- మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు అడ్డాలివి
- వెల్లడించిన ‘శాస్త్ర’ రీసెర్చ్ రిపోర్ట్
న్యూఢిల్లీ: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా పనిచేస్తున్నాయని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయానికి చెందిన సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ రీసెర్చ్ అసోసియేషన్ (శాస్త్ర) వెల్లడించింది. ఐటీ రూల్స్ 2021 అనుమతిగల ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్, చట్టవిరుద్ధమైన బెట్టింగ్, జూదం పద్ధతుల మధ్య తేడాను వివరిస్తుంది.
అయినప్పటికీ, భారతదేశ చట్టాలకు అనుగుణంగా పనిచేసే చట్టబద్ధ ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను గుర్తించేందుకు రిజిస్ట్రేషన్ విధానం అవసరమని రిపోర్ట్ సూచించింది. దీని ప్రకారం.. చట్టవిరుద్ధ ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ అప్లికేషన్‌లు సైబర్ సెక్యూరిటీ దాడుల వంటి ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ జూదం వెబ్‌సైట్‌లు మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్‌కు మార్గాలుగా పని చేస్తున్నందున అవి భారతదేశ జాతీయ భద్రతకు కూడా ముప్పుగా మారాయి.
ప్రస్తుత రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన కార్యకలాపాల మధ్య తగినంతగా తేడా చూపడం లేదు. ఫలితంగా అక్రమ ప్లాట్‌ఫారమ్‌లు మనీలాండరింగ్‌తో సహా ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి.
మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లు!
భారతదేశంలో బెట్టింగ్, జూదం మార్కెట్ పరిమాణం లేదా ఈ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంపై అధికారిక అంచనా లేనప్పటికీ, 2017 నాటి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అక్రమ బెట్టింగ్ జూదం మార్కెట్ విలువ విపరీతంగా పెరిగింది. ఇది 150 బిలియన్లు లేదా దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. ‘‘అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలు మన ఆర్థిక వ్యవస్థ నుంచి డబ్బును బయటకు తీసి విదేశాలకు పంపుతాయి.
ఆర్థిక అస్థిరతకు, తద్వారా నేర కార్యకలాపాలకు కారణమవుతాయి. చట్టబద్ధమైన ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ల మధ్య చట్టంలో తేడాను చూపేందుకు ఐటీ రూల్స్, 2021ని అమలు చేయాలి”అని రిపోర్ట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌ను నిషేధించడానికి పూర్తిస్థాయి నియంత్రణ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రవేశపెట్టాలని సూచించింది. ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించినా ఇంకా అమలు చేయలేదని పేర్కొంది.