స్నైపర్‌తో కాల్చినా సేఫ్: ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ తయారుచేసిన ఆర్మీ మేజర్

స్నైపర్‌తో కాల్చినా సేఫ్: ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ తయారుచేసిన ఆర్మీ మేజర్

సరిహద్దులో ఓ వైపు ముష్కర మూకల దాడులు.. మరోవైపు పాక్ ఆర్మీ ఆగడాలు.. నిత్యం తూటాల వర్షంతో సావాసం భారత ఆర్మీ జవాన్ల జీవనం. బోర్డర్‌లో పహారా అంటే ప్రాణాలను పణంగా పెట్టి తూటాలకు ఎదురునిలవడమే. నిన్న మొన్నటి వరకు జమ్ము కశ్మీర్‌లో నిత్యం అల్లకల్లోలమే. ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లలో అతి కొద్ది దూరం నుంచే నేరుగా స్నైపర్ బుల్లెట్స్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనల్ని ఫేస్ చేసి ఓ ఆర్మీ ఆఫీసర్ తనే సొంతంగా డిజైన్ చేసి, సరికొత్త ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తయారు చేశారు. ఇది వేసుకుంటే కేవలం 10 మీటర్ల దూరం నుంచి స్నైపర్ బుల్లెట్ తగిలినా ఏమీ కాదు.

తృటిలో ప్రాణాలతో బయటపడి..

జమ్ము కశ్మీర్‌లోని కల్లోల పరిస్థితుల మధ్య ఆర్మీ మేజర్ అనూప్ మిశ్రా కొన్నాళ్లపాటు డ్యూటీ చేశారు. ఓ సారి జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల్ని ఏరివేసే ఆపరేషన్‌లో స్నైపర్ బుల్లెట్ దెబ్బతిన్నారు. నాడు ఆయన బుల్లెట్  ప్రూఫ్ జాకెట్ వేసుకుని ఉన్నారు. అయినా శరీరానికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ గాయం ఆయనలో ఆలోచనరేపింది. స్నైపర్ బుల్లెట్స్‌ను సైతం తట్టుకునే ఫుల్ బాడీ ప్రూఫ్ బుల్లెట్ జాకెట్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు.

ఆర్మీ మేజర్ అనూప్ మిశ్రా (బ్లూ కోట్) తయారు చేసిన ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌తో ఓ సైనికుడు

ఆర్మీ చీఫ్ నుంచి ఎక్స్‌లెన్స్ అవార్డు

పుణేలోని మిలటరీ ఇంజినీరింగ్ కాలేజీలో ఆర్మీ మేజర్ అనూప్ మిశ్రా ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌కు రూపమిచ్చారు. తానే స్వయంగా డిజైన్ చేసి, దాన్ని తయారు చేశారు. శరీరం మొత్తాన్ని కవర్ చేసేలా డిజైన్ చేసిన ఈ స్వదేశీ లెవల్-4 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌కు ‘సర్వత్ర’ అని పేరు పెట్టారు. 10 మీటర్ల దూరం నుంచి స్నైపర్‌తో కాల్చినా జవాన్లకు ఏమీ కాదని అనూప్ మిశ్రా తెలిపారు. ఈ ఆవిష్కరణకు మేజర్ అనూప్ మిశ్రాను మెచ్చుకుంటూ ఆర్మీ డిజైన్ బ్యూరో ఎక్స్‌లెన్స్ అవార్డు అందజేశారు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్. ఇప్పటికే మిశ్రా తయారు చేసిన ఫుల్ బాడీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ టెస్టింగ్ పూర్తయిందని, త్వరలోనే భారీ సంఖ్యలో వీటి తయారీకి టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పారాయన.

భారత్ – పాక్ సరిహద్దుల్లో, కశ్మీర్‌లోని మన జవాన్లకు ఈ స్నైపర్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ ఎంతో ఉపయోగపడుతుందని మిశ్రా అన్నారు. శరీరం మొత్తంలో ఎక్కడ బుల్లెట్ తగిలినా ఏమీ కాదని చెప్పారాయన.