
బెల్జియం: విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకును సుమారు 14 వేల కోట్ల రూపాయలకు మోసగించిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలోని యాంట్వెర్ప్లో తన భార్య ప్రీతి చోక్సీతో కలిసి నివసిస్తున్నట్లు తెలిసింది. ఎఫ్ రెసిడెన్షీ కార్డ్ పొందిన ప్రీతి చోక్సీ బెల్జియం పౌరసత్వంతో అక్కడ నివసిస్తుండటం గమనార్హం.
పీఎన్బీ కేసులో.. ముంబై కోర్టులో 2018, మే 23.. 2021, జూన్ 15న మెహుల్ చోక్సీపై రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నాన్ బెయిలబుల్ వారెంట్లకు అనుగుణంగానే చోక్సీ అరెస్ట్ జరిగినట్లు తెలిసింది. శనివారమే చోక్సీని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెల్జియంలోనే జైలులో ఉన్నట్లు తెలిసింది. అనారోగ్య కారణాలను చూపించి బెయిల్ కోరాలని చోక్సీ భావిస్తున్నాడు.
Fugitive Mehul Choksi has been arrested in Belgium: ED Sources
— ANI (@ANI) April 14, 2025
More details awaited pic.twitter.com/SN8e0beAMu
చోక్సీని బెల్జియంలో అరెస్ట్ చేయడంతో ఇండియా నుంచి ఈడీ, సీబీఐ అధికారులు ఒత్తిడి పెంచనున్నారు. చోక్సీని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ముంబైలోని పీఎన్బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్ను వేల కోట్లకు మోసం చేసిన కేసులో మెహుల్ చోక్సీ, అతని మేనల్లుడు నీరవ్ మోదీ, ఇతర కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, కొందరు బ్యాంకు అధికారులపై 2018లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసులు నమోదు చేసింది.
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, నీషల్ మోడీ, మెహుల్ చోక్సీ, లలిత్ మోడీ, నితిన్ జే. సందేశర, దిప్తి చేతన్‌కుమార్ సందేశర వంటి ఆర్థిక నేరగాళ్లు బ్యాంకుల నుంచి రూ. కోట్లల్లో అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకుండా విదేశాలకు చెక్కేశారు. ఈ ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు తిరిగి తెచ్చేందుకు చట్టపరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.