కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.34 వేల కోట్లు!

  •     మిషన్​ భగీరథకు ఆర్థిక సాయం
  •     వ్యవసాయానికి ప్రోత్సాహకం
  •     కొత్తగా రూ.419 కోట్ల  హెల్త్​ గ్రాంట్​ 
  •     పన్నుల వాటాకు తోడు జీఎస్టీ పరిహారం

‌‌‌‌‌హైదరాబాద్, వెలుగు: కేంద్రం పెట్టిన కొత్త బడ్జెట్​ ప్రకారం వచ్చే ఫైనాన్షియల్​ ఇయర్​(2021–22)లో రాష్ట్రానికి రూ.34 వేల కోట్ల వరకు అందనున్నాయి. రాష్ట్ర సర్కారు పదే పదే విజ్ఞప్తి చేసిన మిషన్​ భగీరథకు ఆర్థిక సాయం అందించాలని ఫైనాన్స్  కమిషన్​ రికమెండ్​ చేయడం ఆశలు రేకెత్తించింది. ఈ స్కీమ్​కు రూ.2,350 కోట్లు సాయం అందనుంది. ఇక అగ్రికల్చర్​ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్​ కింద రూ.1,665 కోట్లు రానున్నాయి. గతంతో పోలిస్తే కేంద్ర పన్నుల్లో వాటా నిధులు కాస్త తగ్గినా.. జీఎస్టీ పరిహారం అందనుంది. కొత్తగా హెల్త్ గ్రాంట్​ను ఫైనాన్స్​ కమిషన్ ​రికమెండ్​ చేయడం కలిసి రానుంది.

జీఎస్టీ పరిహారంతో ఊరట

ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటా (టాక్స్​ డెవల్యూషన్)​తోపాటు ఫైనాన్స్​ కమిషన్​ గ్రాంట్లు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్​ల నిధులు రాష్ట్రాలకు అందుతాయి. సెంట్రల్​ జీఎస్టీ, ఇన్​కమ్​ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్​ ట్యాక్స్, ఎక్సైజ్​ డ్యూటీ, సర్వీస్​ టాక్స్, కార్పొరేట్​ ట్యాక్సుల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 6.65 లక్షల కోట్లను పంపిణీ చేయనుంది. అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102 శాతం నిధులు.. అంటే రూ.13,990 కోట్లు తెలంగాణకు వస్తాయి. 2021–-22 ఫైనాన్షియల్​ఇయర్​లో జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి రూ.2,136 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్​ కమిషన్​ సూచించింది. ఈ మేరకు ఫండ్స్​ అందనున్నాయి. కేంద్రం అమలు చేస్తున్న సెంట్రల్​ స్పాన్సర్డ్ స్కీమ్‌ల కింద రూ.10,900 కోట్లు వస్తాయని ఫైనాన్స్​ డిపార్ట్​మెంట్​ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర గ్రాంట్ల రూపంలో మరో రూ.3,541 కోట్లు వస్తాయని చెప్తున్నారు.

హైదరాబాద్​కు స్పెషల్​ గ్రాంట్

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.2,037 కోట్ల గ్రాంట్​ రిలీజ్​ కానుంది. హైదరాబాద్​కు ప్రత్యేకంగా రూ.354 కోట్లు, డిజాస్టర్​ మేనేజ్​మెంట్​సాయం కింద రూ.599 కోట్లు కేటాయించారు. గ్రామీణ సడక్​ యోజన, జ్యుడిషియరీ, స్పెషల్​ గ్రాంట్లుగా మరో 132 కోట్లు విడుదలవుతాయి.

కొత్తగా రూ.419 కోట్ల హెల్త్ గ్రాంట్

కరోనా ఎఫెక్ట్​తో కేంద్రం ఈసారి పబ్లిక్​ హెల్త్​కు బడ్జెట్లో ప్రయారిటీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రానికి రూ.419 కోట్ల హెల్త్​ గ్రాంట్​ రానుంది. పీహెచ్​సీల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్​ వెల్​నెస్​ సెంటర్లు, డయాగ్నస్టిక్ సెంటర్లను డెవలప్​ చేసేందుకు, అప్​గ్రేడ్​ చేసేందుకు వాటిని ఖర్చు చేస్తారు.