సినిమాల నుండి పార్లమెంటుకు.. లోక్ సభ ఎన్నికలలో గెలిచిన సినీ ప్రముఖులు వీరే

సినిమాల నుండి పార్లమెంటుకు.. లోక్ సభ ఎన్నికలలో గెలిచిన సినీ ప్రముఖులు వీరే

ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు దశల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు సినీ తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.  జూన్ 4న భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి 293 సీట్లతో మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత కూటమికి 234 సీట్లు వచ్చాయి. పోటీ చేసిన పలువురు సినీ ప్రముఖుల్లో ఎక్కువ మంది విజేతలుగా నిలిచారు. గెలిచిన వారిలో ఎవరెవరూ ఉన్నారంటే..

కంగనా రనౌత్

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ ఈ లోక్ సభ ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని తన స్వస్థలం మండి నుండి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన కంగనా..  74,755 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌పై ఘన విజయం సాధించింది.

అరుణ్ గోవిల్

పురాణ టీవీ సిరీస్ రామాయణంలో రాముడి పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నుండి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన ఆయన.. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి సునీతా వర్మపై 10,585 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

హేమ మాలిని

భారతీయ సినిమా 'డ్రీమ్ గర్ల్'గా సినీ ప్రేక్షకుల్లో్ స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి హేమ మాలిని.. మధుర నియోజకవర్గంలో వరుసగా మూడోసారి విజయం అందుకున్నారు. తన ప్రత్యర్థిపై ఏకంగా 2,93,407 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు.

శతృఘ్న సిన్హా

ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (TMC) టికెట్‌పై పోటీ చేసి విజయం సాధించారు. అసన్‌సోల్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా 59,564 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

మనోజ్ తివారీ

బాలీవుడ్ తారలే కాదు.. భోజ్‌పురి సూపర్ స్టార్ మనోజ్ తివారీ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్‌పై 1,37,066 ఓట్ల భారీ మెజార్టీతో వరుసగా మూడోసారి విజయాన్ని సాధించారు.

రవి కిషన్

నార్త్, సౌత్ అనే తేడా లేకుండా పలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు నటుడు రవి కిషన్.  గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన ప్రత్యర్థిపై 1,03,526 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్నారు.

సురేష్ గోపి

బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన కేరళ రాష్ట్రంలో తొలి సీటును అందించి సురేష్ గోపీ చరిత్ర సృష్టించారు. సీపీఎం అభ్యర్థి సునీల్‌కుమార్‌పై 74,686 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 2016 నుంచి 2022 వరకుసురేష్ గోపీ ఎంపీగా  రాజ్యసభ కూడా నామినేట్ అయ్యారు.