
హుజూర్నగర్: శ్రీమంతులు తినే సన్నబియ్యం ఇకపై పేదలు కూడా తినే రోజులు వచ్చాయని హుజూర్నగర్ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్లో ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ.. రేషన్పై సన్నబియ్యం స్కీంతో చరిత్ర సృష్టించామని.. 2 కోట్ల మంది ప్రజలకు ఇకపై సన్న బియ్యం అందుతుందని తెలిపారు.
ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తోందని.. కానీ ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని ప్రజలు పది రూపాయలకే అమ్ముకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇలా రేషన్ బియ్యాన్ని పది రూపాయలకే కొనుక్కుంటున్న మిల్లర్లు వాటిని రీసైక్లింగ్ చేసి మళ్లీ 50 రూపాయలకు అమ్ముతున్నారని సీఎం వివరించారు. పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొంటున్న మిల్లర్లు కోట్ల రూపాయల దందా చేస్తున్నారని సీఎం తెలిపారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో రాష్ట్ర ప్రజలు సన్న బియ్యానికి మొగ్గుచూపుతున్నారని, అందుకే ప్రజల ఆకాంక్ష మేరకు రేషన్ కార్డులపై సన్న బియ్యం పథకానికి శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Also Read : సన్నబియ్యం పంపిణీ పథకం షురూ
ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలనే ఆలోచన గత సీఎంకు ఎప్పుడూ రాలేదని, గత సీఎం వరి వేస్తే ఉరే అని ప్రజలు వరి పండించకుండా బెదిరించారని కేసీఆర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సన్నబియ్యంపై క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తోందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 12 లక్షల టన్నుల సన్న వడ్లు పండితే.. నల్గొండ ప్రజలే 8 లక్షల టన్నులు పండించారని సీఎం రేవంత్ తెలిపారు. సన్న బియ్యం పథకాన్ని భవిష్యత్లో ఎవరూ రద్దు చేసే సాహసం కూడా చేయరని, ప్రభుత్వాలు మారినా కూడా సన్నబియ్యం పథకం ఎప్పటికీ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.