ఫ్రస్టేషన్.. కోపం.. ఆవేశం.. ప్రాణాలు తీసిన మూడు ఘటనలు.. 24 గంటల వ్యవధిలో ఐదు హత్యలు!

ఫ్రస్టేషన్.. కోపం.. ఆవేశం.. ప్రాణాలు తీసిన మూడు ఘటనలు.. 24 గంటల వ్యవధిలో ఐదు హత్యలు!

= నలుగురిని కన్నవారే కడతేర్చారు
= పరువనే బంధం ఒకరిని మింగేసింది

హైదరాబాద్: మానవత్వం మంటకలిసింది.. క్షణికావేశం.. ఆర్థిక ఇబ్బందులు.. పరువు ఐదుగురిని పొట్టన పెట్టుకున్నాయి. 24 గంటల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ప్రాణాలు కోల్పోయిన వారిలో నలుగురు పిల్లలే. వారిలో పది హేను రోజుల పసిగుడ్డు కూడా ఉండటం గమనార్హం.

 నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను ఏ తల్లైనా అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు, బిడ్డను సాకలేనేమో అనే ఆందోళనతో నీళ్ల బకెట్ లో వేసి హతమార్చిందో తల్లి. తమిళనాడుకు చెందిన ముదులై మణి, ఆరోగ్య విజ్జి(30) ఇద్దరూ దంపతులు. హైదరాబాద్​ ఐడీఏ బండ్లగూడలో ఉంటున్నారు. శాస్త్రిపురం అలీనగర్‌లోని ఓ కంపెనీలో రోజు కూలీలుగా వీరిద్దరూ పనిచేస్తున్నారు. వారికి ఏడాది బాబు ఉన్నాడు. ఆరు నెలల క్రితం ముదులై మణి అనారోగ్యంతో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా రెండు మూత్రపిండాలు పనిచేయడం లేదని తేలింది. 

అప్పటికే ఆరోగ్య విజ్జి గర్భంతో ఉంది. 15 రోజుల కింద ప్రసవం జరగ్గా ఆడపిల్ల పుట్టింది. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన తర్వాత ఆరోగ్య తీవ్రంగా ఆలోచించింది. ఇప్పటికే భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, ఒకవేళ ఆయన మరణిస్తే తమ పరిస్థితి ఏమిటని భావించింది. ఆడపిల్ల పెద్దయ్యాక పెళ్లి, ఇతర ఖర్చులు ఒంటరి మహిళగా తాను భరించలేమని చంపేద్దామని నిర్ణయించుకుంది. నీళ్ల బకెట్ లో వేసి తల్లే హతమార్చింది. తాను చిన్నారిని మంచం మీద పడుకోబెట్టి స్నానానికి వెళ్లగా ఎవరో నీళ్ల బకెట్‌లో పడేశారని చెప్పింది. భర్తకు విషయాన్ని చెప్పి కన్నీరుమున్నీరుగా విలపించింది.

 సంగారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తల్లి తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఫుడ్​ పాయిజన్​ వల్ల ఈ మరణాలు సంభవించాయా? పిల్లలపై తల్లే విష ప్రయోగం చేసిందా? అనేది చర్చనీయాంశంగా మారింది.  కుటుంబ కలహాలతోనే బిడ్డలను హతమార్చి తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చనిపోయిన వాళ్లంతా 12 ఏండ్లలోపు పిల్లలే.. 

ఇదిలా ఉండగా పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య జరిగింది. తనన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని భావించిన తండ్రి.. ఆ యువకుడిపై కక్ష పెంచుకున్నాడు. యువకుడి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటనతో ఊరంతా షాక్ కు గురైంది. ఈ మూడు ఘటనలు ఇవాళ హాట్ టాపిక్ గా మారాయి.