విశ్వనగరాన్ని విశ్వనరకంగా మార్చిందెవరు?


నగరంలో ఇంత పెద్ద వర్షం కురిసినా 5 శాతం నీరు కూడా భూమిలోకి ఇంకి ఉండదని అధికారులు చెబుతున్నారు. నీటి నిల్వకు రూపొందించిన కందకాల చుట్టూ సిమెంటు వాడకుండా రాతికట్టడాలు చేపట్టాలని, వీధుల్లో, రోడ్ల పక్కన కూడా ఇలాగే చేస్తే 80 శాతం నీరు భూమిలోకి ఇంకుతుందని మాజీ చీఫ్ ఇంజనీర్, యునైటెడ్​ నేషన్స్​ సలహాదారు హనుమంతరావు వంటి వారు ఎన్నో ఏండ్ల నుంచి చెబుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. సీఎం చెబుతున్నట్టు వేలాది ఇండ్లను కూలగొడితే పునరావాసం వగైరాలకు రూ.15 వేల కోట్ల పైచిలుకు అవుతుందని అంచనా. ఈ డబ్బును బాధ్యుల నుంచి వసూలు చేయగలరా? అమాయకంగా కొనుగోలు చేసిన సామాన్యులకు డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్​ ద్వారా ప్రత్యామ్నాయం చూపుతారా? మరో మార్గముందా? ఇవన్నీ ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఈసారి కురిసిన కుంభవృష్టి మన రాజకీయ, పాలనా విధానాల్లో కీలక మార్పులు చేయాలని హెచ్చరించే ఓ ప్రమాద ఘంటిక.

2016 సెప్టెంబర్.. భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైంది. 1908 తర్వాత ఇది రికార్డు వర్షమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ వర్షం వల్ల నష్ట్రానికి ప్రధాన కారణాల్లో అక్రమ నిర్మాణాలు ఒకటని చెప్పారు. నగరంలో ఉన్న దాదాపు 28,000 అక్రమ నిర్మాణాలను ఫ్లయింగ్ స్క్వాడ్ తో కూలగొడతామని హెచ్చరించారు. శిథిల భవనాలనూ కూల్చేస్తామన్నారు.

2020 అక్టోబర్.. ఈసారి కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలూ అతలాకుతలం అయ్యాయి. హైదరాబాద్ చిగురుటాకులా వణికింది. వందేండ్లలో ఇదే భారీ వర్షమని, తన జీవితంలో ఇటువంటి వర్షం ఎప్పుడూ చూడలేదని మంత్రి కేటీఆర్ చెప్పారు. పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్ అపార్ట్​మెంట్ల నిర్మాణానికి అనుమతిచ్చే ముందు వరద నీరు సెల్లార్ లో చేరకుండా ఉండేలా నిబంధన విధించాలని అధికారులను ఆదేశించారు. రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనా వేసిందని, తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు.

2016, 2020లో రాష్ట్రంలో టీఆర్ఎస్​ ప్రభుత్వమే అధికారంలో ఉంది. సీఎంగా కేసీఆరే ఉన్నారు. 2016లో ఆయన వరద సమీక్షలో అధికారులకు చేసిన హెచ్చరికలు, హూంకరింపులే ఇప్పుడూ చేశారు. మరి ఆనాడు విపత్తు తర్వాత ప్రభుత్వపరంగా మీరు తీసుకున్న చర్యలేమిటి అన్న ప్రశ్నకు సమాధానం చెప్పరు.

జీహెచ్ఎంసీ బడ్జెట్ 2015–16లో రూ.6,400 కోట్లు.. 2019–20లో రూ.11,538 కోట్లు. ఇదేమీ తక్కువ డబ్బు కాదు. రూ.5 వేల కోట్ల బడ్జెట్ పెరిగినా, సిటీ జనాలకు ఐదు పైసల ఉపయోగం కనిపించడం లేదు. నగరంలోని రోడ్లన్నీ నరకానికి దారి చూపిస్తున్నాయి. ఇన్ని వేల కోట్లూ ఉద్యోగుల జీతభత్యాలకు, ప్రజాప్రతినిధుల సౌకర్యాలకే ఖర్చుపెట్టేస్తున్నారా, మౌలిక సదుపాయాలకు పైసలు మిగలడం లేదా? అంటే దానికి సమాధానం చెప్పే వారే లేరు.

జవాబు లేని ప్రశ్నలెన్నో..

గుంత కనపడితే రూ.1,000 జరిమానా అనడమే కాదు, తాను స్వయంగా రోడ్లన్నీ చూస్తానని, గుంత కనపడితే అధికారులను అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించిన కేసీఆర్ ఇప్పుడు వాటి గురించి మాట్లాడటం లేదు. హైదరాబాద్ లో వర్షాలు, వరదలకు కారణమైన అక్రమ నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్​లో ఒక్కరూ మిగలరని ఆయన ఏనాడో అంగీకరించారు. హైదరాబాద్ లో 9,000 కిలోమీటర్ల మేర ఉన్న రహదారి వ్యవస్థలో 5,000 కిలోమీటర్లు సింగిల్ రోడ్లున్నాయని, దాదాపు 50 లక్షల వాహనాలు నగరంలో ఉన్నాయని, మెట్రో పనులు ఇంకా నడుస్తున్నాయని, రోడ్లపై గుంట పడినా రిపేరు చేయాలంటే అర్ధరాత్రి వరకూ ఆగాల్సిందేనని అధికారులు చెపుతున్నారు. వేసిన ఒక్కరోజులోనే గుంతలు పడి దుమ్మురేపుతున్న రోడ్లు ఎందుకున్నాయి, రోడ్ల వైఫల్యానికి కాంట్రాక్టర్లను, సంబంధిత అధికారులను బాధ్యుల్ని చేయలేకపోతున్నాం, ప్రైవేటు వాహనాలను తగ్గించేలా నాణ్యమైన ప్రజారవాణా వ్యవస్థను ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నాం అనే  ప్రశ్నలకు సర్కారు దగ్గర జవాబు లేదు.

కిర్లోస్కర్​ కమిటీ సిఫార్సులను అమలు చేయాలి

హైదరాబాద్ వంటి మహానగరంలో ఎక్కువ వర్షం కురిస్తే కొన్ని ప్రాంతాలు జలమయమై అక్కడక్కడా సమస్యలు రావొచ్చు. పారిశుద్ధ్య, ఆరోగ్య విభాగాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సి రావొచ్చు. కానీ ప్రజల్ని రోడ్ల మీదకే రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేయాల్సి రావడం మన పాలనా వ్యవస్థ లోపాలకు అద్దం పడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. 2000 నాటి హైదరాబాద్ వరదలకు కారణాల్ని విశ్లేషించిన కిర్లోస్కర్ కమిటీ నాలాలపై ఆక్రమణల తొలగింపు, లోతు పెంపు, కొన్ని చోట్ల దారి మళ్లింపు సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఆ సిఫార్సులను వెంటనే అమలు చేయాలి. 2030 నాటికి దేశ జనాభాలో 25 కోట్ల మంది పల్లెల నుంచి పట్టణాలకు వలస వస్తారని అంచనా. కాబట్టి నగరాలను ఆర్థిక కేంద్రాలుగా, కొన్ని మహానగరాలను ‘గ్రోత్ ఇంజన్లు’గా అభివృద్ధి చేస్తూ అవి నరకాలుగా మారకుండా వార్డుస్థాయి వికేంద్రీకరణ, సర్వీస్ గ్యారెంటీ చట్టం అమలు వంటి పాలనా సంస్కరణల్ని అమలు చేయాలి. అలాగే ప్రజలు గ్రామాల నుంచి వలస రాకుండాచూడాలి. కొన్ని గ్రామాలకు ఆర్థిక కేంద్రంగా ఓ చిన్న పట్టణం ఉండేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇలా చేస్తే నగరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

కూసంపూడి శ్రీనివాస్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి