
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’. విజయశాంతి కీలకపాత్ర పోషించారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నాయాల్ది’ అనే పాటను విడుదల చేశారు. ‘సుందరి సుందరి నీ సూపుతో.. సిందర వందర చేసేశావే.. వాలు కళ్ల వయ్యారమా సింగారం నీ సొంతమా.. నాయాల్ది..’ అంటూ సాగే ఈ పాటను అజనీష్ లోకనాథ్ కంపోజ్ చేయగా నకాష్ అజీజ్, సోనీ కొమందురి పాడారు.
రఘురామ్ లిరిక్స్ రాశాడు. కళ్యాణ్ రామ్, సయీ మంజ్రేకర్ జంటపై చిత్రీకరించారు. ఇక నరసరావుపేటలో జరిగిన ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ‘అతనొక్కడే’ చిత్రం తరహాలో ఇది కూడా మరో ఇరవై ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. విజయశాంతి గారు ఒప్పుకోవడం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. అమ్మలని గౌరవించడం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఈ సినిమాని అమ్మలందరికీ అంకితం చేస్తున్నాం’ అని చెప్పాడు. డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.