- తగ్గుతున్న మార్జిన్లు
- పడిపోతున్న అమ్మకాలు
- అధిక ద్రవ్యోల్బణంపై ఆందోళన
న్యూఢిల్లీ : షాంపూలు, సబ్బులు, బిస్కెట్ల వంటి ఫాస్ట్మూవబుల్ కన్జూమర్ గూడ్స్(ఎఫ్ఎంసీజీ) తయారు చేసే కంపెనీలు మరోసారి ధరలు పెంచే ఆలోచనలో ఉన్నాయి. సెప్టెంబర్ క్వార్టర్లో అధిక ఇన్‌పుట్ ఖర్చులు, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా వీటికి మార్జిన్లు తగ్గాయి. అంతేగాక పట్టణాల్లో అమ్మకాలు తగ్గాయి. పామాయిల్, కాఫీ, కోకో వంటి కమోడిటీ ఇన్‌పుట్‌ల ధరలు కూడా పెరగడంతో కొన్ని ఎఫ్ఎంసీజీ సంస్థలు ధరల పెంపుపై సంకేతాలు ఇస్తున్నాయి. హెచ్‌యూఎల్, గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, మారికో, ఐటీసీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పట్టణ వినియోగం తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశాయి.
ఎఫ్ఎంసీజీ మొత్తం అమ్మకాలలో పట్టణాల వాటా 65–-68 శాతం వరకు ఉంటుంది. మార్జిన్లను నిలుపుకోవాలంటే ధరల పెంపు తప్పకపోవచ్చని జీసీజీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ సీతాపతి తెలిపారు. సెప్టెంబరు క్వార్టర్లో కంపెనీ ఇబిటా మార్జిన్ తక్కువగా ఉంది. ఇది పూర్తిగా పామాయిల్‌లో అధిక ద్రవ్యోల్బణం కారణంగా తగ్గింది. అంతకుముందు గ్రామీణ మార్కెట్లు, పట్టణ ప్రాంతాల కంటే వెనుకబడ్డాయి. ఇప్పుడు పట్టణాల కంటే గ్రామాల అమ్మకాలే బాగున్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు, క్విక్‌కామర్స్ అమ్మకాలు బాగున్నాయని చెబుతున్నాయి.
లాభాల్లో తగ్గుదల
ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ ఇండియా సహా పలు కంపెనీలు సెప్టెంబర్ క్వార్టర్లో "అధిక ఆహార ద్రవ్యోల్బణం, పట్టణ డిమాండ్‌లో తగ్గుదల" కారణంగా తక్కువ లాభం సంపాదించాయి. చ్యవన్‌ప్రాష్, పుదీనాహారా, రియల్ జ్యూస్ వంటివి డాబర్ తయారు చేస్తుంది. దీని కన్సాలిడేటెడ్ నికర లాభం 17.65 శాతం క్షీణించి రూ. 417.52 కోట్లకు పడిపోయింది. నెస్లే ఇండియా సీఎండీ సురేశ్ నారాయణన్ కూడా అధిక ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేశారు. రెండు క్వార్టర్ల క్రితం రెండంకెల్లో ఉన్న పానీయాల విభాగం వృద్ధి ఇప్పుడు 1.5-2 శాతానికి పడిపోయిందని ఆయన చెప్పారు.
పండ్లు, కూరగాయల, చమురు ధరలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. కంపెనీలకు ముడిసరుకు ఖర్చులు భరించలేనంతగా మారితే ధరల పెరుగుదలకు దారితీయవచ్చని స్పష్టం చేశారు. కాఫీ, కోకో ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. మ్యాగీ, కిట్ క్యాట్, నెస్కేఫ్ వంటి బ్రాండ్‌లను కలిగి ఉన్న నెస్లే ఇండియా లాభం కూడా ఈసారి తగ్గింది. దేశీయ విక్రయాల వృద్ధి 1.2 శాతమే ఉంది. మెగా సిటీలు, మెట్రోల్లో అమ్మకాలు తక్కువయ్యాయని నారాయణ్ పేర్కొన్నారు.
టీసీపీఎల్ ఎండీ సునీల్ డిసౌజా కూడా ఈ మాటలతో ఏకీభవించారు. పట్టణ ప్రాంతాల్లో వినియోగదారులు తక్కువగా ఖర్చు చేస్తున్నారని అన్నారు. సర్ఫ్, రిన్, లక్స్, పాండ్స్, లైఫ్‌బాయ్, లాక్మే, బ్రూక్ బాండ్, లిప్టన్ హార్లిక్స్ వంటివి అమ్మే హెచ్‌యూఎల్ వ్యాపారం కూడా ఈసారి దెబ్బతింది. కన్సాలిడేటెడ్ నికర లాభంలో 2.33 శాతం తగ్గింది. ఐటీసీ మార్జిన్లు 35 బేసిస్ పాయింట్లు పడిపోయాయి.