మునుగోడులో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్‌‌తో ఈ నాటకానికి తెర లేపారు : వివేక్ వెంకటస్వామి

మునుగోడు, వెలుగు: ఎమ్మెల్యేల కొనుగోలు ఒక డ్రామా అని, మునుగోడులో ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషన్‌‌తో ఈ నాటకానికి తెర లేపారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యేలు మునుగోడులో ఉండకుండా ఫాం హౌస్​కు ఎందుకెళ్లారో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. శుక్రవారం మునుగోడులోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో వివేక్‌‌ మీడియాతో మాట్లాడారు. ఆ నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీకి పనిలేదని, వారిని కొనాల్సిన అవసరం అంతకన్నా లేదన్నారు. పదవికి రాజీనామా చేసిన తర్వాతే బీజేపీలోకి లీడర్లను చేర్చుకుంటారని, మధ్యప్రదేశ్‌‌లో ఓ ఎమ్మెల్యే.. ఇక్కడ ఈటల రాజేందర్, రాజగోపాల్​రెడ్డి కూడా తమ పదవులకు రిజైన్‌‌ చేసిన తర్వాతే పార్టీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

రామచంద్ర భారతి సీఎం కేసీఆర్‌‌‌‌ కోవర్ట్ అని, అతనితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మునుగోడులో కొట్లాడలేమని టీఆర్‌‌‌‌ఎస్‌‌ భయపడుతోందని, అందుకే కేసీఆర్ బై పోల్‌‌ను రద్దు చేయించేందుకు ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. అవినీతి సొమ్ముతో ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ భవనం కట్టుకుంటున్నారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ చిత్తుచిత్తుగా ఓడిపోనుందని చెప్పారు. దీంతో ఓటర్లను కొనేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని, కానీ, నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ లీడర్లు వీరెల్లి చంద్రశేఖర్, కంకణాల శ్రీధర్ రెడ్డి, కంకణాల నివేదిత తదితరులు పాల్గొన్నారు.