కోల్ బెల్ట్,వెలుగు: మందమర్రి మండల పరిధిలో శేషపల్లి గ్రామంలో రైతులు నేషనల్ హైవే పనులను మంగళవారం అడ్డుకున్నారు. శేషపల్లి బైపాస్ రోడ్డులోని మంచిర్యాల- రవీంద్రఖని రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ దగ్గర ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ పొలాలకు వెళ్లేందుకు తారు రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. హైవే అథారిటీ ఆఫీసర్లు, అదానీ గ్రూప్ అఫీషియల్స్తో వాదనకు దిగారు. నేషనల్ హైవే 363 రహదారి రాకముందు తమ గ్రామం నుంచి పంటపొలాలకు వెళ్లేందుకు రోడ్డు ఉండేందని చెప్పారు.
భూసేకరణ సందర్భంగా పంటపొలాలకు రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు దారిని మూసేసి కొత్త హైవే నిర్మించారన్నారు. వందల ఎకరాల పంటపొలాలకు నిత్యం వెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రతి చిన్న పనికి సుమారు 4 కి.మీ దూరం చుట్టూ తిరిగివెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందారు. హైవే కోసం చేన్లలో కోల్పోయిన చెట్లకు ఇప్పటికీ పరిహారం రాలేదని పేర్కొన్నారు. డిమాండ్లను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్తామని హైవే ఆఫీసర్లు పేర్కొన్నారు.