వాటర్​ బాయ్​ నుంచి ఎంపీ వరకు..మందా జగన్నాథం ప్రస్థానం

మహబూబ్​నగర్, వెలుగు: చిన్నతనం నుంచే కష్టపడి పనిచేస్తూ మందా జగన్నాథం పార్లమెంట్​ సభ్యుడిగా ఎదిగారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయన తల్లిదండ్రులకు చేదోడుగా కూలీ పనులకు సైతం వెళ్లాడు. సమ్మర్  హాలిడేస్​లో నాగార్జునసాగర్  డ్యామ్‌లోని చీఫ్  ఇంజనీర్  ఆఫీసులో వాటర్ బాయ్‌గా పని చేశారు. ఆ తరువాత డాక్టర్​గా, ఎంపీగా ఎదిగి సేవలందించారు. స్కూల్​ డేస్​లో ఆయన రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హిల్ కాలనీలో టెన్నిస్  బాల్  పికప్  బాయ్‌గా పని చేసేవారు.

ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సమ్మర్  హాలిడేస్​లో రోజుకు 50 పైసల రోజువారీ కూలీకి నాగార్జున సాగర్  నిర్మాణ స్థలంలో కూలీగా కూడా చేశారు. అనారోగ్యంతో డిసెంబర్  27న తీవ్ర అస్వస్థతకు గురవగా, కుటుంబసభ్యులు హైదరాబాద్​లోని నిమ్స్  ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన మృతి పట్ల వివిధ పార్టీల లీడర్లతో పాటు ఆయన సన్నిహితులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిన్నతనం సాగిందిలా.. 

జగన్నాథం సొంతూరు ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇటిక్యాల. మే 22, 1951లో పుల్లయ్య, సవారమ్మ దంపతులను జన్మించారు. అయితే ఉద్యోగ రీత్యా పుల్లయ్య దంపతులు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో పైలాన్‌ కాలనీలో నివాసం ఉండడంతో జగన్నాథం బాల్యం మొత్తం అక్కడే కొనసాగింది. జగన్నాథంకు సావిత్రితో వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పల్లవి ఎంఎస్  పూర్తి చేసి గైనకాలజిస్ట్​గా సేవలందిస్తోంది. పెద్ద కొడుకు శ్రీనాథ్  బీటెక్  పూర్తి చేసి సోషల్  వర్కర్​గా ఉంటున్నారు. చిన్న కొడుకు విశ్వనాథ్ ఎంబీబీఎస్  పూర్తి చేసి డాక్టర్​గా సేవలు అందిస్తున్నారు.

రాజకీయ ప్రస్థానం..

జగన్నాథం 1996లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్  క్యాండిడేట్  మల్లు రవిపై 76,375 ఓట్ల మెజార్టీతో గెలపొందారు. 1998లో జరిగిన ఎన్నికల్లో మల్లు రవిపై రెండు వేల ఓట్లతో ఓడిపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో తిరిగి మల్లు రవిపై 66,900 ఓట్ల మెజార్టీతో, 2004లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెంటెండ్ అభ్యర్థి కేఎస్  రత్నంపై 99,650 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009లో టీడీపీని వీడి కాంగ్రెస్​లో చేరి, నాగర్​కర్నూల్  ఎంపీగా పోటీ చేశారు. బీఆర్ఎస్  క్యాండిడేట్ గువ్వల బాలరాజుపై విజయం సాధించారు.

2014లో కాంగ్రెస్ ను వీడారు. కేసీఆర్  సమక్షంలో బీఆర్ఎస్​లో చేరారు. అదే ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్  క్యాండిడేట్  నంది ఎల్లయ్యపై 16,676 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో ఆయనను కేసీఆర్  ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికార ప్రతినిధిగా కేబినెట్ హోదాలో నామినేట్ పోస్టు కల్పించారు. ఆ తరువాత మరోసారి రెన్యూవల్ చేయగా, ఇదే హోదాలో ఆయన 2023 వరకు పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్  అసెంబ్లీ స్థానం నుంచి తన కొడుకు శ్రీనాథ్​ను బరిలో నిలిపే ప్రయత్నం చేశారు. పార్లమెంట్​ ఎన్నికల నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.