మన రాకెట్లు, క్షిపణుల ఇంధనం మరింత పవర్​ఫుల్​ : ఐఐసీటీ సైంటిస్టులు

మన రాకెట్లు, క్షిపణుల ఇంధనం మరింత పవర్​ఫుల్​ : ఐఐసీటీ సైంటిస్టులు

హైదరాబాద్, వెలుగు: రాకెట్లు, క్షిపణుల్లో వాడే ఇంధనాన్ని మరింత శక్తివంతంగా చేసే పద్ధతిని హైదరాబాద్​కు చెందిన ఇండియన్​ ఇన్ స్టిట్యూట్​ ఆఫ్​ కెమికల్​ టెక్నాలజీ (ఐఐసీటీ) సైంటిస్టులు అభివృద్ధి చేశారు. సీఎల్​20 (చైనా లేక్​ 20) అనే ప్రొపెల్లెంట్​లో వాడే ఆక్సిడైజర్​ టీఏఐడబ్ల్యూని మన దేశంలోనే తయారు చేసుకునే కేటలిటిక్​ ప్రాసెస్​ను ఐఐసీటీ చీఫ్​​ సైంటిస్ట్​ ఎన్.లింగయ్య నేతృత్వంలోని పరిశోధకులు దేశీయంగా డెవలప్  చేశారు. ఇప్పటిదాకా టీఏఐడబ్ల్యూని మన దేశం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. 

తాజాగా టీఏఐడబ్ల్యూను దేశీయంగా అత్యంత సులువుగా తయారు చేసుకునే పద్ధతిని ప్రీమియర్​ ఎక్స్​ప్లోజివ్స్​ లిమిటెడ్​ అనే సంస్థతో కలిసి సైంటిస్టులు అభివృద్ధి చేశారు. సాధారణంగా రాకెట్లు, క్షిపణుల్లో వాడే ఆర్డీఎక్స్​, హెచ్ఎంఎక్స్​ ప్రొపెల్లెంట్లతో పోలిస్తే సీఎల్​ 20.. ఇరవై  శాతం శక్తివంతమైనదని సైంటిస్టులు చెబుతున్నారు. సీఎల్​20 ఇంధనాన్ని వాడడం ద్వారా రాకెట్లు, మిసైళ్లు 20 శాతం ఎక్కువ ఎనర్జీని విడుదల చేస్తాయని తెలిపారు. ఈ కేటలిటిక్​ ప్రాసెస్​ పర్యావరణ హితమని, చాలా తక్కువ ఖర్చుతోనే తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. 

దీనిని మన దేశంలోనే తయారు చేసుకోవడం వల్ల ఇక విదేశాలపై ఆధారపడడం చాలా వరకు తగ్గుతుందని వెల్లడించారు. రాకెట్లు, ప్రొపెల్లెంట్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించేందుకు దోహదపడుతుందన్నారు. కాగా, ఈ టెక్నాలజీని ప్రీమియర్​ ఎక్స్​ప్లోజివ్స్​ లిమిటెడ్​ సంస్థకు ఐఐసీటీ ట్రాన్స్​ఫర్​ చేసింది.