నారు. ఇండియా పెద్దన్నలా కాకుండా బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్ వంటి పొరుగు దేశాలను కలుపుకుపోయే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇప్పటికే మోడీ చైనాకి అయిష్టమైన పనులు చేయకపోవడం గమనార్హం. రెండోసారి పీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి టిబెట్, తైవాన్ ప్రతినిధులను మోడీ పిలవలేదు. చైనాలో ఎక్కువ కాలం అంబాసిడర్‌గా పనిచేసిన ఎస్.జైశంకర్‌ను ఫారిన్ అఫైర్స్ మినిస్టర్‌గా నియమించారు. ఇక, అమెరికాను చైనా పోటీదారుగా ఫీలవుతుండటంతో ఇండియా ఆ దేశంతో క్లోజ్‌గా ఉండొద్దని చైనా కోరుకుంటోంది.
మొదటి నుంచీ దూరమే
మోడీ ప్రధానిగా ఉన్న మొదటి ఐదేళ్లలో ఇండియా–చైనా సంబంధాల్లో కొన్ని ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉన్నాయి. మోడీ పాలనలో తమతో ఇండియా ఆర్థిక బంధం బలోపేతమవుతుందని చైనా భావించింది. కానీ ఆయన తొలి సారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆ కార్యక్రమానికి చైనా ప్రెసిడెంట్ జిన్‌పింగ్‌ని పిలవలేదు. ఆయనకు బదులు టిబెట్ ప్రెసిడెంట్ సిక్యాంగ్ని, ఇండియాలో తైవాన్ టాప్ డిప్లొమాటిక్ రిప్రజంటేటివ్ని ఆహ్వానించారు.
చైనా ప్రారంభించిన ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్’(బీఆర్ఐ)ని ఇండియా వ్యతిరేకిస్తోందనే విషయం దీంతో మరో సారి రుజువైంది. జిన్‌పింగ్‌ని ప్రమాణస్వీకారానికి రమ్మనకపోయినా అదే ఏడాది సెప్టెంబర్‌లో ఇండియా టూర్‌కి వచ్చినప్పుడు మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఆతిథ్యమిచ్చారు.