గ్లోబల్ వార్మింగ్ (భూతాపం) ఎఫెక్ట్ భూమిపై అంతా ఇంతా లేదు. దాని ప్రభావాన్ని తగ్గించేందుకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలంటున్నారు. వాహనాల నుంచి వచ్చే పొగ కాలుష్యాన్ని నియంత్రించాలంటున్నారు. మొక్కలు నాటాలంటున్నారు.. అడవులు పెంచాలంటున్నారు. ఇంకొందరైతే భవిష్యత్తులో వేరే గ్రహం మీదకే వెళ్లాలంటున్నారు. ఇవి గాకుండా వేరే ప్రత్యామ్నాయాలు లేవా? అంటే, మహత్తర మార్గం ఉందంటున్నారు. అదే భూమిని ‘షిఫ్ట్’ చేయడం. ఏం అది ఇంటిని మార్చినంత ఈజీనా ఏంది? కాదు, అస్సలు కానే కాదు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో ద వాండరింగ్ ఎర్త్ అనే చైనా కల్పిత సైన్స్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాలో మానవాళి మనుగడ కోసం భూమి కక్ష్యను మారుస్తారు. అంటే, సూర్యుడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోతారు. అదే నిజ జీవితంలో ఏదో ఒక రోజు నిజంగా నిజమవుతుందని సైంటిస్టులు అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోకు చెందిన స్పేస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ మాటియో సెరియోటి ఆ సిద్ధాంతాలను వివరించారు. భూమిని వేరే చోటుకు ఎలా షిఫ్ట్ చేయొచ్చో చెప్పారు.
సూర్యుడు భూమిని కాల్చేస్తాడు….
ఇప్పుడే గ్లోబల్ వార్మింగ్‌తో భూమి మండిపోతోంది. మరో 500 కోట్ల ఏళ్లలో భూమిని సూర్యుడు కాల్చేస్తాడట. సూర్యుడిలోని శక్తి మొత్తం విశ్వంతరాలకు వ్యాపించి భూమిని మసి చేసేస్తుందట. దానికి మంచి పరిష్కారం భూమిని వేరేచోటుకు మార్చడమేనన్నది సాధ్యమయ్యే ఓ సిద్ధాంతమని చెబుతున్నారు మాటియో. ఆ విషయంలో ఎదురయ్యే ఇంజనీరింగ్ సవాళ్లేంటి? ఉదాహరణకు సూర్యుడి నుంచి ఇప్పుడున్న దూరానికి 50 శాతం దూరంగా భూమిని తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అన్న దానిపై వివరణలు ఇచ్చారు. అంటే భూమి గమనాన్ని మార్స్ (అంగారకుడి కక్ష్య) లైన్లోకి తీసుకెళ్లిపోవడమన్నమాట. ఇంపల్సివ్, డిస్ట్రక్టివ్ యాక్షన్ ఒక మార్గం. ఓ ఆస్టరాయిడ్కు దగ్గర్లో లేదా దానిపైనే అణు పేలుళ్లు జరపడం. లేదా మితిమీరిన వేగంతో ఆస్టరాయిడ్‌ను స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీకొట్టించడం. ఇవన్నీ భూమి విషయంలో అసాధ్యం. ఇంకో టెక్నిక్.. కొన్నేళ్లపాటు కొంచెం కొంచెంగా భూమిని పక్కకు జరపడం. ఓ ఆస్టరాయిడ్‌పై ఉన్న టగ్బోట్తో భూమిని జరుపుతారు. కానీ, పెద్ద పెద్ద ఆస్టరాయిడ్లైనా భూమి బరువు దృష్ట్యా అదీ అసాధ్యమైన పనే. మరి, ఏం చేయాలి?
ఎలక్ట్రిక్ థ్రస్టర్స్…
నిజానికి ఇప్పటికే భూమి కొద్దికొద్దిగా తన ఆర్బిట్ నుంచి పక్కకు జరుగుతోందని మాటియోస్ అంటున్నారు. అంతరిక్ష ప్రయోగం చేసిన ప్రతిసారీ, భూమికి వ్యతిరేక దిశలో ఎంతోకొంత ఇంపల్స్ (శక్తి) పుట్టుకొస్తూనే ఉందని, అది కొంచెమైనా భూమిని పక్కకు జరుపుతుందని అంటున్నారు. అయితే, ఈ ప్రభావం చాలా తక్కువ. ప్రస్తుతం భూమిపై అత్యంత శక్తిమంతమైన రాకెట్ స్పేస్ఎక్స్కు చెందిన ఫాల్కన్ హెవీ రాకెట్. ఒకవేళ భూమిని అనుకున్న దూరం జరపాలనుకుంటే, ఆ రాకెట్‌తో 30 లక్షల కోట్ల కోట్ల (300 బిలియన్ బిలియన్) ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అంత చేసినా మార్స్ ఆర్బిట్‌లోకి భూమి వెళ్లేది 15 శాతమే. దానికి భిన్నంగా ఎలక్ట్రిక్ థ్రస్టర్తో శక్తిని సృష్టించి, భూమికి సమానమైన లేదా దానికన్నా ఎక్కువ బరువును సృష్టించి భూమిని పక్కకు జరపొచ్చు. ప్రత్యేకించి అయాన్ డ్రైవ్స్‌తో ఆ ఎలక్ట్రిక్ థ్రస్ట్‌ను సృష్టించొచ్చంటున్నారు. అయాన్ డ్రైవ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే, రాకెట్ ముందుకు దూసుకెళ్లేలా చార్జ్డ్ పార్టికల్స్‌ను విడుదల చేస్తుంది. సేమ్ అలాగే భూమికి వ్యతిరేక దిశలో ఈ అయాన్ డ్రైవ్స్ ద్వారా చార్జ్డ్ పార్టికల్స్‌ను రిలీజ్ చేసి భూమిని వేరేచోటుకు మార్చేలా చేయొచ్చట. భూమితో కనెక్షన్ ఉండేలా భూ వాతావరణానికి దూరంగా సముద్ర మట్టానికి వెయ్యి కిలోమీటర్ల ఎత్తులో ఈ పెద్ద థ్రస్టర్లను పెట్టాలంటున్నారు. సెకనుకు 40 కిలోమీటర్ల వేగంతో అయాన్ బీమ్ చార్జ్డ్ పార్టికల్స్‌ను కరెక్ట్ దిశలో పంపితే భూమి పక్కకు కదిలే అవకాశముంటుందంటున్నారు.
లైట్‌తో ప్రయాణం…
కాంతికి ప్రవాహ దిశ ఉంటుంది కానీ, బరువు (ద్రవ్యరాశి) ఉండదు. సూర్యుడి శక్తిని వాడుకుంటూ లేజర్ లాంటి లైట్ బీమ్‌తో భూమిని జరపొచ్చని మాటియో చెబుతున్నారు. 100 గిగావాట్ల లేజర్ ప్లాంట్‌తో ఈ ప్రయోగం చేపట్టినా అదే 30 లక్షల కోట్ల కోట్ల సంవత్సరాలు పడుతుందంటున్నారు. అది గాకుండా సూర్యుడి నుంచే కాంతిని నేరుగా భూమిపైకి ప్రయోగిస్తూ పక్కకు జరపొచ్చని చెబుతున్నారు. అయితే, అందుకు భూమి వ్యాసం కన్నా 19 రెట్ల పెద్దదైన రిఫ్లెక్టివ్ డిస్క్ వాడాలంటున్నారు. దానికీ వంద కోట్ల ఏళ్లు పడుతుందని చెబుతున్నారు.
ఇంటర్‌ప్లానెటరీ బిలియర్డ్….
రెండు గ్రహాలు లేదా స్పేస్ బాడీస్ తిరిగే గతి, వేగం, గురుత్వాకర్షణ బలాలు మార్చేందుకు ఈ టెక్నిక్‌నే వాడతారని మాటియో చెబుతున్నారు. ఇంటర్‌ప్లానెటరీ (గ్రహాంతర) ప్రయోగాలకు ఎక్కువగా వాడతారని అంటున్నారు. ఉదాహరణకు 2014–16 మధ్య 67పీ అనే తోకచుక్కపై రోసెట్టా స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగాలు చేసింది. 2005, 2007లో రెండు సార్లు అది భూమికి అతి దగ్గర నుంచి వెళ్లిందని, అప్పుడు భూమి గురుత్వాకర్షణ బలాలు 67పీకి కొంచెం వెళ్లాయని ఆ పరిశోధనలో తేలినట్టు ఆయన చెప్పారు. దాని ప్రభావమూ భూమిపై ఉందన్నారు. ఒక్క థ్రస్టర్స్ వల్ల ఇదంతా సాధ్యం కాదన్నారు. పెద్ద స్పేస్‌క్రాఫ్ట్ కన్నా పెద్దదైన ఆస్టరాయిడ్‌తో స్లింగ్‌షాట్‌తో దీనిని సాధ్యం చేయొచ్చంటున్నారు. అయితే, దాని ఆర్బిట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ ప్రయోగాన్ని చాలా సార్లు చేయాల్సి ఉంటుందని వివరించారు. అలాచేస్తే భూమి కక్ష్య మారుతుందన్నారు. ఆస్టరాయిడ్లే ప్రధాన సోర్సుగా వాడుకున్నట్లయితే కొన్ని లక్షల కోట్ల ఆస్టరాయిడ్లు భూమి దగ్గరి నుంచి వెళ్లాల్సి ఉంటుందని, అప్పుడు వాటి గురుత్వ బలాలు తోడై భూమి పక్కకు తొలిగే అవకాశాలుంటాయని వివరిస్తున్నారు. దానికీ ఓ వెయ్యేళ్ల టైం పడుతుందన్నారు. అన్నింట్లోకెల్లా లక్షల ఆస్టరాయిడ్ల స్లింగ్ షాట్‌తో భూమిని జరపడమే మేలైన విధానమని వివరించారు. మనం ఎంత పెద్ద స్పేస్ నిర్మాణాలు చేపడతామన్నదానిపైనే ఇది ఆధారపడి ఉందన్నారు. కష్టమే అయినా భూమిని వేరే చోటుకు మార్చడమన్నది జరిగే పనేనని మాటియో వివరించారు.