- ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్
ఎల్కతుర్తి, వెలుగు : కరెంట్ అడుక్కునే స్థానం నుంచి ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు మనమే కరెంట్ ఇచ్చే స్థాయికి వచ్చాం అని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ అన్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి, సూరారంలో రూ.1.65 కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు హస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్, జడ్పీ చైర్మన్ డాక్టర్ సుదీర్ కుమార్ తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. సూరారంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర పాలనకు అంబేద్కర్ విధానాలే స్ఫూర్తి అని, అందుకే హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు.
ALSO READ :చేర్యాల రెవెన్యూ డివిజన్ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
తెలంగాణ వస్తే కరెంటు లేక తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అన్నారని, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, సర్పంచ్ కుర్ర సాంబమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.