
ఎండాకాలంలో ఫ్రిజ్ ఎక్కువుగా వాడుతుంటాం.. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, వండిన పదార్థాలు.. ఇలా అన్నీ ఫ్రిజ్ లో సర్దేస్తుంటారు. అయితే దాని మెయింటెనెన్స్, క్లీనింగ్ పై మాత్రం పెద్దగా దృష్టి పెట్టరు చాలామంది. ఫ్రీజ్ ను కూడా సరైన పద్దతిలో వాడరు. దాంతో లేనిపోని అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అంతేకాదు ఆ పొరపాట్ల వల్ల ఫ్రిజ్ కూడా తక్కువ టైంలోనే పాడైపోతుంది. అలా కాకూడదంటే ఫ్రిజ్ మెయింటెనెన్స్ లో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
ఓ వర్ కూల్ అయినప్పుడు ఫ్రీజర్ లో ఐస్ గడ్డకడుతుంది. అలాంటప్పుడు ఫ్రీజర్ లో ఉండే టీఎస్(టెర్మోస్టార్ట్) స్విచ్ఛాఫ్ చెయ్యాలి. లేదా పూర్తిగా ఫ్రిజ్ ఆపేయాలి. అంతేకానీ కత్తి, సుత్తి, స్క్రూ డ్రైవర్ లాంటి వస్తువులతో ఐస్ ను తీసే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే ఫ్రీజర్ లో ఉండే అల్యూమినియం గొట్టాలు పగిలిపోయి గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది.
శుభ్రం చేయాలి
ఫ్రిజ్ వెనుకఉండే వేడిని తగ్గించే కాయిల్స్ మీద చెత్తాచెదారం, బూజు పడకుండా చూసుకోవాలి. లేకుంటే కాయిల్స్ సరిగ్గా పనిచేయక కంప్రెసర్ మీద భారం పడి ఫ్రిజ్ పనితీరు తగ్గిపోతుంది. పాత మోడల్ ఫ్రిజ్ వాడుతుంటే స్టెబిలైజర్ తప్పనిసరి. కరెంట్ సరఫరాలో వచ్చే ఓల్టేజీ తేడాలను ఇది సరిచేస్తుంది. ప్రస్తుతం వచ్చే ఫ్రిజ్ లకు స్టెబిలైజర్ లోపలే ఉంటుంది గనుక విడిగా స్టెబిలైజర్ అవసరం లేదు.
వేడి తగలకుండా...
హీటర్లు, స్టవ్. ఎక్కువ వేడి ఉన్నచోట, ఎండ పడే చోట ఫ్రిజ్ పెట్టకూడదు. అలాగే ఫ్రిజ్ కి కాస్తయినా గాలి తగిలేలా చూడాలి. ఫ్రిజ్ పనిచేస్తున్నప్పుడు అటూ ఇటూ కదపకూడదు. కరెంట్ ఆదా కోసమని కొంతమంది రాత్రిళ్లు ఫ్రిజ్ ఆపేస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. అలాగే రెండుమూడు గంటలకు మించి కరెంట్ పోతే ఫ్రిజ్ తెరిచి ఉంచాలి. లేకుంటే లోపలి పదార్ధాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. వెనుక కంప్రెషర్ కింద ఉన్న బాక్సులో ఎప్పుడూ నీళ్లు నిల్వ ఉండాలి. లేదంటే కంప్రెషర్ వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంది
అవసరమైనంతే...
ఒకసారి డీప్ ఫ్రీజర్ లోంచి తీసిన పదార్థాలను తిరిగి ఫ్రీజర్లో పెట్టకూడదు. ఒకసారి బయటపెట్టాక ఆ ఆహారంపై బ్యాక్టీరియా చేరుతుంది. దాన్ని మళ్లీ లోపల పెడితే ఆ బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. అందువల్ల అవసరమైనంత వరకు తీసుకుని మిగిలింది. లోపలే ఉంచాలి. అలాగే ఫ్రిజ్లో మెటాలిక్ పాత్రలు పెట్టకూడదు.
నిల్వచేయడం ఇలా...
చాలామంది ట్రేల్లో వంటకాలు ఎలా పడితే అలా పడేస్తుంటారు. నిజానికి ట్రేల వెనక భాగంలో ఎక్కువ. ..ముందు భాగంలో తక్కువ చల్లదనం ఉంటుంది. అందుకనే ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకునేవీ, త్వరగా పాడవుతాయి ..అనుకున్నవి ..వెనకభాగంలో పెట్టి.. మామూలు చల్లదనం చాలనుకున్నవి ముందు పెట్టుకోవాలి.. అలాగే ఫ్రిజ్ అరల్లో ప్లాస్టిక్ షీట్లు తప్పని సరిగా వేయాలి. అలాచేస్తే ట్రేలకున్న గాసు త్వరగా పాడవదు. మరకలు కూడా పడవు.
దుర్వాసన రాకుండా...
కూరగాయలు కుళ్లిపోయినా, సీసాల మూతలు ఊడిపోయినా ఫ్రిజ్ నుంచి దుర్వాసన వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే... అక్కడక్కడ. నిమ్మచెక్కలు పెట్టాలి. నిమ్మరసంలో దూది ముంచి ఫ్రిజ్లో ఉంచాలి. వంటసోడాను కప్పులో వేసి ఫ్రిజ్లో ఓ పక్కగా ఉంచినా దుర్వాసన రాదు.
పదార్థాలన్నీ బయటపెట్టి లోపలి ట్రేలు కడిగి ఆరబెట్టాలి. బయటివైపు శుభ్రం చేసేందుకు కోలిన్ లిక్విడ్ వాడాలి. ఒక గిన్నెలో పావువంతు నీళ్లు తీసుకుని రెండు టీస్పూన్ల వంటసోడా కలపాలి. ఇప్పుడు స్పాంజి తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఫ్రీజీ ని తుడవాలి. ఆ తర్వాత మెత్తటి క్లాత్ని మంచినీళ్లలో ముంచి మళ్లీ ఫ్రిజ్ తుడవాలి. దీనివల్ల వంటసోడా పూర్తిగా పోతుంది
-– వెలుగు, లైఫ్–