
- ఎన్పీసీఐ సిఫార్సుకు లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్ట్రీ ఆమోదం
న్యూఢిల్లీ: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) కింద ఉన్న ఉద్యోగులు త్వరలో తమ పీఎఫ్(ప్రావిడెంట్ ఫండ్) డబ్బులను యూపీఐ, ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోనున్నారు. దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చేసిన సిఫార్సును లేబర్ అండ్ ఎంప్లాయ్ మెంట్ మినిస్టీ ఆమోదించిందని ఆ శాఖ సెక్రటరీ సుమితా దావ్రా వెల్లడించారు. ఈ ఏడాది మే నెలాఖరు లేదా లేదా జూన్ నుంచి పెన్షనర్లు తమ పీఎఫ్ డబ్బులను యూపీఐ, ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చని చెప్పారు. ఏటీఎం ద్వారా రూ.1 లక్ష వరకు విత్‌డ్రా చేసుకోవచ్చని..తమకు నచ్చిన బ్యాంక్ అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేయవచ్చన్నారు.
సభ్యులకు ఆర్థిక సౌలభ్యాన్ని అందించడానికే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఉన్న అనారోగ్య నిబంధనలతో పాటు గృహ నిర్మాణం, విద్య, వివాహం కోసం కూడా నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చని వివరించారు. "ఈపీఎఫ్ఓ తన ప్రాసెస్ లన్నింటిని డిజిటలైజ్ చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది. విత్‌డ్రా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి 120కి పైగా డేటాబేస్‌లను ఏకీకృతం చేసింది. క్లెయిమ్ ప్రాసెసింగ్ సమయం 3 రోజులకు తగ్గించింది.
95% క్లెయిమ్‌లు ఇప్పుడు ఆటోమేటెడ్ అయ్యాయి. ప్రాసెస్ లను మరింత సరళీకృతం చేయాలని కేంద్రం యోచిస్తోంది" అని సుమితా దావ్రా చెప్పారు. త్వరలో ప్రారంభించనున్న యూపీఐ, ఏటీఎం ఆధారిత పీఎఫ్ విత్‌డ్రా దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.