బెదిరింపులు, దాడులు .. బీఆర్ఎస్ నేతల్లో రోజురోజుకు పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్

ప్రచారంలో తమను పబ్లిక్​ నిలదీస్తుండడంతో బీఆర్ఎస్  క్యాండిడేట్లు, లీడర్లలో ఫ్రస్ట్రేషన్  పెరిగిపోతోంది. ప్రతిపక్ష లీడర్లతో పాటు కామన్​ పబ్లిక్​పైనా అధికార పార్టీ లీడర్లు బూతుపురాణం విప్పడం, దాడులకు తెగబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్  మొదలుకొని బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  దాకా నోరు కంట్రోల్​ చేసుకోలేకపోతున్నారు. 

బీఆర్ఎస్​ లీడర్లు సూర్యాపేట నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థిపై ఏకంగా గొడ్డళ్లు, కత్తులతో మర్డర్  ప్లాన్  చేశారు. నాగర్​కర్నూల్​ సెగ్మెంట్​లో ఇండిపెండెంట్​ అభ్యర్థి తమ్ముడిపై, మంథని సెగ్మెంట్​లో కాంగ్రెస్​ లీడర్​పైనా రూలింగ్​పార్టీ లీడర్లు భౌతికదాడులకు దిగారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అరాచకాలకు విసిగిపోయి చాలా మంది నాయకులు బీఆర్ఎస్ ను వీడి  కాంగ్రెస్ లో చేరుతుండడంతో బీఆర్ఎస్  నేతలు నైరాశ్యానికి​కు లోనై బూతులు తిడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా యాదాద్రి జిల్లా వలిగొండ రోడ్డు షోలో డిగ్రీ కాలేజీ కావాలని, ఉద్యోగాలివ్వాలని ప్లకార్డులు ప్రదర్శించినందుకు మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ నాయకులపై తిట్ల దండకం అందుకోవడం వివాదాస్పదమైంది.

ప్రచారానికి వచ్చే నేతలపై దాడులు

బీఎస్పీ సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్  సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్ లో ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సామ తిరుమల్ రెడ్డి, అతని కొడుకు  రాజశేఖర్ రెడ్డి కత్తులు, గొడ్డళ్లతో ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో జానయ్య పక్కనే ఉన్న డ్రైవర్ చింత రమేశ్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతడి చేతి వేలు తెగిపోయింది. జానయ్య గాయాలతో బతికి బయటపడ్డారు.  

మంథని నియోజకవర్గంలోని మహముత్తారం మండలం కిష్టాపూర్ గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి కాంగ్రెస్  తరపున ప్రచారం చేస్తున్న ముత్తారం మండలం ఓడెడ్ గ్రామ సర్పంచ్ బక్కారావు (బక్కన్న) పై బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. ప్రచారంలో భాగంగా గ్రామ సమీపంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురుపడి పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలు అకస్మాత్తుగా కాంగ్రెస్  నేత బక్కా రావుపై దాడి చేశారు. దీంతో ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంగ్రెస్  హవా వీస్తుండడంతోనే  ఫ్రస్టేషన్​లో  బీఆర్ఎస్  నాయకులు దాడులు చేస్తున్నారని మంథని కాంగ్రెస్​ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్​బాబు వాపోయారు.

నాగర్​కర్నూల్​ నియోజకవర్గంపెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇండిపెండెంట్​ అభ్యర్థి శిరీష (బర్రెలక్క) ప్రచారం చేస్తుండగా బీఆర్​ఎస్​లీడర్లు దాడి చేశారు. దీంతో ఆమె తమ్ముడికి గాయాలయ్యాయి. తనపై కోపం తన తమ్ముడిపై చూపడం ఏమిటని శిరీష కన్నీరుమున్నీరయ్యారు. 
కామారెడ్డి మండలానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఈనెల 20న ఎల్లారెడ్డిలో సమావేశానికి వెళుతుండగా.. గర్గుల్ గ్రామంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్దన్​ ర్యాలీ ఎదురైంది. రోడ్డుపై రద్దీ ఎక్కువగా ఉండడంతో ఓ పక్కకు ఆగిన బీజేపీ కార్యకర్తలకు చెందిన తుఫాన్  వాహనంపై కొందరు రాళ్లతో దాడి చేశారు. దీంతో అద్దాలు పగిలి అందులోని పలువురికి గాయాలయ్యాయి. 

సాగర్​ బైపోల్​ టైంలో ఎమ్మెల్యే భగత్​ను గెలిపిస్తే ఏడాదిన్నర కాలంలోనే నెల్లికల్లు లిఫ్ట్​ను కుర్చీ వేసుకుని పూర్తిచేస్తానని కేసీఆర్​ చెప్పారు. కానీ పనులు కాకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 14న నెల్లికల్లు లిఫ్ట్​ వద్ద బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంకణాల నివేదితరెడ్డి, ఆమె భర్త జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​ రెడ్డితో కలిసి ధర్నా చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు కంకణాల శ్రీధర్​ రెడ్డి, బీజేపీ కార్యకర్తలపై బీఆర్‌‌ఎస్  కార్యకర్తలు దాడి చేశారు. శ్రీధర్​ రెడ్డికి బలమైన గాయాలు కావడంతో నల్గొండ లోని నిమ్స్ కు వెళ్లి ట్రీట్​మెంట్​ పొందారు.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజీపల్లి లో ఈనెల 14న ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ని కాంతాల సురేందర్ రెడ్డి అనే దివ్యాంగుడు తనకు పెన్షన్ రావడం లేదని అడిగాడు. దీంతో అక్కడే ఉన్న జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి స్టేజీ పైనుంచి  దిగొచ్చి తనపై దాడి చేశాడని సురేందర్ రెడ్డి ఆరోపించాడు. గతంలో తాను బీఆర్ఎస్ లో పనిచేశానని, సబ్ కెనాల్ నిర్మాణం చేపట్టడం లేదని ప్రశ్నించిన కారణంగానే తనపై కక్షతో జెడ్పీటీసీ దాడికి పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు జెడ్పీటీసీ నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. 

అధికారంలోకి వచ్చాక నీ సంగతి చూస్తా 

‘‘నువ్వు కాంగ్రెస్​ పార్టీలోకి పోతున్నవ్​. గెలిచేది బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరిప్రియనే. అధికారంలోకి వచ్చిన 20 రోజుల తర్వాత నీ సంగతి చూస్తా’’ అంటూ ఇల్లెందు ఎమ్మెల్యే భానోత్​ హరిప్రియ భర్త హరిసింగ్..​ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మ భర్త జానీని బెదిరించిన ఫోన్​ కాల్​ వాయిస్​ రికార్డ్​ సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఇల్లెందు ఎంపీపీ చీమల నాగరత్నమ్మతో పాటు పలువురు బీఆర్ఎస్​కు రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే భర్త హరిసింగ్..​ ఎంపీపీ భర్త జానీకి ఫోన్​ చేసి బెదిరించిన వాయిస్ రికార్డింగ్ వెలుగులోకి వచ్చింది. 

నేను వేయించిన రోడ్డు మీద ఎట్ల నడుస్తవ్:  గువ్వల

అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం ఉడిమిళ్లలో ఆదివారం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుతో స్థానిక గిరిజన మహిళ మేఘావత్ శారద సమస్యలపై మొరపెట్టుకున్నారు. దీంతో  తీవ్ర అవేశానికి లోనైన గువ్వల ‘ముందు నేను వేయించిన రోడ్డు మీది నుంచి దిగి మాట్లాడు’ అన్నాడు. వెంటనే ఆ మహిళ ‘నా ఇంటి ముందు నుంచి కదిలి మాట్లాడు’ అని బదులిచ్చారు. సమస్యలు పరిష్కరించాలని అడిగిన మహిళలతో ఇలా మాట్లాడుతారా అని ఆమె మండిపడ్డారు. 

బట్టలూడదీసి కొడ్తా : బాల్క సుమన్

చెన్నూర్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. ఈనెల 9న నామినేషన్​ వేసిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా కాంగ్రెస్​ లీడర్లను బూతులు తిడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. ‘‘సూట్ కేసు గానికి అమ్ముడు పోయిన లం.. కొడుకులను బట్టలూదీసి కొడ్తా. ఒక్కొక్కడు ఎన్నెన్ని లక్షలకు ఆ సూట్​కేసు గానికి అమ్ముడుపోయిన్రో బట్టలిప్పి బజారున నిలబెట్టుర్రి. డిసెంబర్​ 30 దాకా ఆ చర్చ మీరు(కార్యకర్తలు) పెట్టున్రి. 30 తర్వాత నా చర్య మీరు చూస్తరు’’ అంటూ బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన లీడర్లను సుమన్  బెదిరింపులకు గురిచేశారు.

నా కొడుకులు.. వీపు పగులగొట్టాలె:  కేటీఆర్ 

యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్డు షోలో డిగ్రీ కాలేజీ కావాలని, ఉద్యోగాలివ్వాలని కొందరు స్టూడెంట్లు ప్లకార్డులు ప్రదర్శించినందుకు బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఫ్రస్టేషన్ కు లోనయ్యారు. ‘‘ఆ సన్నానులు అడుగుతున్నరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావాలని. 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఏం పీకారు? ఇజ్జత్ మానం లేదు అడగడానికి. 55 ఏళ్లు పరిపాలించిన చెత్త నా కొడుకులు ఇవాళ వచ్చి ఇది లేకపాయే.. అది లేకపాయే అంటే వీపు పగులకొట్టే వాళ్లు లేకనా? మీ యాదాద్రిని జిల్లా చేసింది ఎవరు?  కేసీఆరేనా.. మరి చెత్త నా కొడుకులతో అయిందా. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. 55 ఏళ్లలో కరెంట్ ఇచ్చిన కొడుకులా వీళ్లు. తాగునీళ్లు ఇచ్చిర్రా. వలిగొండలో ఇవి అడిగితే వీపు పగులకొట్టి పంపించాలే. 30వ తారీకున ఎవడు అడ్డం వచ్చినా తొక్కుకుంటూ పోవుడే’’ అంటూ కేటీఆర్  తీవ్ర అసహనంతో మాట్లాడారు.  

ALSO READ : చెయ్యికి చాన్స్ ఇచ్చేనా..! సిటీలో సెటిలర్ల ​ఓట్లు ఎటువైపు?

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ లో మంగళవారం నిర్వహించిన సభలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్  నాయకులపై మరోసారి పరుష పదజాలం వాడారు. ‘‘ఏకుతా పీకుతా అన్న రఘునందన్ రావు ఏం చేశాడు? ఢిల్లీ గద్దల నుంచి కాపాడాలి. తెలివితక్కువ నా కొడుకులు కాంగ్రెస్  నాయకులు. కాంగ్రెస్  నాయకులకు సిగ్గూశరం లేదు. ఎద్దు, ఎవుసం తెలవని సన్నాసులు కాంగ్రెస్ నాయకులు’’ అంటూ  దుర్భాషలాడారు.