వన్య ప్రాణులకు హాని చేయొద్దని అవగాహనా కార్యక్రమాలు

కాగజ్​గనర్​/దహెగాం/కడెం, వెలుగు: రెండు పెద్ద పులుల వరుస మరణాలతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విషాహారం పెట్టి పులులను చంపినట్లు తేలడంతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పశువులపై పులి దాడి చేసి చంపితే వెంటనే పరిహారం ఇస్తామని చెబుతున్నారు. పులికి హాని కలిగించడం, చంపేందుకు యత్నించినా కఠిన శిక్షలు ఉంటాయని అవగాహన కల్పిస్తున్నారు.

వన్య ప్రాణులకు హాని కలిగించవద్దని ఎఫ్ఆర్​వో నిజామోద్దీన్​అన్నారు. వన్య ప్రాణుల సంరక్షణపై ఆదివారం దహెగాం మండలంలోని లోహ, దిగిడ, ఖర్జి గ్రామాల్లో అవగాహన కల్పించారు. వన్యప్రాణులను సంరక్షించడం అందరి బాధ్యత అని, వాటికి ఎలాంటి కీడు చేయొద్దని సూచించారు. అడవి జంతువులను వేటాడటం, చంపితే చట్ట ప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఫారెస్ట్​ అధికారులు ఎప్పటికప్పుడు యానిమల్​ ట్రాకింగ్ ​చేస్తున్నారని, ఎవరూ భయపడవద్దని కోరారు. అవగాహన కల్పిస్తూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్​వో శ్రీధరాచారి, ఎఫ్ఎస్​వో సతీఫ్, యానిమల్​ట్రాకర్స్​సద్దాం, పోషన్న, వెంకటటేశ్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉడుంపూర్ డీఆర్ఓ ప్రకాశ్ అన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ పట్ల కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోని కల్లెడ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అడవుల్లో నిప్పు పెట్టడం, వన్యప్రాణులను వేటాడే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడవుల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. స్థానిక సర్పంచ్ తిరుపతి, అటవీ అధికారులు ప్రసాద్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.