అల్లం పేస్ట్​ నుంచి బూస్ట్​ వరకు నకిలీ దందా

హనుమకొండ, వెలుగు: ఇంట్లో వంటకు వినియోగించే పదార్థాల నుంచి అవసరాలకు వాడే అన్ని రకాల ప్రొడక్ట్స్​కల్తీ అవుతున్నాయి. నూనె, తేనె, కారంపొడి, అల్లం పేస్ట్, చాయ్ పత్తా, బూస్ట్.. ఇలా ప్రతిదానికీ నకిలీ తయారవుతోంది. చివరకు ఇంట్లో వాడే బట్టల సర్ఫ్, దోమల మందుకూ నకిలీల బెడద తప్పట్లేదు. అక్రమార్జనే ధ్యేయంగా కొంతమంది కేటుగాళ్లు నకిలీ దందాకు తెరలేపుతున్నారు. ఒరిజినల్​ప్రొడక్ట్స్​తో పోలిస్తే ఏమాత్రం డౌట్​ రాకుండా స్టిక్కర్స్, లేబుల్స్​ తయారు చేస్తుండటంతో జనాలు అసలువేవో.. నకిలీవేవో తెలుసుకోలేకపోతున్నారు. పెట్టిన పెట్టుబడికి 10 నుంచి 20 రెట్లు లాభాలు వస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలను టార్గెట్​ చేసుకుని పెద్దఎత్తున దందా చేస్తున్నారు. దీంతో మార్కెట్ లో ఒరిజినల్​ కంటే డూప్లికేట్​వస్తువులే 25 రెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు సెకండ్​ గ్రేడ్​సిటీస్​ సెంటర్​గా ఈ బాగోతం నడుస్తుండగా.. అక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ నకిలీ ప్రొడక్ట్స్​సరఫరా అవుతున్నాయి. 

పేటెంట్​ రైట్​ యాక్ట్​ను పట్టించుకోట్లే..
డూప్లికేట్ ​ప్రొడక్ట్స్​తయారు చేస్తున్న గ్యాంగులు పేటెంట్​ రైట్​యాక్ట్​కు తూట్లు పొడుస్తున్నాయి. పెద్ద కంపెనీల పేరున నకిలీ స్టిక్కర్స్​తయారు చేస్తూ ఇల్లీగల్​ వ్యాపారం చేస్తున్నాయి. వాస్తవానికి కాపీ రైట్ యాక్ట్​ ప్రకారం సంస్థ పర్మిషన్​ లేకుండా దాని పేరు కూడా ఎక్కడా వినియోగించకూడదు. కానీ ఈ ముఠా సభ్యులు ఏకంగా  వస్తువుల పేర్లను అచ్చుగుద్దినట్టుగా డిజైన్​ చేసి అక్రమ వ్యాపారం చేస్తున్నారు.  ఇంకొంతమంది ఒరిజినల్ ​ప్రొడక్ట్  పేరులో అక్షరాలను మార్చి దందా చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అయితే కాపీ రైట్, పేటెంట్​ రైట్​యాక్ట్ ​రూల్స్​ఉల్లంఘిస్తే చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒరిజినల్ ​ప్రొడక్ట్స్​ను వాటిపై ఉండే లోగోలు, హోలోగ్రామ్స్​ ద్వారా గుర్తించాలని, ఏమైనా అనుమానం వస్తే కంప్లైంట్​ చేయాలని సూచిస్తున్నారు.

నకిలీ బీడీల తయారీ ఇద్దరి అరెస్ట్ 
రూ. 13.32 లక్షల సరుకు స్వాధీనం

వరంగల్ క్రైమ్, వెలుగు: వివిధ బీడీ కంపెనీల పేర్లతో స్టిక్కర్లు తయారు చేసి.. నకిలీ బీడీల దందా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 13.32 లక్షల విలువైన నకిలీ బీడీల ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ అబ్బనికుంటకు చెందిన బండ సదానందం, శివనగర్ కు చెందిన కేతి మహేశ్​రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన నంది, అహ్మద్ పాషా, సూరజ్, రెడ్డి మార్క్, ఉత్తమ్, గణేశ్, సీసీసీ, రఫీ, చంద్రిక, బావుట, ఎల్బీఆర్ కంపెనీల పేరుతో ఫేక్ స్టిక్కర్లు తయారు చేస్తున్నారు. సాధారణ బీడీలను కంపెనీల పేరుతో ప్యాకింగ్​చేసేవారు. అనంతరం డీలర్ల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు వాటిని తరలించి అమ్ముతున్నారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందగా.. శనివారం ఉదయం దాడులు చేసి సదానందం, మహేశ్​ను అదుపులోకి తీసుకున్నారు. 

సిటీ నుంచి రూరల్​కు..
నిత్యావసర సరకులకు సంబంధించిన ప్రొడక్ట్స్​మార్కెట్​లోకి వచ్చిన వెంటనే వాటిని డూప్లికేట్​ చేసే ముఠాలు చాలానే ఉన్నాయి. ఈ గ్యాంగులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్​లోని ఇండస్ట్రియల్​ఏరియాల్లో మకాం వేసి ఒరిజినల్​ప్రొడక్ట్స్​కు సంబంధించిన స్టిక్కర్స్, లేబుల్స్, బాటిల్స్, అందులో ఉండే మెటీరియల్​ను తయారు చేస్తున్నాయి. అనంతరం వాటిని బేగంబజార్​లోని గోదాంలకు చేరవేసి అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు, హోల్​సేల్​డీలర్లతో కుమ్మక్కై డూప్లికేట్​ప్రొడక్ట్​ల దందాను కొనసాగిస్తున్నాయి. పెట్టుబడి లక్షల్లో.. రాబడి కోట్లలో ఉండటంతో  కొన్నేండ్లుగా ఈ దందా యథేచ్ఛగా సాగిస్తున్నాయి. ఎక్కువగా రూరల్​ ఏరియాలను టార్గెట్​చేసుకుని నకిలీ దందా సాగుతోంది. గ్రామీణ ప్రజలకు ఒరిజినల్​ ప్రొడక్ట్స్​పై పెద్దగా అవగాహన లేకపోవడంతో కల్తీ గ్యాంగులు రూరల్​ ఏరియాలను ఎంచుకుని వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కల్తీ వస్తువుల కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని, నకిలీ మస్కిటో రీఫిల్లర్స్​వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. 

సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం
కల్తీ ప్రొడక్ట్స్​ తయారు చేసేవారిపై సీరియస్​ యాక్షన్​ తీసుకుంటాం. ఇప్పటికే ఈ దందాకు పాల్పడిన పలువురిపై కేసులు నమోదు చేశాం. విజిలెన్స్​ ఆఫీసర్లు, ఫుడ్​ ఇన్​స్పెక్టర్లతో కోఆర్డినేషన్​ మీటింగ్​ ఏర్పాటు చేస్తం. యాక్షన్​ ప్లాన్​ తయారు చేసి నకిలీ దందాకు అడ్డుకట్ట వేస్తం. పదేపదే ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తం. 
– డా.తరుణ్​జోషి, సీపీ, వరంగల్