
తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు అందించే అన్న ప్రసాదం మెనూలో గురువారం (మార్చి 06) నుంచి కొత్త పదార్థం చేరింది. తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు శెనగపప్పు గారెల వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించింది టీటీడీ. ముందుగా గారెలను స్వామి, అమ్మవార్ల చిత్రపటాల వద్ద ఉంచి పూజలు చేసిన తర్వాత భక్తులకు వడ్డించారు.
పూజ అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా భక్తులకు గారెలు వడ్డించారు. గారెలు రుచిగా, కమ్మగా ఉన్నాయంటూ సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ జే శ్యామలరావు , అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, ఇతర టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన తనకు కలిగిందని ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ‘‘
నా ఆలోచనను సీఎం దృష్టికి తీసుకెళ్లాను, ఆయన అంగీకారంతో గత నెలలో ట్రైయల్ రన్ లో భాగంగా రోజుకు 5 వేల వడలు భక్తులకు అందించాం. గారెలను ఇవాళ నుంచి పర్మనెంట్ గా మెనూలో ప్రవేశపెట్టాం’’ అని అన్నారు.
తిరుమలలో నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాలను వడ్డిస్తున్నామని చెప్పారు చైర్మన్. ఉ 10:30 నుండి సా 4 గంటల వరకు ప్రతిరోజు 35 వేల గారెలను భక్తులకు వడ్డిస్తామని, భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.