- భారత్ లో 64 రోజుల్లో 100 నుంచి లక్షకు కరోనా కేసులు
- యూఎస్ లో 25, యూకేలో 42 రోజుల్లో లక్ష క్రాస్
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో రెండో స్థానం.. వైద్య, ఆరోగ్య రంగంలో సదుపాయాలు, టెక్నాలజీ, డాక్టర్ల సంఖ్య వంటి విషయాల్లో చాలా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉన్న దేశం భారత్. అయినా ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కట్టడి విషయంలో అగ్రరాజ్యాలకు మించిన ఫలితాలను సాధించింది. వైరస్ వ్యాప్తి ముప్పును ముందుగా గుర్తించి లాక్ డౌన్ విధించడం సత్ఫలితాలను ఇచ్చింది. అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉన్న అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో ఈ వైరస్ చాలా వేగంగా విజృంభించింది. భారత్ లో కరోనా కేసులు 100 నుంచి లక్షకు చేరడానికి 64 రోజులు పడితే.. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో సగం రోజుల్లోనే ఆ సంఖ్యను దాటాయి. ప్రపంచ వ్యాప్తంగా నిత్యం కరోనా వైరస్ వ్యాప్తి సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ టీమ్ ద్వారా అప్ డేట్ చేస్తున్న వరల్డోమీటర్ సంస్థ దీనిపై ఒక కంపారిజన్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. అమెరికా, స్పెయిన్, జర్మనీలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భారత్ చాలా బెటర్ అని ఆ సంస్థ అభిప్రాయపడింది. ఆ దేశాల్లో కరోనా కేసులు 100 నుంచి లక్షకు చేరడానికి పట్టిన సమయంలో రెట్టింపు రోజులకు గానీ భారత్ లో వైరస్ వ్యాప్తి ఆ స్థాయికి చేరలేదని తెలిపింది. అమెరికాలో 25 రోజుల్లో లక్ష కరోనా కేసులు దాటగా.. స్పెయిన్ లో 30 రోజుల్లో, జర్మనీలో 35 రోజుల్లో ఆ సంఖ్యను దాటాయి. ఇటలీలో 36, ఫ్రాన్స్ లో 39, యూకేలో 42 రోజుల్లో కరోనా కేసులు లక్ష దాటాయి. అయితే భారత్ లో కరోనా కేసులు 100 నుంచి లక్షకు చేరడానికి 64 రోజులు పట్టిందని, వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించడంలో భారత్ సక్సెస్ అయిందని వరల్డోమీటర్ చెప్పింది.
భారత్ లో మంగళవారం ఉదయం వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,01,139కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అందులో 3,163 మంది మరణించగా.. 39174 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 58,802 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పింది.