కేయూ జంక్షన్ నుంచి  అంబేద్కర్ సెంటర్ వరకు.. వరంగల్​లో నిరుద్యోగ మార్చ్

  • ఇయ్యాల నిరుద్యోగ మార్చ్
  • వరంగల్​లో బీజేపీ  ఆధ్వర్యంలో భారీ ర్యాలీ 
  • కేయూ జంక్షన్ నుంచి  అంబేద్కర్ సెంటర్ వరకు.. 
  • హాజరుకానున్న  సంజయ్, లక్ష్మణ్, అరుణ, సీనియర్ నేతలు

వరంగల్​లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ హనుమకొండ, వెలుగు: టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై బీజేపీ ఆధ్వర్యంలో శనివారం వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించనున్నారు. పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్​ను బర్తరఫ్ ​చేయాలని, పేపర్ల లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలనే డిమాండ్లతో భారీ ర్యాలీ చేపడుతున్నారు. దీనికి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో పాటు సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ జంక్షన్​ నుంచి నయీంనగర్, పెట్రోల్​పంప్, పోలీస్ ​హెడ్ ​క్వార్టర్స్ మీదుగా అంబేద్కర్ జంక్షన్​ వరకు ర్యాలీ కొనసాగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ర్యాలీ.. దాదాపు 2 కిలోమీటర్ల మేర సాగనుంది. 

సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

బీజేపీ ర్యాలీకి 17 కండీషన్లు విధిస్తూ పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే ర్యాలీ నిర్వహించాలన్నారు. ఈ ర్యాలీలో నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొననుండటంతో సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 

ఏర్పాట్లు పూర్తి..

ర్యాలీ ఏర్పాట్లను బీజేపీ నేతలు పూర్తి చేశారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ సభ్యులు మూడ్రోజులుగా వరంగల్ లోనే మకాం వేశారు. వరంగల్, హనుమకొండ సిటీల్లో పెద్ద ఎత్తున పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి వరంగల్​లోని యూనివర్సిటీలు, కోచింగ్ సెంటర్లు, లైబ్రరీల వద్ద నిరుద్యోగులకు పోస్టర్లు పంపిణీ చేసి నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలని కోరారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కళాకారులు ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి నిరుద్యోగ మార్చ్​ను సక్సెస్ చేయాలని  ప్రచారం నిర్వహించారు. ఈ ర్యాలీకి ఉస్మానియా, కాకతీయ వర్సిటీల జేఏసీ నాయకులు మద్దతు తెలిపారు. కాగా, ర్యాలీని విజయవంతం చేయాలని నిరుద్యోగ మార్చ్ నిర్వహణ కమిటీ కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి  పిలుపునిచ్చారు. నిరుద్యోగులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. త్వరలో అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 18న మహబూబ్ నగర్ లో, ఈ నెల 21న ఖమ్మంలో నిర్వహిస్తామని తెలిపారు.