
- సిద్దిపేట ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చాం: మంత్రి హరీష్ రావు
సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ర్టంలో కైకిలు(కూలి) లేని రోజుల నుంచి నేడు స్వరాష్ర్టంలో కైకిలోళ్లు(కూలోళ్లు) దొరకని పరిస్థితికి వచ్చామని, ఇదంతా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఘనతే నని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాలలో రూ. 48 కోట్లతో చేపట్టిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా వ్యవసాయ డిగ్రీ కాలేజ్ నిర్మాణానికి టీఎస్ ఈడబ్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ర్టంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఊర్లలో కాలం కాక పనులు దొరక్క, కైకిళ్లు కోసం ప్రభుత్వం చుట్టూ తిరిగే వారని, కాని ఇప్పుడు సీఎం కేసీఆర్ ముందుచూపుతో నిర్మించిన కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల వల్ల గ్రామాల్లో కైకిలోళ్లు దొరకక, పక్క రాష్ర్టాల నుంచి తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందన్నారు. ఒకప్పుడు చుక్క నీరు లేని సిద్దిపేట ప్రాంతాన్ని రిజర్వాయర్ల ఖిల్లాగా మార్చుకున్నామన్నారు.
ఆలయాలు, రిజర్వాయర్లకు ఖిల్లా అయిన సిద్దిపేటను చదువులకు సైతం నిలయంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కుల వృత్తుల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని, కుమ్మరుల అభివృద్ధి కోసం సిద్దిపేటలో రూ. 2.20కోట్లతో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మాణం కోసం మట్టి కుండలు, మట్టి గిన్నెలు, మట్టి గ్లాసులు తదితర మట్టి పాత్రల తయారీ కోసం మోడల్ ప్రాజెక్ట్ చేపట్టామని గుర్తు చేశారు.
షెడ్యూల్డ్ కులాల 265 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి రుణాల ప్రొసీడింగ్స్ అందజేశారు. చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ మెంబర్ పాల సాయిరాం, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ యాదగిరి, ఎర్ర యాదయ్య, శ్రీహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అన్ని ప్రభుత్వ బడులను డెవలప్చేస్తా..
సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో ప్రభుత్వ బడులను ప్రాధాన్య క్రమంలో అభివృద్ది చేస్తానని మంత్రి హరీశ్ రావు చెప్పారు. సిద్దిపేట గర్ల్స్ జూనియర్ కళాశాలలో కొత్త బిల్డింగ్, సింథటిక్ ట్రాక్ , బాస్కెట్ బాల్ ప్లే గ్రౌండ్ లను మంత్రి ప్రారంభించారు.